పాలకొండ :జిల్లాను మండలాభివృద్ధి అధికారుల కొరత వేధిస్తోంది. గ్రామాలను అభివృద్ధి బాటలో నడపాల్సిన వీరికి కనీస సౌకర్యాలు లేక, రాజకీయ ఒత్తిళ్లు తట్టుకోలేక అవస్థలు పడుతున్నారు. కొంతమంది విధులకు సెలవు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. దీనికితోడు ఇన్‌చార్జిల బాధ్యత వీరిని మరింత వేధిస్తోంది. ఇంత ఒత్తిళ్లులోనూ గ్రామాల్లో పర్యటించేందుకు కనీస వాహన సదుపాయం లేకపోవడంపై తీవ్ర అసంతృప్తిని వెల్లగక్కుతున్నారు.
బాధ్యతలు బోలెడు
ఎంపీడీవోల బాధ్యతలు చూస్తే ఉదయం నుంచి రాత్రి వరకు పనిచేసినా సమయం సరిపోదన్నది వాస్తవం. జన్మభూమి గ్రామసభలు మొదలుకొని సాధికారిత సదస్సులు, పింఛన్ల పరిశీలన, మంజూరు, గ్రామాల్లో పారిశుద్ధ్యం, తాగునీరు సరఫరా, రుణాల మంజూరుకు ఎంపికలు, సాక్షరభారత్ ఇలా చెప్పుకుంటూ పోతే అభివృద్ధి మొత్తం వీరి చేతులతోనే చేపట్టాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న అధికారులు పని ఒత్తిడిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
ఇన్‌చార్జిల గోల...
ఇప్పటికే పనిభారంతో ఇబ్బందులు పడుతున్న ఎంపీడీవోల్లో సగం మందికి ఇన్‌చార్జి బాధ్యతలు మరింత భారంగా మారాయి. రేగిడి, వంగర, బూర్జ, ఇచ్ఛాపురం, సోంపేట, మెళియాపుట్టి, టెక్కలి, జలుమూరు, కోటబొమ్మాళి, పాతపట్నం, హిరమండలం, వజ్రపు కొత్తూరు, కవిటి, సారవకోట మండలాభివృద్ధి అధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటి బాధ్యతలను పక్క మండలాల్లో ఉన్న ఎంపీడీవోలకు అప్పజెప్పడంతో వారంతా పని భారం పెరిగి ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు.
తీవ్ర ఒత్తిళ్లు
పనిభారంతో నలిగిపోతున్న అధికారులకు అధికార పార్టీ నేతల నుంచి ఎదురవుతున్న ఒత్తిళ్లు తీవ్ర మనస్తాపానికి కలిగిస్తున్నాయి. ఇప్పటికే కొంతమంది ఎంపీడీవోలు దీర్ఘకాలిక సెలవులు పెట్టి వెళ్లిపోగా మిగతా వారు అదే బాట పట్టేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. మరికొంతమంది ఇతర శాఖలకు డిప్యుటేషన్ కోసం ప్రయత్నాలు చేసుకుంటున్నట్టు తెలిసింది. ప్రధానంగా పింఛన్ల మంజూరు వ్యవహారంలో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఎంపీడీవోలు ఈ సమస్య పరిష్కారం కాకపోతే విధుల్లో కొనసాగడం కష్టమేనని చెబుతున్నారు.
వాహన యోగం లేదు
గతంలో ఎంపీడీవోలు విధులు నిర్వహించేందుకు ప్రభుత్వం వాహనాన్ని సమకూర్చేది. అరుుతే వీరి పరిధి నుంచి ఉపాధి హామీని తొలగించాక వాహనాలను తీసివేశారు. దీంతో వీరు ఎక్కడకు వెళ్లాలన్నా సొంత ఖర్చులు తప్పడం లేదని చెబుతున్నారు. మరోవైపు చిన్నస్థాయి అధికారులకే వాహనాలు సమకూర్చిన ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షణపై ఉండాల్సిన ఎంపీడీవోలకు వాహన సదుపాయం కల్పించకపోవడంపై అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు.
సారథులు లేని మండలాలు !
Published Fri, Dec 26 2014 3:25 AM | Last Updated on Sat, Sep 2 2017 6:44 PM
Advertisement
Advertisement