‘రాష్ట్రాన్ని ఎందుకు విభజిస్తున్నారు.. ఎవరిని అడిగి విభజిస్తున్నారు.. మాటిమాటికీ అన్ని రాజకీయపార్టీలు లేఖలు ఇచ్చాయంటున్నారు...ప్రజలు ఎన్నుకున్న రాజకీయనాయకులు ప్రజాభిప్రాయాలు తెలుసుకోకుండా లేఖలు ఎలా ఇచ్చారు, రాష్ట్రం విడిపోతున్నట్లు తెలిసినా ఎందుకు పదవులు పట్టుకుని ఊగులాడుతున్నారు.. ఓ ప్రధాన రాజకీయపార్టీ అధ్యక్షునిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాజీనామా చేసి జైలులో ఉద్యమం చేస్తున్నారు.. ఇప్పటికైనా అన్ని పార్టీల నేతలు రాజీనామాలు చేసి ‘సమైక్య’తాటిపైకి రావాలి.. సమైక్యం కోసం ఎవరు చిత్తశుద్ధితో ఉద్యమిస్తే వారందరికీ మా మద్దతు ఉంటుంది’ అని ప్రజా, కుల, ఉద్యోగ సంఘాలతో పాటు అన్ని వర్గాల ప్రజలు ముక్తకంఠంతో నినదించారు.
సాక్షి, కడప: రాష్ట్రవిభజన నేపథ్యంలో ‘సాక్షి’ ఆధ్వర్యంలో మంగళవారం నగరంలోని హరిత ఫంక్షన్‌హాలులో ‘ఎవరెటు’ అనే చర్చావేదిక నిర్వహించారు. నాగరాజు వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ చర్చలో మేధావులు, నీటిపారుదలరంగ నిపుణులు, ఉపాధ్యాయులు, వైద్యులు, న్యాయవాదులు, విద్యార్థులతో పాటు పలు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. విభజనతో తలెత్తే సమస్యలపై ఆసక్తికర చర్చసాగింది. ప్రజల ఓట్లతో పదవులు అనుభవిస్తున్న ప్రజాప్రతినిధులు వారి పదవులకు రాజీనామాలు చేసి రాజ్యాంగ సంక్షోభం సృష్టించి ఉద్యమంలో పాల్గొనాలని మాజీ ఎమ్మెల్సీ పోచంరెడ్డి సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. ఇంతలో ఇంటాక్ కన్వీనర్ ఎలియాస్ రెడ్డి కల్పించుకుని ఓపార్టీ అధినేతగా జగన్‌మోహన్‌రెడ్డి సమైక్యరాష్ట్రం కోసం రాజీనామా చేసి, దీక్ష చేస్తున్నారని అయనకు మద్దతు ఇవ్వాలన్నారు. సమైక్యరాష్ట్రం కోసం ఉద్యమించే అన్ని పార్టీలకు మద్దతిస్తామన్నారు.
వెంటనే వేణుగోపాల్‌రెడ్డి అనే ఉపాధ్యాయుడు మైకందుకున్నారు. కోట్లాదిమంది రోడ్డుపైకి వచ్చి నినదిస్తుంటే, రాజకీయనేతలకు కనపడటం లేదా అని ప్రశ్నించారు. సీమాంధ్రుల సమావేశానికి హైదరాబాద్‌లో అనుమతి ఇవ్వకపోయినా నేతలు స్పందించడం లేదంటే ఇంత కంటే సిగ్గుచేటు మరొకటి లేదన్నారు. ఇంతలో ప్రత్యూష అనే మరో మహిళ ఫైర్ అయ్యారు. ‘రాజకీయనేతలకు ఓట్లేసి గెలిపించాం. అయినా ప్రజాభిప్రాయాన్ని వారు గౌరవించడంలేదు. ఏమాత్రం సిగ్గులేకుండా పదవులను పట్టుకుని ఊగలాడుతున్నారని ధ్వజమెత్తారు. 130 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్‌పార్టీ విభజనకు కారణం చెప్పడంలేదని, ఇదే వైఖరిని అవలంభిస్తే మరో వందేళ్లపాటు కాంగ్రెస్‌జాడ సీమాంధ్రలో కనిపించదని డైట్ అధ్యాపకులు కృష్ణ హెచ్చరించారు. విడిపోతే తలెత్తే సమస్యలపై రాయలసీమకార్మిక, కర్షక సమితి అధ్యక్షుడు సీహెచ్ చంద్రశేఖరరెడ్డి సవివరంగా చెప్పారు. ఇంటిని నిర్మించాలంటేనే ఏడేళ్లు పడుతోందని, రాజధానిని నిర్మించుకోవాలంటే 30 ఏళ్లు పడుతుందని రాజంపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శరత్‌కుమార్‌రాజు అన్నారు. జగన్ జైలులో కూడా దీక్ష చేస్తున్నారని, తక్కిన పార్టీల నేతలు ఉద్యమంలో రాకపోతే గోచీలు ఊడగొడతామని రాయచోటి జేఏసీ నాయకుడు శ్రీనివాసరాజు హెచ్చరించారు. రాష్ట్ర బడ్జెట్ 1.71 లక్షల కోట్లు.. విడిపోతే సీమకు వచ్చే అప్పు 1.02 లక్షల కోట్లు.. దీంతో బతకాలా.. అప్పుల తీర్చలేక బానిసలుగా ఉండాలా అని రామ్మూర్తి అనే ఉద్యోగి ప్రశ్నించారు.
రాజధానిలో శంషాబాద్ ఏయిర్‌పోర్టు, 159 కిలోమీటర్ల రింగ్‌రోడ్డు, మెట్రోరైలు, ఫ్లైఓవర్లు, హైటెక్‌సిటీతో పాటు ఎన్నో నిర్మాణాలకు సమష్టి డబ్బు ఖర్చు చేశారని, ఇవన్నీ తెలంగాణవారికి చెందుతాయంటే ఎలా అని జయరామయ్య అనే ఉద్యోగి ప్రశ్నించారు. విడిపోతే రాయలసీమ ఎడారి అవుతుందని, ఇప్పటికే అనంతపురంలో ఆ ఛాయలు కనిపిస్తున్నాయని మహేశ్వరి అనే టీచర్ అన్నారు. కొందరు సమైక్యాంధ్రకు మద్దతుగా పాటలు పాడారు. మరికొందరు చర్చ జరిగినంత సేపు సమైక్యనినాదాలతో హోరెత్తించారు. ఇంకొందరు సమైక్యాంధ్రకు మద్ధతుగా ఫ్లకార్డులు ప్రదర్శించారు. మొత్తం మీద అన్ని వర్గాల ప్రజలు సమైక్యాంధ్రగానే రాష్ట్రాన్ని కొనసాగించాలని ఎలాంటి పరిస్థితుల్లో విభజనకు ఒప్పుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
సమస్యలపై చర్చించాలి
పోచంరెడ్డి సుబ్బారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ
విభజన వల్లే తలెత్తే ఇబ్బందులపై మూడు ప్రాంతాల ప్రతినిధులతో చర్చించాలి . ఉద్యమం వల్ల అన్ని ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ నిలిచిపోయింది. ఓట్లద్వారా గెలిచి పదవులు అనుభవిస్తున్న నేతలు రాజకీయ సంక్షోభాన్ని సృష్టించాలి. అది చేయనందున ప్రజలు ఉద్యమిస్తున్నారు.
భరోసా ఎవరు :
సీహెచ్ చంద్ర శేఖరరెడ్డి, రాయలసీమ, కార్మిక,కర్షక సమితి అధ్యక్షుడు.
ఆంటోని కమిటీ వేశారు.. వారికి మన రాష్ట్ర పుట్టుపూర్వోత్తరాలు, భౌగోళిక పరిస్థితులు తెలీవు.. విశాలాంధ్ర కోసం బళ్లారిని త్యాగం చేశాం.. ఆపై కర్నూలు.. తద్వారా 50 ఏళ్ల అభివృద్ధికి సీమ జిల్లాలు దూరమయ్యాయి. తుంగభద్ర డ్యాంను కోల్పోయాం.. కరువు ప్రాంతాలైన సీమ జిల్లాలను వదిలి, వర్షపాతం బాగా ఉన్న ప్రాంతాలకే నాగార్జునసాగర్, కృష్ణాబ్యారేజ్ ద్వారా సాగునీరు అందించారు.. అయినా పోరాడుతున్నామే తప్ప.. విడిపోతామనలేదు. రాష్ట్రంలో సీమ కంటే వెనకబడిన ప్రాంతం మరొకటి లేదు.. విడిపోతే కృష్ణాపై ఉన్న ప్రాజెక్టులన్నీ అంతరాష్ట్ర ప్రాజెక్టులవుతాయి. దీంతో మిగులు జలాలపై ఆధారపడి నిర్మితమైన ప్రాజెక్టులకు నీరందదు. సీమ శాశ్వతంగా ఎడారి అవుతుంది.
మా మద్దతు.. సమైక్యవాదులకే
Published Wed, Aug 28 2013 5:39 AM | Last Updated on Fri, Mar 22 2019 6:18 PM
Advertisement
Advertisement