పంచాయతీ బ్యాలట్ పత్రాలు స్వాధీనం | Panchayat ballot papers seized | Sakshi
Sakshi News home page

పంచాయతీ బ్యాలట్ పత్రాలు స్వాధీనం

Published Sun, Jan 26 2014 2:40 AM | Last Updated on Sat, Sep 2 2017 3:00 AM

Panchayat  ballot papers seized

అనపర్తి, న్యూస్‌లైన్ : మహేంద్రవాడ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన బ్యాలట్ పత్రాలను కోర్టు కమిషనర్లు శనివారం స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల్లో ఓటమి చెందిన అభ్యర్థులు కోర్టును ఆశ్రయించడంతో అనపర్తి జూనియర్ సివిల్ జడ్జి కోర్టు మేజిస్ట్రేట్ బీవీఎల్ కుమారి ఇద్దరు కమిషనర్లను నియమించారు. సర్పంచ్ పదవికి సంబంధించి న్యాయవాది ఎస్‌వీవీ సత్యనారాయణ రెడ్డి, వార్డు పదవికి సంబంధించి న్యాయవాది టీవీవీ రమణమూర్తిలను కమిషనర్లుగా నియమిస్తూ మేజిస్ట్రేట్ ఆదేశించారు. ఈ నేపథ్యంలో శనివారం మండల పరిషత్ కార్యాలయంలో భద్రపరచిన మహేంద్రవాడ పంచాయతీకి సంబంధించిన బ్యాలట్ పత్రాలను అధికారులు, గెలుపు, ఓటమి పొందిన అభ్యర్థుల సమక్షంలో కమిషనర్లు పరిశీలించారు. అనంతరం బ్యాలట్ పత్రాలను స్వాధీనం చేసుకుని, పోలీసు బందోబస్తు మధ్య కోర్టుకు తరలించారు.
 
 గతేడాది జూలై 23న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మండలంలోని మహేంద్రవాడకు సర్పంచ్‌గా కుడిపూడి అన్నపూర్ణ తన సమీప ప్రత్యర్థి గుండుపల్లి దుర్గపై 13 ఓట్ల మెజారిటీతో గెలుపొందినట్టు ఎన్నికల అధికారులు ధ్రువీకరించారు. అన్నపూర్ణకు 1896 ఓట్లు రాగా, దుర్గ 1883 ఓట్లు సాధించారు. మూడో వార్డులో వెలగల శ్రీనివాసరెడ్డి మూడు ఓట్ల మెజారిటీతో సమీప ప్రత్యర్థి సబ్బెళ్ల వెంకటరెడ్డిపై గెలుపొందారు. ఇందులో శ్రీనివాసరెడ్డి 131 ఓట్లు, వెంకటరెడ్డి 128 ఓట్లు పొందారు. సర్పంచ్ పదవికి పోటీ చేసిన దుర్గ, వార్డు సభ్యుడిగా పోటి చేసిన వెంకటరెడ్డి అతి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమిపాలు కావడంతో, తమకు అన్యాయం జరిగిందంటూ వీరు కోర్టును ఆశ్రయించారు. 
 
 వీరి తరఫున న్యాయవాది వి.సుందరరావు వాదిస్తున్నారు. ప్రతివాదులు అన్నపూర్ణ, శ్రీనివాసరెడ్డి తరఫున న్యాయవాదులు ఎం.రవిషణ్ముఖరెడ్డి, కె.మన్మోహన శ్రీనివాసరెడ్డి, సబ్బెళ్ల సూరారెడ్డి వాదించనున్నారు. మండల పరిషత్ కార్యాలయంలోని స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరచిన బ్యాలట్ బాక్సులను కోర్టు కమిషనర్ల సమక్షంలో బాక్సులను తెరిచేందుకు ఉపక్రమించగా, అందులో ఒకటి కనిపించలేదని విశ్వసనీయంగా తెలిసింది. స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరచిన బాక్సులను క్షుణ్ణంగా పరిశీలించగా, కుతుకులూరుకు చె ందిన బ్యాలట్ బాక్సులో కలిసినట్టు గమనించారు. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement