సీఎం, బొత్స, జేసీలపై ‘పాలెం వోల్వో’ బాధిత కుటుంబాల ఆగ్రహం
28న రాష్ట్ర వ్యాప్త కొవ్వొత్తుల ప్రదర్శన
హైదరాబాద్, న్యూస్‌లైన్: ఇప్పటికైనా నాటకాలు కట్టిపెట్టి, తమకు న్యాయం చేయాలని మహబూబ్‌నగర్ జిల్లా పాలెం వోల్వో బస్సు అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. తమను ఆదుకోవడంలో సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, దివాకర్ ట్రావెల్స్ యజమానులైన జేసీ సోదరులు నాటకాలాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రమాద మృతుల కుటుంబాల జేఏసీ కన్వీనర్, శాంతి సంఘం(ఐప్సో) రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ సుధాకర్, బాధిత కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం ఇక్కడ మీడియాతో మాట్లాడారు.
దారుణం జరిగి 2 నెలలు గడుస్తున్నా బాధిత కుటుంబాలకు సాంత్వన చేకూర్చడంలో ప్రభుత్వం నుంచి స్పందన కరువైందని మండిపడ్డారు. ఘటనకు బాధ్యులైన బస్సు యాజమాన్యాన్ని ఇప్పటికీ అరెస్టు చేయకపోవడం శోచనీయమని, దీనినిబట్టి రాష్ట్రంలో రవాణా మాఫియాకు ప్రభుత్వమే అండగా ఉన్నట్టు కనిపిస్తోందని దుయ్యబట్టారు. ఈ మాఫియా కారణంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా రూ. 2వేల కోట్ల నష్టం వస్తోందని, అయినప్పటికీ పాల కులు సదరు మాఫియా విదిలించే డబ్బుకు కక్కుర్తి పడుతున్నారని విరుచుకుపడ్డారు. అనంతరం, ‘ఆరని మంటల పోరాటం’ పేరుతో పోస్టర్‌ను ఆవిష్కరించారు.
28న కొవ్వొత్తుల ప్రదర్శన: తమకు న్యాయం చేయాలనే ప్రధాన డిమాండ్‌తో ఈ నెల 28న రాష్ట్ర వ్యాప్తంగా కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహిస్తున్నట్టు సుధాకర్ తెలిపారు. హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్కులో ఈ ప్రదర్శన ఉంటుందన్నారు.