'విభజన సమయంలో అయితే కేంద్రం గుర్తించేది'
గుంటూరు: బాపట్లలో వ్యవసాయ విశ్వవిద్యాలయం కోసం 2 వేల ఎకరాల స్థలాన్ని గుర్తించాలని వ్యవసాయ కళాశాలకు కేంద్రం లేఖ రాసినట్లు కేంద్రమంత్రి పనబాక లక్ష్మి తెలిపారు. పనిలో పనిగా ఆమె మరోసారి సొంతపార్టీ నేతలకు చురకలు అంటించారు. కాంగ్రెస్ను వీడేవారు విభజన సమయంలో వీడి ఉంటే కేంద్రం గుర్తించేది అని పనబాక అన్నారు. ముగ్గురు మాజీ మంత్రులు కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిన విషయం తెలిసిందే.
ఇక ప్రతిష్టాత్మక నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైనింగ్ (ఎన్‌ఐడీ) సంస్థను విజయవాడలో ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. సీమాంధ్రలోని విజయవాడలో ఎన్‌ఐడీ సంస్థలను ఏర్పాటు చేసేందుకు కేంద్రం మొత్తం రూ. 434 కోట్లు మంజూరు చేసింది. అంటే.. విజయవాడలో దాదాపు రూ. 108 కోట్ల వ్యయంతో ఎన్‌ఐడీని ఏర్పాటు చేయనున్నారు.