ప్రలోభాలకు లొంగొద్దు
నంద్యాల, న్యూస్‌లైన్: ప్రలోభాలకు లొంగొద్దని ఓటర్లకు వైఎస్సార్సీపీ కేంద్రపాలక మండలి సభ్యుడు భూమా నాగిరెడ్డి అన్నారు. బుధవారం సాయంత్రం పట్టణంలోని పద్మావతినగర్‌లో వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రధాన కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ కార్యాలయానికి వైఎస్సార్సీపీ నాయకుడు ఏవీ సుబ్బారెడ్డి ఇన్‌చార్జిగా వ్యవహరిస్తారన్నారు. నంద్యాల పట్టణాన్ని పదేళ్ల పాటు నిర్లక్ష్యం చేసి మభ్యపెట్టే పథకాలతో వస్తున్న శిల్పా మోహన్ రెడ్డికి ఎన్నికల్లో గట్టి బుద్ధి చెప్పాలని ఓటర్లును కోరారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే వైఎస్సార్ సంక్షేమ పథకాలన్నీ అమలవుతాయని తెలిపారు. తాను 24 గంటలు అభ్యర్థులకు అందుబాటులో ఉంటానని, ఏ క్షణంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా తన దృష్టికి తీసుకురావాలని కోరారు.
ఎటువంటి పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులతో గాని, నాయకులతో గాని సంబంధాలు కొనసాగించరాదన్నారు. టీడీపీ నాయకుడు శిల్పా మోహన్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుందని, తన అనుయాయుల చేత రెచ్చగొట్టే పనులు చేయిస్తున్నారని ఏవీ సుబ్బారెడ్డి అన్నారు. ఇందులో భాగంగా 33వ వార్డుతో పాటు మరికొన్ని వార్డులలో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేయడానికి ప్రయత్నం చేశారని తెలిపారు.
కార్యక్రమంలో మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఏవీఆర్ ప్రసాద్, రాజగోపాల్‌రెడ్డి, లాయర్ మాధవరెడ్డి, గోపీనాథరెడ్డి, డాక్టర్ బాబన్, జయసింహారెడ్డితో పాటు 42వార్డులలో పోటీ చేస్తున్న వైఎస్సార్సీపీ అభ్యర్థులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌నగర్‌లో బహుళ అంతస్తుల భవనం నిర్మిస్తాం..: ఎన్నికల్లో గెలుపొందిన అనంతరం ప్రభుత్వ సహకారంతో పేదలకు అపార్ట్‌మెంట్ తరహాలో ఇళ్లను నిర్మించి తీరుతామని వైఎస్సార్సీపీ నంద్యాల సమన్వయకర్త భూమానాగిరెడ్డి పేర్కొన్నారు.
బుధవారం పట్టణంలోని 38వ వార్డుకు చెందిన కార్యకర్తలతో, నాయకులతో భూమా సమావేశాన్ని నిర్వహించారు. ఎంతో మంది పేదలు ఇళ్లు లేక వైఎస్సార్‌నగర్‌లో అద్దెలకు ఉంటున్నారని వారందరికీ అపార్ట్‌మెంట్ తరహాలో ఇళ్ల నిర్మాణాన్ని కొనసాగిస్తామని భూమా హామీ ఇచ్చారు. వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వాకా శివశంకర్‌యాదవ్‌ను గెలిపించడానికి కార్యకర్తలు కృషి చేయాలన్నారు.