కోలాహలంగా పద్మావతి పరిణయోత్సవం
- అశ్వవాహనంపై శ్రీవారు
- దంతపల్లకిపై ఉభయ దేవేరులు
- మాడవీధుల్లో విహారం
సాక్షి, తిరుమల: తిరుమలలో పద్మావతి, శ్రీనివాస పరిణయోత్సవం రెండో రోజు శుక్రవారం కోలాహలంగా సాగింది. అశ్వవాహనంపై స్వామివారు, దంతపల్లకిపై ఉభయదేవేరులు నాలుగుమాడ వీధుల నుంచి ప్రదర్శనగా నారాయణగిరి ఉద్యానవనానికి చేరుకున్నారు. శోభాయమానంగా నిర్మించిన కల్యాణవేదికలో స్వామి, అమ్మవార్లకు ఎదుర్కోలు, పూల బంతాట, నూతన వస్త్రాలు సమర్పించారు. తర్వాత ఉత్సవర్ల ఎదుట ఆస్థానం నిర్వహించి, వేదాలు, పురాణాలు పఠించి, కీర్తన లు ఆలపించి, నృత్యాలు ప్రదర్శించి కార్యక్రమాన్ని కనుల పండువగా నిర్వహించారు. చిరుజల్లులు కురవడంతో వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. రాత్రి 7.30 గంటల తర్వాత కల్యాణమహోత్సవానికి చిహ్నంగా రంగురంగుల బాణసంచా పేల్చుతూ స్వామివారికి నీరాజనం సమర్పించారు.
శ్రీవారి దర్శనానికి 20 గంటలు: తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ పెరిగింది. వేకువజామున 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 31,448 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఇదే సమయానికి సర్వదర్శనం కోసం మొత్తం 28 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులకు 20 గంటలు, కాలిబాట మార్గాల్లో నడచి వచ్చిన భక్తులకు 6 గంటల తర్వాత శ్రీవారి దర్శనం లభించనుంది. రద్దీ పెరగటంతో రూ. 300 టికెట్ల దర్శనం మధ్యాహ్నం 2 గంటలకే నిలిపివేశారు. గదులు, లాకర్ల వద్ద కొంత రద్దీ కనిపించింది. కల్యాణకట్టల వద్ద భక్తులు తలనీలాలు సమర్పించుకునేందుకు రెండు గంటల సమయం పట్టింది.