మన ఊసేలేదు!
నిన్న రైల్వే బడ్జెట్.. నేడు కేంద్ర సాధారణ బడ్జెట్.. దేనిలోనూ జిల్లాకు తగిన ప్రాధాన్యత దక్కలేదు. రైల్వే బడ్జెట్‌లో గుర్తింపు లభించకపోయినా సాధారణ బడ్జెట్‌లో పెద్దపీట వేసేలా గులాబీ నేతలు లాబీయింగ్ చేస్తారని అందరూ ఆశించారు. కేంద్ర పౌరవిమాన శాఖ మంత్రిగా టీడీపీ ఎంపీ అశోక్‌గజపతి రాజు ఉండటంతో గన్నవరం విమనాశ్రయ అభివృద్ధికి నిధులు మంజూరుచేయిస్తారని భావించారు. కానీ మరోసారి జిల్లాకు మొండిచెయ్యే చూపారు.
సాక్షి, విజయవాడ : కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ గురువారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై జిల్లావాసులు పెదవి విరుస్తున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని ఏర్పడుతుందని, కేంద్ర బడ్జెట్‌లో భారీ ప్రాజెక్టులు ప్రకటిస్తారని ఆశించగా... జిల్లాకు మొండి చెయ్యి చూపించడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. రాష్ట్ర విభజన బిల్లులో ప్రస్తావించిన ఐఐటీ, ఎయిమ్స్, వ్యవసాయ విశ్వవిద్యాలయం తదితర అంశాలనే బడ్జెట్‌లో కూడా పేర్కొనడంపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. భారీ ప్రాజెక్టులను సాధించడంలో జిల్లాకు చెందిన ఇద్దరు ఎంపీలు పూర్తిగా విఫలమయ్యారని విపక్ష నేతలు విమర్శిస్తున్నారు.
పోర్టుల ఊసే లేదు!
ప్రస్తుతం గన్నవరం విమానాశ్రయం, బందరు పోర్టుల అభివృద్ధి చేయాలంటే కచ్చితంగా కేంద్ర ప్రభుత్వం సహాయం అవసరం. రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో ఎయిర్‌పోర్టు విస్తరణ, బందరు పోర్టు నిర్మాణానికి భూసేకరణ కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసే స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం లేదు. ఎన్టీఏ భాగస్వామి అయిన టీడీపీ ఎలాగైనా కేంద్ర బడ్జెట్ ద్వారా వీటిని అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తుందని అందరూ భావించారు. రాష్ట్రానికి చెందిన అశోక్‌గజపతిరాజు కేంద్ర పౌరవిమానశాఖ మంత్రిగా ఉండటంతో కనీసం ఎయిర్‌పోర్టుకు అయినా మహర్దశ పడుతుందని ఆశించారు. కానీ ఇందుకు విరుద్ధంగా బడ్జెట్‌లో వీటి ఊసే లేకపోవడంతో ఈ పోర్టుల అభివృద్ధి ఏ మేరకు జరుగుతాయనేది అనుమానమే.
ధరల స్థిరీకరణ నిధులపై ఆగ్రహం..
ధరల స్థిరీకరణకు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులపై విపక్షాల నేతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ధరల స్థిరీకరణ నిధికి రూ.500కోట్లు కేటాయించడమంటే సగటున ఒక్కో మనిషికి రూ.5లు కేటాయించినట్లు. తలకు రూ.5 చొప్పున కేటాయించి ధరలను ఏ విధంగా స్థిరీకరిస్తారని వామపక్షనేతలు ప్రశ్నిస్తున్నారు. పెట్రోలియం సబ్సిడీని 22,054 కోట్లకు కుదించడం వలన పెట్రో ఉత్పత్తుల ధరల రాబోయే ఏడాది కాలంలో పెంచేందుకే మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉందని అర్థమవుతోందని, పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలను ఈ ప్రభుత్వం ఏమీ ఆదుకుంటుందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పన్ను మినహాయింపుపైనా అసంతృప్తి
ఆదాయపు పన్ను పరిమితిని రూ.2లక్షల నుంచి రూ.2.50లక్షలకు మాత్రమే పెంచటం మధ్య తరగతి ఉద్యోగులను నిరాశను మిగిల్చింది. కొద్దిరోజులుగా ఐటీ పరిమితిని రూ.4లక్షల నుంచి రూ.5లక్షలకు పెంచవచ్చనే ప్రచారం జరిగింది. దీంతో తమకు మేలు జరుగుతుందని ఆశించిన జిల్లాలోని ఉద్యోగులకు నిరాశే మిగిలింది. వ్యవసాయ రంగం పట్ల కూడా మోడీ ప్రభుత్వం చిన్న చూపు చూసిందని, రైతులకు కంటి తుడుపుగా కొన్ని పథకాలు ప్రకటించిందని వాటి వల్ల పెద్దగా ఒరిగేదేమీ లేదని రైతు నాయకులు మండిపడుతున్నారు.