ప్రొద్దుటూరు క్రైమ్(వైఎస్సార్ జిల్లా): ప్రొద్దుటూరులోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కోరుతూ ఆస్పత్రి పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం ధర్నా జరిగింది. ఆస్పత్రిలో వైద్యుల కొరతకు తోడు 58 మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను తొలగించడంతో వైద్య సేవలు కుంటుపడ్డాయని పరిరక్షణ కమిటీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. ఆస్పత్రి పరిరక్షణ కమిటీ సభ్యులైన జిల్లా మానవ హక్కుల వేదిక కన్వీనర్ జయశ్రీ, విరసం రాష్ట్ర కార్యదర్శి వరలక్ష్మి తదితరులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. కాగా, ప్రొద్దుటూరు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ఈ ధర్నాలో పాల్గొని తన మద్దతు తెలిపారు.