ప్రశ్నపత్రం చేజిక్కించుకుని తీసుకువచ్చింది షాలిమార్ ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీ ఉద్యోగి
నాటి కొమెడ్ లీక్ సూత్రధారికి డ్రైవరే నేడు కీలక నిందితుడు
పీజీ మెడిసిన్ ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రం లీకులో కీలక ఆధారాలు
సాక్షి, హైదరాబాద్: విజయవాడలోని ఎన్‌టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం నిర్వహించిన పీజీ మెడిసిన్ ఎంట్రన్స్ టెస్ట్ (పీజీఎంఈటీ-2014) ప్రశ్నపత్రం లీక్ కేసు దర్యాప్తులో రాష్ట్ర నేర పరిశోధన విభాగం (సీఐడీ) పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. ఈ పరీక్ష పేపర్‌ను ఓ ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీకి చెందిన ఉద్యోగి లోదుస్తుల్లో పెట్టుకుని ప్రింటింగ్ ప్రెస్ నుంచి బయటకు తెచ్చినట్లు వెల్లడైంది. ఈ కీలక సూత్రధారులతో పాటు మొత్తం పది మందికి పైగా నిందితుల్ని అదుపులోకి తీసుకున్న సీఐడీ పోలీసులు సోమవారం విజయవాడలోని న్యాయస్థానంలో హాజరుపరచనున్నారు. దాదాపు రెండుమూడేళ్ల కిందట కర్ణాటక రాష్ట్రం నిర్వహించిన కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ‘కొమెడ్ కే’ ప్రశ్నపత్రం లీక్ అయింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఓ వ్యక్తి డ్రైవరే ప్రస్తుతం జరిగిన పీజీఎంఈటీ-2014 ప్రశ్నపత్రం లీకేజీలో సూత్రధారిగా వ్యవహరించాడు. అప్పట్లో ఆ సూత్రధారికి డ్రైవర్‌గా వ్యవహరించడంతో ప్రశ్నపత్రం ఎక్కడ నుంచి, ఎలా లీక్ చేయవచ్చనే అంశాలపై ఇతడికి మంచి అవగాహన కలిగింది.
ఎన్‌టీఆర్ విశ్వవిద్యాలయం పీజీఎంఈటీ-2014 ప్రశ్నపత్రాల ముద్రణ బాధ్యతల్ని కర్ణాటకలోని మణిపాల్‌లో ఉన్న ప్రభుత్వ ముద్రణాలయానికి అప్పగించింది. ఇదే ప్రెస్‌లో యూపీఎస్‌సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్ష పత్రాలు సైతం ముద్రితమౌతాయి. పీజీఎంఈటీ ప్రశ్నపత్రాలు సైతం ఇక్కడే ముద్రితమౌతాయని తెలుసుకున్న సదరు డ్రైవర్ లీకేజ్ కోసం అనేక మార్గాలను అన్వేషించాడు. ఈ ప్రెస్‌కు క్లీనింగ్, స్వీపింగ్ వంటి పనులను మణిపాల్‌కే చెందిన షాలిమార్ ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీ ‘షాలిమార్’ సంస్థ నిర్వహిస్తోంది. ఇందులో పని చేసే ఓ వ్యక్తిని ట్రాప్ చేసిన సదరు డ్రైవర్ భారీ మొత్తం ఆశచూపి తనకు పీజీఎంఈటీ ప్రశ్నపత్రం కావాలంటూ ఎర వేశాడు. ఇందుకు సదరు ఉద్యోగి అంగీకరించాడు.
సీసీ కెమెరాలు లేకపోవడంతో...: మణిపాల్‌లోని సదరు ప్రింటింగ్ ప్రెస్‌లో ప్రశ్నపత్రాల ముద్రణకు ఇప్పటికీ చేతితో తిప్పే ఫ్రాంక్లిన్ మిషన్‌ను వాడుతున్నారు. ఇందులో పక్కాగా ప్రింట్ అయిన ప్రశ్నపత్రాలు ఓ పక్క, కొన్ని ప్రింటింగ్ తప్పులతో ముద్రితమైన ప్రశ్నపత్రాలు మరోపక్క పడేస్తారు.
పక్కాగా ప్రింట్ అయిన ప్రశ్నపత్రాలు పడే వైపు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసిన ప్రింటింగ్ ప్రెస్ యాజమాన్యం మరోపక్క వాటిని ఏర్పాటు చేయలేదు. దీన్ని అనుకూలంగా మార్చుకున్న సదరు నాలుగో తరగతి కార్మికుడు ఓ ప్రశ్నపత్రాన్ని చేజిక్కించుకున్నాడు. దీన్ని సెక్యూరిటీ తనిఖీల్లోనూ బయటపడకుండా ఉండేందుకు లోదుస్తుల్లో పెట్టుకుని బయటకు తీసుకువచ్చి, డ్రైవర్‌కు ఇచ్చాడు. దాదాపు 10 నుంచి 20 తప్పులతో కూడిన ప్రశ్నపత్రాన్ని ఇలా చేజిక్కించుకున్న డ్రైవర్ దాన్ని మంగుళూరుకు చెందిన ఓ వ్యక్తికి అందించాడు. అతడు ఆ ప్రశ్నపత్రాన్ని జిరాక్సు ప్రతులుగా మార్చి హైదరాబాద్‌లో కన్సల్టెన్సీ నిర్వహిస్తున్న మునీశ్వర్‌రెడ్డితో పాటు మరికొందరికీ అప్పగించాడు.
వైద్యుడి పర్యవేక్షణలో క్లాసులు...
మునీశ్వర్‌రెడ్డికి చెందిన ఏజెన్సీతో పాటు మరికొందరూ మాస్ కాపీయింగ్ ద్వారా పరీక్ష రాయడానికి అంగీకరించిన వైద్య విద్యార్థులతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఓ వైద్యుడి పర్యవేక్షణలో ప్రతి ప్రశ్నకు జవాబులు తయారు చేయించి ‘అభ్యర్థులకు’ నగరంతో పాటు బెంగళూరు, గోవా, ముంబైల్లో ప్రత్యేక ‘శిక్షణా తరగతులు’ నిర్వహించారు. ఈ విషయాలు వెలుగులోకి రావడంతో సీఐడీ అధికారులు గతంలో కొమెడ్ కే ప్రశ్నపత్రం లీకేజ్ కేసులో సూత్రధారిగా ఉన్న వ్యక్తితో పాటు మరికొందరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. నేరంలో పాత్ర ఉందని తేలడంతో పది మందికి పైగా నిందితుల్ని ఆదివారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. వీరిలో స్కామ్‌లో సూత్ర, పాత్రధారులతో పాటు ర్యాంకర్లు ఉన్నారు. వీరిని సోమవారం విజయవాడలోని న్యాయస్థానంలో హాజరుపరచనున్నారు.
లోదుస్తుల్లో దాచి తెచ్చారు!
Published Mon, Apr 7 2014 4:29 AM | Last Updated on Tue, Oct 16 2018 3:25 PM
Advertisement
Advertisement