శివాజీ చేతికి ‘దేశం’ పగ్గాలు ! | Palasa MLA Gouthu Shyama Sundara Shivaji srikakulam district TDP president post ? | Sakshi
Sakshi News home page

శివాజీ చేతికి ‘దేశం’ పగ్గాలు !

Published Fri, Apr 17 2015 3:53 AM | Last Updated on Sat, Aug 11 2018 4:02 PM

శివాజీ చేతికి ‘దేశం’ పగ్గాలు ! - Sakshi

శివాజీ చేతికి ‘దేశం’ పగ్గాలు !

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:జిల్లా తెలుగుదేశం కిరీటం పలాస ఎమ్మెల్యే గౌతు శ్యామసుందర శివాజీ కుటుంబానికే దక్కనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం పార్టీ అధిష్టానం పరిశీలనలో ఉన్నట్లు ఆ పార్టీ వర్గాల్లో విస్తృత చ ర్చ జరుగుతుంది. ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడిగా ఉన్న చౌదరి నారాయణమూర్తి (బాబ్జీ) ఇప్పటికే రెండుసార్లు ఆ పదవిలో కొనసాగుతుండటం, ఆయన ఇంట్లోనే మూడు పదవులుండటం, పైగా ఆయనపై ఆరోపణలు వెల్లువెత్తుతుండడంతో మరోసారి ఆయనకు అవకాశం ఇవ్వకూడదని పార్టీ సీనియర్ నేతలు మోకాలడ్డుతున్నారు. పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియను ఈ నెల 11న ప్రారంభించారు. ఈ నేపథ్యంలో జిల్లా టీడీపీ అధ్యక్ష పగ్గాలు ఎవరికి అప్పజెప్పాలనే అంశంపై అధిష్టానం ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. సీనియర్ అయిన కళా వెంకట్రావుకు ఇప్పటికే రాష్ర్ట సభ్యత్వ నమోదు బాధ్యతలు కట్టబెట్టడంతో జిల్లా పగ్గాలు శివాజీకి లేదా ఆయన కుటుంబంలో ఒకరికి ఇస్తారనే ప్రచారం జరుగుతోంది.
 
 బాబ్జీపై వ్యతిరేకత
 రెండోసారి జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న బాబ్జీపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనికితోడు ఆయన సతీమణి ధనలక్ష్మి జెడ్పీ చైర్‌పర్సన్‌గా, కుమారుడు అవినాష్ సర్పంచ్‌గా పని చేస్తున్నారు. ఒకే ఇంట్లో మూడు పదవులుండటం కూడా ఇబ్బందికరమేనని అంటున్నారు. ఇదిలా ఉండగా జెడ్పీలో ఇటీవల జరిగిన బదిలీలు, సాధారణ నిధుల వినియోగం, ఇంజినీరింగ్ విభాగంలో అవకతవకలు, ఇసుక ర్యాంప్‌లు అప్పగించే విషయంలో బాబ్జీ పాత్రపై తీవ్ర ఆరోపణలొచ్చాయి.
 
 వీటన్నింటినీ బాబ్జీ వ్యతిరేక వర్గం అధిష్టానం దృష్టికి తీసుకెళ్లింది. సామాజికవర్గాల పరంగా చూసుకుంటే జిల్లాలో కాళింగ, వెలమ, కాపు సామాజికవర్గాలకు పలు పదవులు, బాధ్యతలు అప్పగించినందున జిల్లా అధ్యక్ష పదవిని బలహీనవర్గాలకే ఇవ్వాలన్న డిమాండ్ ఉంది. ఆ రకంగా చూస్తే.. శ్రీశయన సామాజిక వర్గానికి చెందిన శివాజీ 1985 నుంచి టీడీపీలో కొనసాగుతున్నారు. పలుమార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం మంత్రివర్గంలో ఆయనకు స్థానం కల్పించాల్సి ఉన్నప్పటికీ పలు కారణాలతో ఇవ్వలేకపోయారు. దాంతో ఇప్పుడు జిల్లా అధ్యక్ష పదవి ఆయనకు ఇస్తారనే ప్రచారం జరుగుతోంది.  
 
 చినబాబుతోనూ సమాలోచనలు : జిల్లా అధ్యక్ష పదవి విషయమై చినబాబు లోకేష్‌తోనూ శివాజీ వర్గీయులు చర్చిస్తున్నట్లు తెలిసింది. వాస్తవానికి శివాజీని టీటీ డీ సభ్యుడిగా నియమించే విషయం అధిష్టానం పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. అది కాకపోతే జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వాలంటూ ఇటీవల శివాజీ సీఎంను కలిసి కోరినట్లు సమాచారం. ఒకవేళ ఆయనకు కాని పక్షంలో శివాజీ కుమార్తె శిరీషకైనా జిల్లా పార్టీ బాధ్యతలు అప్పగించాలని ఆ వర్గం కోరుతుంది. ఈ విషయాన్ని శివాజీ అల్లుడు పలుమార్లు చంద్రబాబు తనయుడు లోకేష్‌ను కలిసి చర్చించినట్టు తెలిసింది.
 
 శివాజీ కుమార్తెగా, లచ్చన్న మనుమరాలిగా, విద్యావంతురాలిగా, పార్టీలో కష్టపడి పనిచేస్తున్న కార్యకర్తగా ఆమెకు అధిష్టానం వద్ద మంచి పేరు ఉంది. దీనికితోడు ఇటీవల కాలంలో శివాజీ అల్లుడు లోకేష్‌బాబుతో సన్నిహితంగా ఉంటున్నట్టు తెలిసింది. ఇటీవల పలాస నియోజకవర్గంలో జరిగిన పలు సమావేశాల్లో తన రాజకీయ వారసురాలు శిరీషేనని శివాజీ ప్రకటించడం అధ్యక్ష పదవి వ్యూహంలో భాగమేనని అంటున్నారు. కాగా, ఎట్టి పరిస్థితుల్లోనూ బాబ్జీకి ఈసారి జిల్లా బాధ్యతలు అప్పగించొద్దని, కాదని ఇస్తే తామంతా మూకుమ్మడిగా పార్టీకి గుడ్ బై చెబుతామని కొంతమంది నేతలు ఇటీవలే అధిష్టానం వద్ద స్పష్టం చేసినట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement