నీవు లేవు.. నీ జ్ఞాపకాలున్నాయ్
కష్టాన్నే నమ్ముకున్నావ్. ప్రతిభకు పదును పెట్టుకున్నావ్. బహుముఖ ప్రజ్ఞాశాలిగా శిఖరమెత్తు ఎదిగావ్. సినీ జగత్తుకు మూలస్తంభమై నిలిచావ్. ఎందరెందరికో బతుకు మార్గం చూపావ్. ఊరూరా అభివృద్ధికి బాటలు వేశావ్. పాలకొల్లుతోపాటు పశ్చిమ కీర్తి బావుటాను విను వీధుల్లో ఎగరేశావ్. జాబిలి చల్లనని.. వెన్నెల దీపమని చెప్పావ్. తెలిసినా గ్రహణం రాక మానదన్నావ్. పూవులు లలితమన్నావ్. తాకితే రాలునన్నావ్.
తెలిసినా.. పెనుగాలి రాక మానదనే సత్యాన్ని చెప్పావ్. ‘జననం ధర్మమని.. మరణం కర్మమని.. తెలిసినా జనన మరణ చక్రమాగదు’ అంటూ నీకు నచ్చిన మేఘాల చాటుకెళ్లావ్. పేద విద్యార్థుల కోసం పాలకొల్లులో కట్టించిన మహిళా డిగ్రీ కళాశాల నీవు రావని తెలిసి బావురుమంటోంది. హిందూ శ్మశాన వాటిక వద్ద నెలకొల్పిన స్నానఘట్టం ఘొల్లుమంటోంది. గాంధీ బొమ్మల సెంటర్‌లో నరసాపురం ప్రధాన కాలువపై వేసిన వంతెన రోదిస్తోంది. శంభుని పేటలోని ప్రాథమిక పాఠశాల స్తబ్దుగా చూస్తోంది.
క్షీరపురి నడిబొడ్డున 25 ఏళ్ల క్రితం నీ పేరుపెట్టుకున్న దాసరి పిక్చర్ ప్యాలెస్ భోరుమంటోంది. నీవు నడయాడిన నేలపై ప్రతి అడుగూ తల్లడిల్లుతోంది. నీవు లేవు కానీ.. జిల్లాలో ప్రతిచోట నీ జ్ఞాపకాలు మాత్రం పదిలంగానే ఉన్నాయ్. ‘వెళ్లిరా.. శిఖరమా’ అని కన్నీటితో నిన్ను సాగనంపినా.. మళ్లీ పుడతావనే నమ్మకాన్ని కూడగట్టుకుంటున్నాయ్.