వోల్వో బస్సు ప్రమాదంపై పోలీసుల నిర్ధారణ!
మహబూబ్‌నగర్, సాక్షి ప్రతినిధి: మహబూబ్‌నగర్ జిల్లా, పాలెం వద్ద చోటుచేసుకున్న బస్సు దగ్ధం ప్రమాద సంఘటన అతివేగం కారణంగానే సంభవించిందని పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు. ప్రమాదంపై వివిధ కోణాల్లో దర్యాప్తు చేసిన పోలీసులు అతివేగం వల్లే పెద్దఎత్తున ప్రాణనష్టం జరిగిందని నిర్ధారణకు వచ్చారు. ఈ మేరకు ఉన్నతాధికారులకు ప్రాథమిక నివేదిక అందజేశారు. వనపర్తి సీఐ గిరిబాబు ఆధ్వర్యంలో బెంగళూరుకు వె ళ్లిన ఓ బృందం జబ్బార్, దివాకర్ ట్రావెల్స్ కార్యాలయాలను తనిఖీ చేసి డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. రెండు ట్రావెల్స్ మధ్య గల ఆర్థిక బంధంపైనా ఆరా తీశారు. లగేజి బుకింగ్ వివరాలను పరిశీలించిన మీదట పేలుడు పదార్థాలేమీ బస్సులో లేవని గుర్తించారు. బస్సు వేగంగా కల్వర్టును ఢీకొట్టి అక్కడే ఆగిపోవడంతో ట్యాంకులో ఉన్న డీజల్ మొత్తం ఒకేచోట పడి ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో ఘోరం జరిగిపోయిందని నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం.
‘వోల్వో ఇండియా’ ప్రతినిధులతో ఆర్టీఏ అధికారుల భేటీ
సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్ దుర్ఘటనలో అత్యంత ఆధునికమైన బస్సు నిమిషాల వ్యవధిలో బుగ్గిగా మారటం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న ఆర్టీఏ అధికారులు, అందుకు దారితీసిన పరిస్థితులపై విశ్లేషణ చేసేందుకు మంగళవారం వోల్వో ఇండియా ప్రతినిధులతో భేటీ అయ్యారు. ప్రమాదం జరిగిన తర్వాత వోల్వో కంపెనీ నిపుణులు ఆ బస్సును పరిశీలించారు. అందులో వారు గుర్తించిన వివరాలను ఆధారం చేసుకుని, భవిష్యత్తులో అలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలో సిఫారసు చేయాలని ఈ సమావేశంలో అధికారులు ఆ కంపెనీ ప్రతినిధులను కోరారు. యురోపియన్ రోడ్లకు సరిపడే డిజైన్‌తో రూపుదిద్దుకుంటున్న వోల్వో బస్సులు మన రోడ్లపై వేగంగా వెళ్లటం ఎంతవరకు మంచిది, మంటలంటుకున్నప్పుడు వాటిని క్షణాల్లో తీవ్రం చేస్తున్న కర్టెన్లు, రెగ్జిన్, ఏసీ వాయువుల విషయంలో నాణ్యత ప్రమాణాలేంటి, వోల్వో బస్సులను నడపటంలో డ్రైవర్లకు పునశ్చరణ తరగతులు నిర్వహించటం, ప్రమాదాలు సంభవించినప్పుడు వేగంగా ప్రయాణికులు బయటపడాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు... ఇలా పలు అంశాలపై అధికారులు వారిని ప్రశ్నించారు. అయితే వాటిపై కంపెనీ యాజమాన్యంతో చ ర్చించి సవివరంగా సమాధానమిస్తామని ప్రతినిధులు వారికి సూచించారు. ఈ సమావేశంలో రవాణా శాఖ కమిషనర్ అనంతరాము, అదనపు, సంయుక్త కమిషనర్లు శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. కాగా ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా జరిపిన తనిఖీల్లో 520 బస్సులపై కేసులు నమోదు చేసి, 284 బస్సులను సీజ్ చేశారు.
అతి వేగంతోనే అనర్థం
Published Wed, Nov 6 2013 2:25 AM | Last Updated on Sat, Sep 2 2017 12:18 AM
Advertisement
Advertisement