సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, చిత్రంలో సీపీ యోగానంద్
సాక్షి, విశాఖపట్నం : రోడ్డు ప్రమాదాల్లో మరణాల రేటును తగ్గించేందుకు త్వరలో నో హెల్మెట్– నో పెట్రోల్ విధానాన్ని అమలు చేయాలని కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. హెల్మెట్ లేని వాహన చోదకులకు పెట్రోల్ పోయకుండా పెట్రోల్ బంకుల యజమానులను ఆదేశించాలన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన రహదారి భద్రత కమిటీ సమావేశంలో పోలీస్ కమిషనర్ యోగానంద్, ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ, వుడా వీసీ బసంత్‌కుమార్‌తో కలిసి పరిస్థితిని సమీక్షించారు.
గతేడాది జరిగిన ప్రమాదాల గురించి డీటీసీ ఎస్.వెంకటేశ్వరరావు పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. 2016లో జరిగిన 2,609 రోడ్డు ప్రమాదాల్లో 551 మంది మరణించారని, 2,058 మంది గాయాలపాలయ్యారని తెలిపారు. దీనిపై కలెక్టర్ మాట్లాడుతూ ద్విచక్రవాహనచోదకులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించేలా చూస్తే చాలావరకు మరణాల రేటును తగ్గించవచ్చన్నారు. హెల్మెట్ వాడకంపై ద్విచక్రవాహనచోదకుల్లో అవగాహన పెరిగేలా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. పోలీస్, రవాణా శాఖలు ప్రత్యేక చొరవతో ద్విచక్రవాహనచోదకులకు హెల్మెట్ తప్పనిసరి చేయాలన్నారు.
సమన్వయంతో సత్ఫలితాలు
అనకాపల్లి–ఆనందపురం జాతీయ రహదారి పనులు నిర్వహించే ముందు సమన్వయ కమిటీతో చర్చించి వారి సూచనలకు అనుగుణంగా పనులు నిర్వహిస్తే మంచి ఫలితాలుంటాయని సీపీ యోగానంద్ అన్నారు. నక్కపల్లి–యలమంచిలి రోడ్డుపై లైటింగ్, సైన్ బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ సూచించారు. సమావేశంలో అదనపు డీసీపీ మహేంద్ర పాత్రుడు, ఏసీపీ కె.ప్రభాకరరావు, ఆర్టీవోలు ఎ.హెచ్. ఖాన్, ఐ.శివప్రసాద్, కేజీహెచ్ అదనపు సూపరింటెండెంట్ డాక్టర్ వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ప్రమాద నివారణ మార్గాలివీ..
► ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన చర్యలను కలెక్టర్ అధికారులకు సూచించారు.
► ‘నో హెల్మెట్.. నో పెట్రోల్’ విధానం అమలుకు కార్యాచరణ రూపొందించాలి.
► జాతీయ రహదారికి అనుసంధానమయ్యే కూడళ్లలో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నందున ఆ జంక్షన్లలో సైన్ బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి.
► కప్పరాడ, మధురవాడ, ఆనందపురం తదితర ప్రాంతాల్లో డివైడర్లు లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నందున వాటిని ఏర్పాటు చేయాలి.
► రద్దీగా ఉండే గాజువాక, ఎన్‌ఏడీ, మద్దిలపాలెం, సత్యం తదితర జంక్షన్లలోనూ సెంట్రల్ మీడియన్ గ్రిల్స్ పాడైపోవడం, కొన్ని చోట్ల లేనందువల్ల ప్రమాదాలు జరుగుతున్నందున వాటిని నిర్మించాలి.
► జాతీయ రహదారి శివారు ప్రాంతాల్లో వీధి దీపాలు లేకపోవడం ప్రమాదాలకు దారి తీస్తున్నందున చర్యలు చేపట్టాలి.
► ప్రధాన రహదారుల్లో ఎక్కడ పడితే అక్కడ వాహనాలు నిలపకుండా పార్కింగ్ స్థలాలను నిర్దేశించి, అన్నిచోట్ల సైన బోర్డులు ఏర్పాటు చేయాలి.
► ప్రమాదాలకు గురైన వారిని వెంటనే ఆస్పత్రులకు తరలించేందుకు వీలుగా ప్రధాన కూడళ్లలో అంబులెన్సులు సిద్ధంగా ఉంచాలి. అంబులెన్స్ వివరాలు తెలియజేస్తూ వాహన యజమానులు, డ్రైవర్లకు ఎస్‌ఎంఎస్ చేయాలి.