'కేసీఆర్కు చట్టాలు, న్యాయస్థానాలపై నమ్మకం లేదు'
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తమ రాష్ట్ర ప్రజానీకాన్ని పాకిస్థానీయులు మాదిరిగా చూస్తున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి ఆరోపించారు. తామంతా మాత్రం కేసీఆర్ను సోదరభావంతోనే చూస్తున్నామని తెలిపారు. ఆదివారం విజయవాడలో పల్లె విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... ఆంధ్రప్రజానీకంపై కేసీఆర్ అనుసరిస్తున్న వైఖరిపై మండిపడ్డారు.
తెలంగాణ సీఎంగా గద్దెనెక్కిన కేసీఆర్కు చట్టాలంటే గౌరవం లేదు... న్యాయస్థానాలపై నమ్మకం లేదని విమర్శించారు. ట్యాంక్బండ్పై ఏర్పాటు చేసిన విగ్రహాలపై చేయేస్తే జనం హర్షించరని పల్లె రఘునాథరెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిని వందశాతం విజయవాడ - గుంటూరుల మధ్య ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి ప్రాంతాల మధ్య ల్యాండ్ పూలింగ్ ద్వారా భూమిని సేకరిస్తామన్నారు.