పగిడిద్దరాజు తిరుగువారం
భారీగా వరం పట్టిన మహిళలు
ఎదుర్కోళ్లతో స్వాగతం పలికిన భక్తులు
పూనుగొండ్ల(కొత్తగూడ), న్యూస్‌లైన్ : శివసత్తుల పూనకాలు.. భక్తుల ఎదుర్కోళ్ల కోలాహలం మధ్య గురువారం పూనుగొండ్లలో పగిడిద్దరాజు తిరుగువారం పండుగ ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా గిరిజన పూజారులు పగిడిద్దరాజు వనం తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్ఠించారు. గురువారం పూజారులు అత్యంత భక్తిశ్రద్ధలతో వనం తెచ్చేందుకు దేవుడిగుట్టకు తరలివెళ్లారు. వనం గ్రామ పొలిమేరల్లోకి చేరే సమయానికి సంతానం కోరుకునే మహిళలకు ఎదురెళ్లి సాష్టాంగ నమస్కారాలు చేశారు. పూజారులు వారిపై నుంచి దాటుకుంటూ వనం తీసుకొచ్చారు. ఇలా చేయడం వల్ల ఆ మహిళలకు సంతాన ప్రాప్తి కలుగుతుందని నమ్మకం. వనం తెచ్చి గద్దెపై ప్రతిష్ఠించిన తరువాత 26 మంది మహిళలు గద్దె చుట్టూ వరం పట్టారు.
భారీగా తరలివచ్చిన భక్తులు
తిరుగువారం పండుగ సందర్భంగా పగిడిద్దరాజును దర్శించుకుని పూజలు చేసేందుకు వరంగల్, ఖమ్మం జిల్లాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పగిడిద్దరాజును దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ములుగు ఆర్డీఓ మోతీలాల్ పగిడిద్దరాజు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా విద్యుత్ సరఫరా లేకపోవడం వల్ల తాగునీటికి ఇబ్బందులు పడుతున్నామని భక్తులు ఆర్డీఓకు ఫిర్యాదు చేశారు. ఆయన వెంటనే ట్రాన్స్‌కో ఉన్నతాధికారులతో మాట్లాడి విద్యుత్ సక్రమంగా సరఫరా అయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. పూజారులు పెన్క బుచ్చిరాములు, మురళీధర్, సురేందర్, సమ్మయ్య, సూర్య ఆలయంలో పూజలు నిర్వహిం చారు. సర్పంచ్ ఈసం కాంతారావు ఏర్పాట్లను పర్యవేక్షించారు.