మంత్రి యోగం ఎవరికో?
మంత్రి యోగం ఎవరికో?
Published Thu, Jun 5 2014 1:20 AM | Last Updated on Wed, Aug 29 2018 3:33 PM
నారాయణ, యనమల డిప్యూటీలుగా ఖరారు!
టీడీపీ కేబినెట్‌లో చోటు కోసం పోటీ
26 మందికి మంత్రులుగా అవకాశం
తొలిసారి కాబట్టి బాలకృష్ణకు డౌటే
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసే తేదీ దగ్గరపడే కొద్దీ మంత్రివర్గంలో స్థానం ఆశిస్తున్న ఎమ్మెల్యేల్లో టెన్షన్ పెరిగిపోతోంది. ఎన్నికల ముందు కాంగ్రెస్ నుంచి పార్టీలో చేరిన నేతలకు మంత్రివర్గంలో అవకాశం లభిస్తుందా లేదా అన్న విషయంపై పార్టీలో చర్చ జరుగుతోంది. అలాగే తొలిసారి ఎన్నికైన సినీనటుడు బాలకృష్ణకు స్థానం లభిస్తుందా లేదా అన్నదానిపై కూడా పార్టీ నేతల్లో చర్చోపచర్చలు సాగుతున్నాయి. తొలిసారి ఎమ్మెల్యే అయినందున ఆయనకు అవకాశం లేనట్టుగానే చెబుతున్నారు. పది సంవత్సరాల తరువాత పార్టీ అధికారంలోకి రావటంతో మంత్రి పదవులపై ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఆశలు పెట్టుకున్నారు. చట్టసభల్లో సభ్యులు కాని వారు, అధినేతకు అత్యంత సన్నిహితులైన వారు ఎవరికీ ఉప ముఖ్యమంత్రి, మంత్రి పదవులు ఇచ్చినా తమను మాత్రం పరిగణనలోకి తీసుకోవాలని వారు కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో 26 మందినే నియమించుకునే అవకాశం ఉంది. చంద్రబాబు ఈసారి తన మంత్రివర్గంలో సీనియర్లకే ప్రాధాన్యత ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. సామాజిక కోణం పరిగణనలోకి తీసుకుంటే తొలిసారి ఎన్నికైన సభ్యుల్లో కూడా ఒకరిద్దరికి అవకాశం ఉంది. సీనియర్ల విషయంలోనూ ఇదే కోణంలో కసరత్తు జరిగినట్టు సమాచారం. ఎన్నికల సమయంలో బీసీల్లో ఒకరికి, కాపుల్లో మరొకరికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తానని చంద్రబాబు ప్రకటించారు. ఇప్పటికే నారాయణ విద్యా సంస్థల యజమాని డాక్టర్ పి. నారాయణ, యనమల రామకృష్ణుడులను ఈ పదవులకు ఎంపిక చేశారు. దీంతో వీరిద్దరూ ప్రాతినిధ్యం వహించే నెల్లూరు, తూర్పు గోదావరి జిల్లాలకు కేటాయించే మంత్రి పదవుల్లో కోత పడుతుంది.
ఏ జిల్లా నుంచి ఎవరికి చాన్స్?
శ్రీకాకుళం జిల్లా నుంచి కిమిడి కళా వెంకట్రావు, గౌతు శ్యామసుందర శివాజీ, కె.అచ్చెన్నాయుడు పేర్లను చంద్రబాబు నాయుడు పరిశీలించారు. అయితే కళా వెంకట్రావును స్పీకర్‌గా ఎంపిక చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అచ్చెన్నాయుడికి దాదాపుగా మంత్రిపదవి ఖాయమైందని చెబుతున్నారు.
విజయనగరం జిల్లా నుంచి సీనియర్ ఎమ్మెల్యే పతివాడ నారాయణ స్వామి నాయుడుతో పాటు కోళ్ల లలితకుమారి పేర్లు జాబితాలో చోటుచేసుకునే అవకాశాలున్నాయి. మహిళ కోటాలో తనకు మంత్రి పదవి వస్తుందనే నమ్మకంతో లలితకుమారి ఉన్నారు.
- విశాఖపట్నం జిల్లా నుంచి పార్టీ సీనియర్ నేతలు చింతకాయల అయ్యన్నపాత్రుడు, బండారు సత్యనారాయణమూర్తి మంత్రివర్గంలో స్థానం దక్కుతుందని గట్టి నమ్మకంతో ఉన్నారు. వీరిద్దరికంటే ఇంకా గట్టి నమ్మకంతో కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచిన గంటా శ్రీనివాసరావు ఉన్నారు. పార్టీ అధికారంలోకి వస్తే మంత్రి పదవి ఇస్తామనే స్పష్టమైన హామీ తనకు ఉందని ఆయన చెప్తున్నారు.
- తూర్పు గోదావరి జిల్లాలో గోరంట్ల బుచ్చయ్యచౌదరి పేరు ప్రధానంగా వినిపిస్తోంది. కాపు కోటాలో తమకు మంత్రి పదవి ఖాయమని నిమ్మకాయల చినరాజప్ప, తోట త్రిమూర్తులు ఆశాభావంతో ఉన్నారు. ఇదే జిల్లా నుంచి ఎస్సీ కోటాలో తనకు మంత్రి పదవి దక్కుతుందని గొల్లపల్లి సూర్యారావు ఆశాభావంతో ఉన్నారు.
- పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఎస్సీ కోటాలో ఎమ్మెల్యే పీతల సుజాత, గుంటూరు జిల్లా ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు మంత్రి పదవులు ఆశిస్తున్నారు. టీడీపీ తరపున పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం నుంచి ముడియం శ్రీనివాస్ ఒక్కరే ఎస్టీ ఎమ్మెల్యేగా ఎన్నిక య్యారు. దాంతో ఆయనకు మంత్రిపదవి దాదాపు ఖాయంగా చెబుతున్నారు. ఇదే జిల్లా నుంచి చింతమనేని ప్రభాకర్, బూరుగుపల్లి శేషారావు కూడా మంత్రి పదవి కావాలని పట్టుబడుతున్నారు. క్షత్రియ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో అవకాశం కల్పించాలనుకుంటే ఉండి ఎమ్మెల్యే కలవపూడి శివకు ఎక్కువ అవకాశాలున్నాయి.
- కృష్ణా జిల్లా నుంచి దేవినేని ఉమామహేశ్వరరావుకు మంత్రివర్గంలో చోటు ఖాయమైంది. ఈ విషయాన్ని ఆయన ఇప్పటికే తన సన్నిహితులకు చె ప్పారు. ఇదే జిల్లా నుంచి బీసీ కోటాలో కాగిత వెంకట్రావు, కాపు కోటాలో మండలి బుద్ధప్రసాద్, బోండా ఉమామహేశ్వరావు మంత్రి పదవులు ఆశిస్తున్నారు. అయితే కాగితకే ఈ జిల్లా నుంచి మరో మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది.
- గుంటూరు జిల్లా నుంచి మంత్రి పదవిని ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ధూళిపాళ్ల నరేంద్రకుమార్, కోడెల శివప్రసాదరావు, ఆలపాటి రాజేంద్రప్రసాద్, యరపతినేని శ్రీనివాసరావు, ప్రత్తిపాటి పుల్లారావు, జీవీఎస్ ఆంజనేయులు, కొమ్మాలపాటి శ్రీధర్‌లు ఒకే సామాజికవర్గానికి చెందిన వారే. వీరందరూ మంత్రి పదవిపై కన్నేశారు. ఎవరికి వారు మంత్రి పదవి తమకే దక్కుతుందనే నమ్మకంతో ఉన్నారు. అయితే జిల్లా పార్టీలో గ్రూపులు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇదే జిల్లా నుంచి ఎమ్మెల్సీ కోటాలో నన్నపనేని రాజకుమారి మంత్రి పదవి ఆశిస్తున్నారు.
- ప్రకాశం జిల్లా నుంచి సిద్ధా రాఘవరావు పేరు దాదాపు ఖరారైంది. ఈ జిల్లాకు మరో పదవి ఇవ్వాలనుకున్న పక్షంలో కరణం బలరామకృష్ణమూర్తిని ఎమ్మెల్సీగా చేసి మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంది. అలాకాని పక్షంలో దామచర్ల జనార్ధన్‌కు ఎక్కువ అవకాాశాలున్నాయి.
- ఇక నెల్లూరు జిల్లా నుంచి నారాయణకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తున్నారు కాబట్టి మరొకరికి అవకాశం రాకపోవచ్చు. చంద్రబాబు సొంత జిల్లా నుంచి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, కడప నుంచి ఎమ్మెల్సీ ఎస్‌వీ సతీష్‌కుమార్‌రెడ్డి, కర్నూలు నుంచి కేఈ కృష్ణమూర్తిలకు మంత్రివర్గంలో దాదాపు చోటు ఖాయం. చివరి నిమిషంలో చంద్రబాబు మనస్సు మార్చుకుంటే ఏవైనా మార్పులు ఉండవచ్చు.
- అనంతపురం జిల్లా నుంచి మంత్రి పదవులను పరిటాల సునీత, కాలువ శ్రీనివాసులు, బీకే పార్థసారథి, పల్లె రఘునాథరెడ్డి ఆశిస్తున్నారు. వీరిలో పరిటాల సునీతతో పాటు మరొకరికి అవకాశం ఖాయం. టీడీపీ తరఫున మైనారిటీ కోటాలో ఎవ్వరూ ఎమ్మెల్యేగా ఎన్నిక కాలేదు. దీంతో కర్నూలు జిల్లాకు చెందిన మైనారిటీ నేత ఎన్‌ఎండీ ఫారూఖ్‌ను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా పంపి ఆయనకు మంత్రి పదవి కట్టబెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
Advertisement
Advertisement