పాములపాడు/ జూపాడుబంగ్లా : ప్రాజెక్టుల వద్ద నిద్రించి వాటిని సకాలంలో పూర్తి చేయించి రాష్ట్రాన్ని కరువురహితంగా తీర్చిదిద్దుతానని ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు తెలిపారు. పెండింగ్ ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా బుధవారం ఆయన బానకచర్ల నీటినియంత్రణ సముదాయాన్ని పరిశీలించారు. ఉదయం 11.40నిమిషాలకు హెలిపాడ్ వద్ద దిగి నేరుగా తెలుగుగంగ కాల్వ, కేసీ ఎస్కేప్, ఎస్సార్బీసీలను పరిశీలించారు. కాల్వల స్థితిగతులను నీటిపారుదలశాఖ సీఈ చిట్టిబాబును అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఫొటోఎగ్జిబిషన్ తిలకించి పోతిరెడ్డిపాడు ద్వారా 44వేల క్యూసెక్కుల నీటిని ఏయే కాల్వలకు సరఫరా చేస్తారో వివరాలు తెలుసుకున్నారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. కాల్వల విస్తరణ జరగ నందున పూర్తిస్థాయిలో నీటిని దిగువప్రాంతాలకు తరలించుకెళ్లే అవకాశం లేదన్నారు.
ఎస్సార్బీసీపై మరో హెడ్‌రెగ్యులేటరు నిర్మించి గోరుకల్లు, అవుకు రిజర్వాయర్లకు 19 టీఎంసీల నీటిని తరలించు కెళ్లాల్సి ఉందన్నారు. పనులు చేయకుండా తమాషా చేస్తున్న కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్టులో పెట్టి మరొకరి చేత పనులు చేయిస్తామని తెలిపారు. రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను పాటించి తక్కువ సాగునీటితో అధికదిగుబడులు సాధించేందుకు కృషిచేయాలని సూచించారు. ముచ్చుమర్రి, సిద్దాపురం ఎత్తిపోతల పథకాలను త్వరగా పూర్తిచేయిస్తానని హామీనిచ్చారు.
ఆలస్యంగా సీఎం రాక..
బానకచర్ల నీటినియంత్రణ సముదాయం వద్దకు ఉదయం 9.45 నిమిషాలకు సీఎం రావాల్సి ఉంది. అయితే రెండుగంటలు ఆలస్యంగా 11.45నిమిషాలకు సీఎం వచ్చారు. హెలిపాడ్ వద్ద వీఐపీలకు సేమియానా, తాగునీరు.. వంటి కనీస సౌకర్యాలు కల్పించకపోవటంతో ఎండతీవ్రతకు వారు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
సీఎం సభ సైడ్‌లైట్స్
► ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వస్తున్న హెలికాప్టర్ హెలిపాడ్ చేరే సందర్భంలో బహిరంగ సభలో కుర్చీల్లో కూర్చొన్న ప్రజలంతా అక్కడి చేరుకున్నారు. దీంతో సభలో కుర్చీలు ఖాళీగా కన్పించాయి.
► సీఎం బహిరంగ సభను ఉద్దేశించి మాట్లాడుతున్న తరుణంలో సభలో ఉన్న కొందరు ఎంఆర్‌పీఎస్ కార్యకర్తలు ఎస్సీ వర్గీకరణ చేపట్టాలంటూ జెండాలను ప్రదర్శించి ఆందోళనకు దిగడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
► బహిరంగ సమావేశం జరుగుతుండగా హెలిపాడ్ నుంచి ెహ లికాప్టర్ ఎగరడంతో జనాల దృష్టి ఒక్కసారిగా అక్కడికి మళ్లింది.
► సభ ప్రారంభం కాగానే అధ్యక్ష స్థానంలో బీసీ జనార్దన్‌రెడ్డి నియోజక వర్గ సమస్యలపై సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చారు.
► బహిరంగ సమావేశంలో ముఖ్యమంత్రి నీరు- చెట్టు ద్వారా గ్రామాల్లో ఏం పనులు చే శారంటూ సభలోని వ్యక్తులకు మైకు ఇచ్చి వారితో మాట్లాడించారు.
► రుణాలు సక్రమంగా చెల్లించినా బ్యాంకు లింకేజీ రుణాలు ఇవ్వడం లేదని, సక్రమంగా రుణాలు చెల్లించిన గ్రూపులను, చెల్లించని గ్రూపులను బ్యాంకర్లు ఒకే విధంగా చూస్తూ రుణాలు ఇవ్వడం లేదని పొదుపు మహిళలు సీఎం దృష్టికి తెచ్చారు.
► మహిళలు మాట్లాడేందుకు ముందుకు రావాలని బహిరంగ సమావేశంలో మహిళలను వెనుకవైపు కూర్చొబెట్టారని, వారికి ముందు సీట్లలో ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం పేర్కొన్నారు.
► కొందరు భక్తులు అయ్యప్పమాల, భవానీ మాలలు వే స్తున్నట్లుగానే తాను జలదీక్ష చేపట్టానని సీఎం ప్రకటించారు.
► చేపలు తింటే ఆరోగ్యానికి మంచిదని, తెలివితేటలు పెరుగుతాయని, చేపల పెంపకానికి అధిక ప్రాముఖ్యత ఇవ్వాలని సీఎం అన్నారు.
కరువు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతా
Published Thu, May 14 2015 5:02 AM | Last Updated on Tue, Aug 14 2018 11:24 AM
Advertisement
Advertisement