
వైఎస్సార్‌సీపీలో చేరిన వారితో పార్టీ నాయకులు అమర్‌నాథ్, అదిప్‌రాజ్
అగనంపూడి (గాజువాక): టీడీపీ పాలనకు చరమ గీతంపాడే రోజులు దగ్గర పడ్డాయని వైఎస్సార్‌సీపీ అనకాపల్లి పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. పరవాడ మండలం సాలాపువానిపాలెంలో టీడీపీకి చెందిన 50 కుటుంబాల వారు వైఎస్సార్‌సీపీలో చేరారు. ఈ సందర్భంగా అమర్‌నాథ్ మాట్లాడుతూ చంద్రబా బు పాలనతో విసిగిన ప్రజలు ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నారన్నారు. అనకాపల్లి పార్లమెంట్ నియోకవర్గ ఇన్‌చార్జ్ వరుదు కల్యాణి మాట్లాడుతూ చంద్రబాబునాయుడు పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, వృద్ధులు, సామాన్యులు దగా పడ్డారన్నారు. పెందుర్తి నియోజకవర్గ కోఆర్డినేటర్ అన్నంరెడ్డి అదీప్‌రాజు మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రజలు టీడీపీతో విసిగిపోయి తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు.
వైఎస్సార్‌సీపీ గ్రామ అధ్యక్షుడు సాలాపు నానాజీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకుడు, జన్మభూమికమిటీ సభ్యుడు సాలాపు అప్పారావు, మాజీ ఉప సర్పంచ్ సాలాపు కనకరాజు, వార్డు సభ్యుడు సాలాపు నూకరాజు, లారీ ఓనర్లు సాలాపు శ్రీనివాసరావు, నానాజీ, రామకృష్ణ, అప్పలనాయుడు, బాబూరావుతో పాటు 50 కుటుంబాలకు చెందిన వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యదర్శి ఇల్లపు ప్రసాద్, పెందుర్తి నియోజకవర్గం నాయకులు పైలా శ్రీనివాసరావు, 56వ వార్డు పార్టీ అధ్యక్షుడు జి.పూర్ణానందశర్మ (పూర్ణ), పరవాడ మండల అధ్యక్షుడు సిరపురపు అప్పలనాయుడు, పరవాడ సర్పంచ్ చుర్కా రామునాయుడు, నాయకులు సుందరపు అప్పారావు, పచ్చికోరు రమణమూర్తి, సేనాపతి గంగరాజు తదితరులు పాల్గొన్నారు.
జన్‌తోనే సుపరిపాలన
పీఎంపాలెం(భీమిలి): మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి రాష్ట్ర ప్రజలకు అందించిన ఆదర్శపాలన ప్రజలకు అందించడానికి వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంసిద్ధంగా ఉన్నారన్నారని ఆ పార్టీ విశాఖ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు తైనాల విజయకుమార్ అన్నారు. ఆదివారం శిల్పారామంలో భీమిలి నియోజకవర్గ పరిధిలోని 4,5,6 వార్డుల బూత్ కమిటీల కన్వీనర్ల, సభ్యుల శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా తైనాల మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్ధానాలు అమలు పరచడంలో విఫలమైన బాబు ప్రభుత్వం ప్రజా విశ్వాసం కోల్పోయిందన్నారు. నాలుగేళ్ల పాలనలో పట్టించుకోకుండా... మరోమారు రాష్ట్ర ప్రజలను మోసగించడానికి చంద్రబాబు వేస్తున్న నక్కజిత్తులను నమ్మే స్థితిలో రాష్ట్ర ప్రజలు లేరన్నారు. భీమిలి సమన్వయకర్త అక్కరమాని విజయనిర్మల మాట్లాడుతూ టీడీపీ నాయకుల భూ కబ్జాలతో భీమిలి ప్రతిష్టను మసకబర్చారని మండిపడ్డారు.
మాజీ ఉపసర్పంచ్ చేరిక
వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వం మీద విశ్వాసంతో బక్కన్నపాలెం
మాజీ ఉపసర్పంచ్ ఆర్. స్వామినాయుడు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకు తైనాల విజయకుమార్ పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు.ఆయనతో పాటు 150 మంది అనుచరులు చేరారు. ఈ సందర్భంగా స్వామినాయుడు మాట్లాడుతూ పార్టీ పటిష్టతకు కృషి చేస్తానన్నారు.

పార్టీ కండువా కప్పి ఆహ్వానిస్తున్న వైఎస్సార్‌సీపీ విశాఖ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు తైనాల