వరికి మొలకలు
రైతుల కంట కన్నీరు
పలాస, న్యూస్‌లైన్: భారీ వర్షాలతో నీట మునిగిన పంట మొలకెత్తడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. చేతికందిన పంట నీటిపాలు కావడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలాస-కాశీబుగ్గ మున్సిపాల్టీ పరిధిలోని అంబుసోలి గ్రామానికి చెందిన తెప్ప గణేష్, టొంప గణేష్ ఐదెకరాల్లో వరి పంట సాగుచేశారు. పొలాలకు నీరందించే అంబుసోలి చెరువు ఎండిపోవడంతో మోటార్లతో నీరందించారు. సుమారు రూ.60 వేలు పెట్టుబడి పెట్టారు.
స్థానికంగా వ్యవసాయ కూలీల కొరత ఉండడంతో కోటబొమ్మాళి నుంచి తెచ్చి కోత పూర్తి చేశారు. పొలంలో పోగులు వేశారు. మరో రెండు రోజులు నూర్పులు పూర్తి చేసి ధాన్యం ఇంటికి తీసుకువెళ్లాలని అనుకుంటుండగానే అల్పపీడన ప్రభావంతో ఈదురుగాలులతో కురిసిన భారీ వర్షం వారి ఆశలను అడియాశలు చేసింది.
మూడు రోజుల పాటు కురిసిన వర్షంతో పొలంలో ఉన్నదానిని రక్షించుకోలేకపోయారు. చేతికొచ్చిన ధాన్యం గింజలు పొలంలోనే మొలకలయ్యాయి. సుమారు రూ.లక్ష నష్టం వాటిల్లిందని రైతులు తెప్ప గణేష్, టొంప గణేష్ తెలిపారు. మండలంలోని పలువురు రైతులు ఇదే పరిస్థితిలో ఉన్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు.