అసలే వెట్టి చాకిరీ, ఇప్పుడదీ లేకుండా పోయింది. ఎప్పటికైనా తమను క్రమబద్ధీకరిస్తారని ఆశతో తక్కువ వేతనానికి వైద్య విధాన్ పరిషత్ ఆస్పత్రుల్లో పని చేస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను మార్చి నెలాఖరుకు తొలగించాలని ఆ శాఖ కమిషనర్ గతంలో ఆదేశాలు చేశారు. అయితే ఉద్యోగు లు ఆందోళన చేయడంతో గవర్నర్ స్పందించి జూన్ వరకూ గడవు ఇచ్చారు. ఇప్పుడు గవర్నర్ హామీని కూడా లెక్క చేయకుండా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
విజయనగరం ఆరోగ్యం, న్యూస్‌లైన్ : వైద్య విధాన్ పరిషత్ ఆస్పత్రుల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను విధుల నుంచి తొలగించాలని రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. జిల్లాలో కేంద్రాస్పత్రి, ఘోషా ఆస్పత్రి, పార్వతీపురం ఏరియా ఆస్పత్రి, బాడంగి, ఎస్. కోట, గజపతినగరం, భోగాపురం ఆస్పత్రులు వైద్య విధాన పరిషత్ ఆధీనంలో ఉన్నాయి. ఈ ఆస్పత్రుల్లో సి.టి.స్కాన్, ఈసీజీ, టెక్నిషియన్, డార్క్ రూమ్ అసిస్టెంట్, జూనియర్ శానిటరీ వర్కర్ విభాగాల్లో వంద మంది కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పని చేస్తున్నారు. ఈ ఏడాది మార్చి నెలాఖరుతో వారి కాలపరిమితి ముగియడంతో అప్పట్లో వారిని తొలగించాలని వైద్య విధాన పరిషత్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు.
స్పందించిన గవర్నర్ నరసింహన్ కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను జూన్ నెలఖారు వరకు కొనసాగించాలని ఆదేశాలు జారీ చేశారు. తమ ఉద్యోగాలకు ఢోకా ఉండదని వారు ధీమా పడ్డారు. కానీ వారిని విధుల నుంచి తొలగించాలని సోమవారం వైద్య విధాన పరిషత్ కమిషనర్ మళ్లీ ఆదేశాలు జారీ చేశారు. కాగా ఆస్పత్రుల్లో కాస్తో, కూస్తో వైద్య సేవలు అందుతున్నాయంటే అది కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వల్లే. ముఖ్యంగా సి.టి.స్కాన్ ఈసీజీ, టెక్నీషియన్లను తొలగిస్తే వైద్య సేవలకు అంతరాయం కలుగుతుంది. సి.టి.స్కాన్ టెక్నీషియన్‌ను తొలిగిస్తే స్కాన్‌లు తీసే నాథుడే ఉండడు. అలాగే జూనియర్ శానిటరీవర్కర్లను తొలగిస్తే రోగులకు ఇబ్బందులు తప్పవు. రోగులకు డ్రెస్సింగ్ చేయడం, వీల్ చైర్‌పై ఆపరేషన్ థియేటర్, ఇతర ప్రాంతాలకు వెళ్లే సేవలు నిలిచిపోతాయి. ఈ విషయమై జిల్లా ఆస్పత్రుల సేవల సమన్వయాధికారి బి. విజయలక్ష్మి వద్ద ‘న్యూస్‌లైన్’ వద్ద ప్రస్తావించగా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించాలని ఆదేశాలు జారీ చేయడం వాస్తవమేనన్నారు.
నెలరోజుల ముందే ఉద్యోగాలు ఔట్!
Published Tue, May 20 2014 12:47 AM | Last Updated on Sat, Sep 2 2017 7:34 AM
Advertisement
Advertisement