పలమనేరు, న్యూస్‌లైన్: ఎమ్మార్పీ ధరలతో మద్యం విక్రయాలు చేపడితే లాభాలు రావని తెలుసుకున్న వ్యాపారులు కల్తీపై దృష్టి పెట్టారు. పలమనేరు ప్రాంతంలో కల్తీ మద్యం వ్యాపారం మూడు ఫుల్లులు, ఆరు క్వార్టర్లుగా సాగుతోంది. కల్తీ మద్యం తయారు చేసేందుకు ప్రత్యేక కూలీల ను నియమించుకున్నారు. వారికోసం ప్రత్యేక గోడౌన్లు సైతం ఇక్కడ వెలిశాయి. మద్యం ప్రియులకు ఏ మాత్రం అనుమానం రాకుండా బాటిల్‌ను ఓపెన్ చేసి తిరిగి అలాగే సీల్ చేయడంలో వీరు సిద్ధహస్తులు.
కొందరు మద్యం దుకాణ యజమానులే ఈకల్తీ మద్యాన్ని తయా రు చేస్తున్నట్టు సమాచారం. ఎక్సైజ్ అధికారులు తూతూమంత్రంగా నెలవారి తనిఖీలు చేపడుతూ వారి టార్గెట్ కోసం మద్యం వ్యాపారులకు సహకరిస్తూ ఈ వ్యాపారాన్ని మరింత ప్రో త్సహిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
పలమనేరు పట్టణంతోపాటు మండలం, గంగవరం మండలాల్లో 12 మద్యం దుకాణాలు ఉన్నాయి. ఇక్కడ రోజుకు 5,500 మద్యం బాక్సులు, 3 వేలకు పైగా బీర్ బాక్సుల వ్యాపా రం సాగుతోంది. ఈ దఫా రెన్యువల్స్‌కు నాలు గు దుకాణాలు ముందుకు రాలేదు. దీంతో ఎక్సైజ్ అధికారులే వారిని బుజ్జగించి దుకాణా లు కొనసాగించేలా చేశారు. మద్యం వ్యాపారం లో సిండికేట్ లేకపోవడం, ఎమ్మార్పీ ధరలకే విక్రయించాల్సి రావడంతో వీరికి లాభాలు రాకపోగా నష్టాలు వస్తున్నాయి. లాభం పొందాలనే ఉద్దేశంతో కల్తీకి సిద్ధపడ్డారు.
మద్యం కల్తీ ఇలా..
పట్టణంలోని పలు మద్యం దుకాణాల్లో కల్తీ మద్యం తయారీ కోసం రహస్య గోడౌన్లను ఏర్పాటు చేశారు. ఫుల్ బాటిల్‌ను ఏ మాత్రం అనుమానం రాకుండా ఓపెన్ చేసి అందులోంచి క్వార్టర్ మందును పక్కకు తీసి నీరు పోసి ప్యాక్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా అన్ని రకాల బాటిళ్లను ఓపెన్ చేసి తిరిగి ప్యాక్ చేయడానికి ప్రత్యేక పరికరాలు, హీట్ మిషన్లను, ఇంజక్షన్లను వాడుతున్నట్లు తెలుస్తోంది. ఈ పనులు చేయడానికి చేయి తిరిగిన పని వారు సైతం ఉన్నట్టు సమాచారం. వీరికి యజమానులే భోజనం పెట్టి రోజుకు రూ.500 కూలి ఇస్తున్నారు. ఇలా పక్కకు తీసిన మద్యాన్ని రకరకాల క్వార్టర్ బాటిళ్లలో నింపి ఎవరికీ అనుమానం రాకుండా తిరిగి కేసుల్లో నింపేస్తున్నారు. లిక్కర్ బాటిళ్లపై ఉన్న లేబుళ్లను సైతం అలాగే తీసి అంటిస్తున్నారు. పట్టణంలోని వీవీ మహాల్ ఎదురుగా ఈ కల్తీ వ్యాపారం జోరుగా సాగుతున్నట్లు తెలుస్తోంది.
కల్తీ మద్యాన్ని ఎలా విక్రయిస్తున్నారంటే..
సేకరించిన కల్తీ మద్యాన్ని లూజ్ సేల్స్ రూపంలోనూ, బెల్టు షాపులకు అప్పుగానూ సంబంధిత యజమానులు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. పలమనేరు పట్టణంలోని మూడు చోట్ల రోజుకు రూ.30 వేల దాకా కల్తీ మద్యా న్ని విక్రయిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఆ లెక్కన ప్రతి నెలా లక్షలాది రూపాయల మద్యాన్ని వీరు అక్రమంగా విక్రయిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు.
ఎక్సైజ్ అధికారులకు తెలియందేమీ కాదు
పలమనేరు ప్రాంతంలో కల్తీ మద్యం విక్రయాలు జరుగుతున్నాయనే పక్కా సమాచారంతో ఈ మధ్య ఎక్సైజ్ ఏసీ నాగేశ్వరరావ్ దాడులు చేశారు. నాలుగు రోడ్లు వద్ద మద్యం దుకాణంలో భారీగా కల్తీ మద్యం సీసాలు పట్టుబడ్డాయి. వీటికి ఈఏఎల్ (ఎక్సైజ్ అదేసివ్ లేబుల్) లేకుండా ఉండడం, వాటి కింద రంధ్రాలు ఉండడం, బిరడాలు లూస్ కాబడి ఉండడాన్ని గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసి మద్యాన్ని ల్యాబొరేటరీకి పంపారు. ఈ విషయమై పలమనేరు ఎక్సైజ్ ఎస్‌ఐ సందీప్‌ను ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా కల్తీ మద్యంపై తమకు సమాచారం ఉందన్నారు.
పలమనేరులో జోరుగా కల్తీ మద్యం
Published Mon, Oct 14 2013 3:57 AM | Last Updated on Wed, Sep 5 2018 8:43 PM
Advertisement