
మా కొంపలు కూల్చొద్దు
మంత్రి వద్ద గోడు వెల్లబోసుకున్న మహిళలు
విజయవాడ సెంట్రల్/ పూర్ణానందంపేట : ‘మా కొంపలు కూల్చి రోడ్డున పడేయొద్దయ్యా’ అంటూ పాతరాజ రాజేశ్వరిపేట మహిళలకు మంత్రి పి.నారాయణ వద్ద వాపోయారు. కార్పొరేటర్ అల్లు జయలక్ష్మి ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం నగరపాలక సంస్థ కార్యాలయంలో మంత్రిని కలిసి తమగోడు వెళ్లబోసుకున్నారు. ఈ నెలాఖరు లోపు ఇళ్లు ఖాళీ చేయాల్సిందిగా రైల్వే అధికారులు 1,700 మందికి నోటీసులు జారీ చేశారని షేక్ ఖుర్షీదా, వైజయంతిమాల తదితరులు మంత్రి పి.నారాయణ దృష్టికి తీసుకెళ్లారు. 40 ఏళ్ళుగా అక్కడే ఉంటున్నామన్నారు.
ఆస్థలం తమదంటూ నోటీసులు జారీ చేసిన రైల్వే అధికారులు ఖాళీ చేయించేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశారని వివరించారు. ఈ సమస్యను ఎంపీ కేశినేని నాని దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. జక్కంపూడిలో జేఎన్‌ఎన్యూఆర్‌ఎం ఇళ్ల పంపిణీ పూర్తయిపోయిందని, ఇప్పుడు తాము ఉంటున్న ఇళ్లను ఖాళీ చేస్తే రోడ్డున పడతామని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై రైల్వే అధికారులతో చర్చిస్తానని మంత్రి హామీ ఇచ్చారు.