మనది ఒకటే మతం అదే భారతీయత
కర్నూలు(రాజ్‌విహార్): భారత దేశంలో నివశించే పౌరులంతా ఒక్కటే అని, మత సామరస్యంలోనే జాతీయ సమైక్యత సాధ్యమవుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ కన్నబాబు అన్నారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో జిల్లా మైనారిటీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ‘జాతీయ సమైక్యత- మతాల సామరస్యంపై సదస్సు, వర్క్‌షాపు, ముషాయిర కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో కవులను సన్మానించారు.
ఈ నెల 24వ తేదీన కేవీఆర్ కళాశాలలో నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు మెమెంటోలు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ కన్నబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యూరు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో అన్ని కుల, మతాలకు పూర్తి స్వేచ్ఛ ఉందన్నారు. హిందు, ముస్లిం, క్రైస్తవుల మతాలు, కులాలు వేరైనా అందరూ భారతీయులేనని వివరించారు. పండుగలు, సంస్కృతులు వేరైనా అందరూ కలిసి చేసుకోవడం అభినందనీయమన్నారు.
అనంతరం మైనారిటీ కార్పొరేషన్ అసిస్టెంట్ జనరల్ మేనేజరు ఎంఎ బారి మాట్లాడుతూ దేశ ప్రజలు జీవన విధానం వేరైనా సమైక్యతతో ఉండాలన్నారు. పరాయి మతాలను గౌరవించే మతమే అన్నింటికంటే గొప్పదని, మతాల సమరస్యాలు, జాతీయ సమైక్యత, దేశ భద్రత, ప్రజల ఐక్యత వంటి విషయాన్ని పిల్లలకు చిన్నతనం నుంచే నేర్పించాలన్నారు. మనుషులను సన్మార్గంలో నడిపించేందుకే మతాలు పుట్టుకొచ్చాయని, ఇవి ఉంటనే మంచి, చెడు మార్గాలు తెలుస్తాయన్నారు.
అయితే అన్నిమతాలు సమానమే అనే విషయాన్ని గ్రహించాలని విద్యార్థులకు సూచించారు. సెక్యులర్ భావాలను పెంపొందించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమానికి మైనారిటీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టరు షేక్ ఫజీలే ఇలాహి అధ్యక్షత వహించారు. మైనారిటీ సంక్షేమాధికారి షేక్ మస్తాన్ వలి, ముస్లిం పెద్దలు మౌలానా ముస్తఖీమ్ సాహెబ్, మౌలానా మహఫూజ్ ఖాన్ సాహెబ్, మౌలానా యూసుఫ్ సాహెబ్, మైరిటీ నాయకులు రోషన్ అలీ, షంషుద్దీన్, క్రైస్తవ మత పెద్దలు ఎస్టీబీసీ కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ ఆర్‌ఆర్‌డీ సంజీవ రాజు, ఫాదర్ లహస్త్రాయ, రెవరెండ్ రవిబాబు, విజయ్‌కుమార్, బాలన్న, హిందూ మత పెద్దలు అజయ్‌కుమార్, సత్యనారాయణ గుప్తా, నక్కలమిట్ట శ్రీనివాసులు, అడ్వకేట్ మనోహర్ శర్మ, వివిధ కళాశాలల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.