ప్రతి ముద్దలో కల్తీ | other 10 varieties of ghee | Sakshi
Sakshi News home page

ప్రతి ముద్దలో కల్తీ

Published Wed, Nov 25 2015 12:57 AM | Last Updated on Sun, Sep 3 2017 12:57 PM

other 10 varieties of ghee

పదేపదే పట్టుబడినా అదే తీరు
పోలీసు కాలనీలోనే తయారీ
నెయ్యితో పాటు మరో 10 రకాలు
పట్టుబడ్డ ప్రధాన నిందితుడు
కర్మాగారానికి సీలు

 
వంటిల్లు కల్తీ అవుతోంది.. తినే ప్రతి ముద్దలోనూ అవే జాడలు కనిపిస్తున్నాయి. పప్పులో వాడే నెయ్యి.. కూరలో వాడే పసుపు, మసాలాలు, ధనియాల పొడి.. ఇలా అన్నీ కల్తీ అయితే ఇక మనిషి ఆరోగ్యానికే ముప్పు వాటిల్లే పరిస్థితి. ఒకేసారి కనిపించకపోయినా.. క్రమేణా ఆరోగ్యం క్షీణించటం ఖాయం. తాజాగా విజయవాడ నగరంలో వెలుగులోకి వచ్చిన కల్తీ నెయ్యి, 10 రకాల ఆహార పదార్థాల దినుసుల వ్యవహారంతో జనం ఆందోళనకు గురవుతున్నారు.
 
విజయవాడ సిటీ : నెయ్యి తయారీకి డాల్డా, రంగు కోసం హానికారక రసాయన మిశ్రమాలు. కారం.. పసుపు.. మసాలా దినుసుల తయారీకి సర్వం సిద్ధం. ఆధునిక యంత్రాలతో అత్యాధునిక ప్యాకింగ్. చూసినవారు పేరొందిన కంపెనీ ఉత్పత్తులుగానే భ్రమించేందుకు నిర్దేశించిన బండిల్స్ కొద్దీ లేబుల్స్. ఇవీ పోలీసులు సోదా చేసిన కల్తీ నెయ్యి గోడౌన్‌లో కనిపించిన దృశ్యాలు. పట్టుబడిన ప్రధాన నిందితుడు ఆవుల ఫణిని వెంటబెట్టుకొని పటమట సీఐ కె.దామోదర్ మీడియా సమక్షంలో ఇందిరానాయక్ నగర్‌లోని కర్మాగారాన్ని తనిఖీ చేశారు. అక్కడి దృశ్యం చూసి అవాక్కయ్యారు. కల్తీ సరకుల తయారీకి సిద్ధం చేసిన ముడి సరకుతో పాటు ప్యాకింగ్ కోసం నిర్దేశించిన లేబుల్స్ పెద్ద మొత్తంలో ఉన్నాయి. 60కి పైగా వేర్వేరు పేర్లతో కూడిన ఉత్పత్తుల  తయారీకి అక్కడ ఏర్పాట్లు ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. పోలీసు కుటుంబాలు నివాసం ఉండే కాలనీలోనే గుట్టుగా సాగుతున్న కల్తీ ఉత్పత్తులు నగర వాసులను ఆశ్చర్యానికి, ఆందోళనకు గురిచేస్తున్నాయి. మూడంతస్తుల విశాల భవనంలో అత్యాధునిక యంత్రాలు ఏర్పాటు చేసి ఆవుల ఫణికుమార్ కల్తీ దందా నిర్వహిస్తున్నాడు. కొద్ది రోజుల కిందట ప్రజాప్రతినిధులు దాడి చేసి కల్తీ బాగోతాన్ని వెలికితీయడంతో పోలీసు, ప్రజల దృష్టిని మరల్చేందుకు ఆగిరిపల్లి మండలం నెక్కలం గొల్లగూడెం గ్రామంలో కల్తీ నెయ్యి తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసిన రోజుల వ్యవధిలోనే పోలీసులకు చిక్కాడు.

ఇదీ జరిగింది : గుంటూరుకు చెందిన ఆవుల ఫణీంద్ర కుమార్ అలియాస్ ఫణి తన బావ అనిల్ కుమార్‌తో కలిసి బతుకుదెరువు కోసం నగరానికి వచ్చాడు. ప్రారంభంలో పాతబస్తీలోని ప్రియా గోల్డ్ సంస్థలో గుమాస్తాలుగా పని చేశారు. అనతి కాలంలోనే వ్యాపార మెలకువలను తెలుసుకొని నకిలీ కల్తీ నెయ్యికి శ్రీకారం చుట్టారు. నగర శివారు ప్రాంతమైన అజిత్‌సింగ్‌నగర్ ఇందిరా నాయక్ నగర్‌లో స్థలం కొనుగోలు చేసి కల్తీ నెయ్యి తయారీ ప్రారంభించాడు. శ్రీ దుర్గా ఫుడ్ ప్రొడక్ట్స్ పేరిట లెసైన్స్ తీసుకొని నిర్వహిస్తున్న కల్తీ వ్యాపారంపై 2012లో నున్న పోలీసులు దాడి చేసి అరెస్టు చేశారు. ఆ తర్వాత కొద్ది రోజులు గుంటూరు జిల్లా దుగ్గిరాలలో నిర్వహించగా ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. దీంతో స్వస్థలమైన గుంటూరును కేంద్రంగా చేసుకొని కల్తీ మసాలా దినుసుల వ్యాపారం ప్రారంభించి మరోసారి పోలీసులకు చిక్కాడు. రెండు నెలల క్రితం పాత ప్రాంతంలోనే పట్టుబడినా, మరోసారి నెక్కలం గొల్లగూడెంలో నెయ్యి తయారుచేస్తూ ఈ నెల 13న టాస్క్‌ఫోర్స్ పోలీసులకు చిక్కటం గమనార్హం.
 బలమైన నెట్‌వర్క్ :  గత పదేళ్ల కాలంలో రాష్ట్రంలోని ప్రధాన పట్టణాలతో పాటు ఒడిశా, తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల్లో నెట్‌వర్క్ విస్తరించుకున్నాడు. దాదాపు 150 మందికి పైగా డిస్ట్రిబ్యూటర్లు, ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని కల్తీ దందా చేస్తున్నాడు. నెలకు రూ.25 కోట్ల మేర వ్యాపారం జరుగుతున్నట్టు పోలీసులు గుర్తించారు. మార్కెట్‌లో అసలు నెయ్యి కిలో రూ.450 నుంచి రూ.500 వరకు ఉంది. దీనిపై మార్జిన్ కూడా పెద్దగా ఉండదు. వీరు తయారుచేసి విక్రయిస్తున్న నెయ్యి కిలో రూ.150కి మాత్రమే సరఫరా చేస్తుండటం గమనార్హం.

 సహకరించిన వారిపైనా కేసులు : నకిలీ నెయ్యి తయారీ చేసిన వ్యక్తులతో పాటు ఇందుకు సహకరించిన వారిపై కూడా కేసుల నమోదుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే 30 మంది డీలర్ల జాబితాను పోలీసులు సేకరించారు. పరారీలోని నిందితులతో పాటు వీరి అరెస్టుకూ రంగం సిద్ధం చేస్తున్నారు. పదే పదే పట్టుబడినా కల్తీ వ్యాపారం కొనసాగిస్తున్న ఆవుల ఫణీంద్రపై రౌడీషీటు తెరిచే ఆలోచన కూడా చేస్తున్నట్టు సమాచారం.

 కల్తీ కాదు.. కాపీరైట్ ఉల్లంఘనే  : ఫణీంద్ర
 తాను కల్తీ నెయ్యి, ఇతర ఆహార ఉత్పత్తులు తయారు చేస్తున్న మాట అవాస్తవమని ప్రధాన నిందితుడు ఆవుల ఫణి చెబుతున్నాడు. అరెస్టు సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కాపీ రైట్ కోసం దరఖాస్తు చేశానని, ఇంకా అనుమతులు రాలేదని తెలిపాడు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement