సాక్షి, అమరావతి: ఎలాంటి అనుమతులు లేకుండానే ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల్ని నియమించారు. కాంట్రాక్ట్ కార్మికుల నియామకంలోనూ ఇదే పరిస్థితి. ప్రసాదాల పేరిట రూ.కోట్లు దుర్వినియోగమయ్యాయి. చివరకు అమ్మవారికి భక్తులు సమర్పించే చీరల విషయంలోనూ అవకతవకలు చోటుచేసుకున్నాయి. బెజవాడ కనకదుర్గ ఆలయ వ్యవహారాలపై దేవదాయ శాఖ కమిషనర్ పద్మ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలోని అంశాలివి. తెలుగుదేశం పార్టీ హయాంలో.. గడచిన ఏడాది కాలంలో విజయవాడ దుర్గ గుడిలో అనేక అక్రమాలు, అవకతవకలు చోటుచేసుకున్నాయని ఆ నివేదికలో స్పష్టం చేశారు.
ఒక పోస్టులో ఉండే అధికారి బదిలీపై వెళ్లి.. మరొకరు ఆ స్థానంలోకి వచ్చినప్పుడు కొత్తగా ఆ బాధ్యతలు చేపట్టిన అధికారి అక్కడి పరిస్థితులపై ఉన్నతాధికారికి నివేదిక ఇవ్వడం అనవాయితీ. 2018 ఆగస్టు 16వ తేదీ నుంచి ఈ ఏడాది ఆగస్టు 22 వరకు దుర్గ గుడి ఈవోగా పనిచేసిన ఐఆర్‌ఎస్ అధికారి వి.కోటేశ్వరమ్మ స్థానంలో ఆ బాధ్యతలు చేపట్టిన దేవదాయ శాఖ రీజనల్ జాయింట్ కమిషనర్ సురేష్ తాను బాధ్యతలు చేపట్టిన సమయంలో గుర్తించిన లోపాలు, అవకతవకలపై దేవదాయ శాఖ కమిషనర్‌కు సమాచారమిచ్చారు. కమిషనర్ వాటన్నింటినీ ఒక నివేదిక రూపంలో ప్రభుత్వానికి పంపుతూ.. చర్యలు తీసుకోవడానికి తగిన సూచనలు చేయాలని కోరారు.
నివేదికలో పేర్కొన్న అవకతవకల వివరాలివీ..
►2018 దసరా ఉత్సవాల నాటినుంచి 2019 సెప్టెంబర్ వరకు ఆలయంలో అప్పాలు ప్రసాదం ఉచితంగా పంపిణీ చేసినందుకు రూ.1.21 కోట్లు ఖర్చు పెట్టినట్లు చూపించారు. అయితే, ఆలయంలో అప్పాలు ప్రసాదం పంపిణీకి ఉన్నతాధికారుల నుంచి ఎటువంటి అనుమతి తీసుకోలేదు.
►రికార్డుల్లో పేర్కొన్న చీరల ధరలకు, గోడౌన్లలో ఉంచిన చీరల ధరలకు మధ్య చాలా తేడాలున్నాయి. అమ్మవారి చీరల విషయంలోనే ఆ ఏడాది కాలంలో రూ.9,50,218 మేర అక్రమాలు చోటు చేసుకున్నాయి.
►గతంలో భక్తులు సమర్పించే చీరల వ్యవహారాలన్నీ ఆలయ రెగ్యులర్ ఉద్యోగుల పర్యవేక్షణలో ఉండేవి. టీడీపీ సర్కారు హయాంలో ఉన్నతాధికారుల అనుమతి తీసుకోకుండానే అమ్మవారి చీరల పర్యవేక్షణను ఒక ఔట్ సోర్సింగ్ ఏజెన్సీకి అప్పగించారు. ఔట్‌సోర్సింగ్ సిబ్బంది నియామకానికి కనీసం ప్రభుత్వ అనుమతి కూడా లేదు. ఈవో కోటేశ్వరమ్మ వ్యక్తిగత సహాయకుడిగా పనిచేసిన ఒక జూనియర్ అసిస్టెంట్ ద్వారానే 14 మంది ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి జీతాల చెల్లింపులు చేశారు.
►ఆలయ అధీనంలో ఉండే వేద పాఠశాల, ప్రసాదం స్టోర్, గుడిలో పని చేసే క్లర్కులు, సెక్యూరిటీ గార్డులు కలిపి 21 మంది సిబ్బందిని ఉన్నతాధికారుల అనుమతి లేకుండానే ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించారు.
►గర్భగుడిలో అమ్మవారి అలంకారం ఆలయ ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో చేయాలి. టీడీపీ హయాంలో.. కోటేశ్వరమ్మ ఈవోగా పనిచేసిన కాలంలో ఉన్నతాధికారుల అనుమతి లేకుండా అమ్మవారి అలంకారం కోసమంటూ కన్సాలిడేట్ పే కింద ఒక వ్యక్తిని నియమించారు. దీనివల్ల గర్భాలయంలోకి బయటి వ్యక్తుల ప్రవేశానికి వీలు కలిగినట్టయ్యిందని దేవదాయ శాఖ కమిషనర్ ప్రభుత్వానికి పంపిన నివేదికలో పేర్కొన్నారు.
►ఆలయ ఆర్థిక వ్యవహారాలను సక్రమంగా నిర్వహించకపోవడం వల్ల ఆలయానికి వివిధ వ్యక్తులు చెల్లించాల్సిన బిల్లులు రూ.6.65 కోట్ల మేర బకాయిలు ఉన్నట్లు కమిషనర్ తన నివేదికలో వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment