గత ఏడాది మేలో వేసిన శిలాఫలకం
సాక్షి, కాశీబుగ్గ (శ్రీకాకుళం): పలాస ఎమ్మెల్యే గౌతుశ్యామసుందర శివాజీ ప్రజల అవసరాల కంటే స్వప్రయోజనాలకే పెద్దపీట వేస్తారనడానికి పెట్రోల్ బంకులే సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. పలాసలో ప్రభుత్వ పెట్రోల్ బంకు మంజూరైనా తన బంకులకు ఎక్కడ పోటీగా వస్తుందోనని భయపడి అధికారాన్ని అడ్డంపెట్టుకుని బంకు ఏర్పాటుకాకుండా అడ్డుకున్నారు. ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టడంలో విఫలమైన ఎమ్మెల్యే.. తన వ్యాపార సామ్రాజ్యం విస్తరించుకోవడానికి మాత్రం ముందుంటారని నియోజకవర్గ ప్రజలు విమర్శిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ (ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్) శ్రీకాకుళం జిల్లాలో రెండు చోట్ల ప్రభుత్వ పెట్రోల్ బంకులను మంజూరు చేసింది. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఒకటి, పలాసలో మరొకటి నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు అనుమతులు, ఏర్పాట్లు తదితర పనులు చకచకా సాగిపోయాయి. శ్రీకాకుళంలో ఇప్పటికే సేవలందుతుండగా పలాసలో మాత్రం ఇంకా మోక్షం కలగలేదు. ఇందుకు ఎమ్మెల్యే శివాజీయే కారణమని పలువురు విమర్శిస్తున్నారు. ఎమ్మెల్యే తన మూడు దశాబ్దాల రాజకీయ జీవితంలో అనేక వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. అందులో కీలకమైనది పెట్రోల్ బంకుల వ్యాపారం. పలాస–కాశీబుగ్గ జంట పట్టణాలు, పలాస, మందస, శ్రీకాకుళం, సోంపేట తదితర ప్రాంతాల్లో సుమారు 14 పెట్రోల్ బంకులు నిర్వహిస్తున్నారు. స్థానికంగా ప్రభుత్వ బంకు ఏర్పాటు చేస్తే తన వ్యాపారానికి అడ్డుగా ఉంటుందని గ్రహించిన పలాస ఎమ్మెల్యే తనదైన శైలిలో బంకుకు మోకాలడ్డారు.
శంకుస్థాపన జరిగినా..
పలాస మండలం బొడ్డపాడు రెవెన్యూ పరిధిలోని ఐదెకరాల స్థలంలో పెట్రోల్ బంకు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు భూసేకరణ సైతం పూర్తి చేశారు. 2018 మే 31న శంకుస్థాపన కార్యక్రమం కూడా నిర్వహించారు. ఈ తరుణంలో ఎమ్మెల్యే శివాజీ తన వ్యాపార ప్రయోజనాల కోసం రాజకీయ పలుకుబడి ఉపయోగించి బంకు ఏర్పాటు కాకుండా అడ్డుకున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అందుకే 11 నెలలు పూర్తయినా నేటికీ బంకుకు మోక్షం కలగలేదని చెబుతున్నారు. ట్యాంకర్లు, ఇతర వస్తువులు నిర్మాణ స్థలం వద్దకు తీసుకువచ్చినా పనులు మాత్రం పూర్తి కాలేదని అంటున్నారు. ప్రభుత్వం తరఫున బంకు ఏర్పాటైతే స్వచ్ఛమైన పెట్రోల్ వస్తుందని ఎదురుచూశామని, ఎమ్మెల్యే కారణంగా నిరాశే ఎదురైందని పలువురు వాహనచోదకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment