సాక్షి, కొత్తగూడెం:
పంచాయతీ పాలక వర్గాలు కొలువుదీరాయో.. లేదో అప్పుడే నిధుల ‘పంచాయితీ’ మొదలైంది. పంచాయతీలకు తొలివిడతగా ఉపాధి పథకం కింద నిధులు విడుదలయ్యాయి. ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో సీసీ రోడ్లు, ఇతర పనుల నిర్మాణానికి రూ. 37 కోట్లు మంజూరయ్యాయి. ఈ పనులు తామంటే..తామే చేస్తామంటూ సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, ఆయా పంచాయతీల్లోని నేతలు పోటీ పడుతుండటంతో మొదటే లొల్లితో షురువైందనే విమర్శలు వస్తున్నాయి.
మహత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గత ఏడాది అత్యధిక పనిదినాలు నమోదైన పంచాయతీలకు ప్రోత్సాహకంగా ప్రతి మండలంలోని రెండు పంచాయితీలకు.. ఒక్కో పంచాయతీకి రూ. 50 లక్షల చొప్పున మంజూరు చేయాలని గ్రామీణాభివృద్ధి శాఖ భావించింది. అంతలోనే ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో ప్రభుత్వం ఈ ప్రతిపాదనను ఉపసంహరించుకుంది. కోడ్ ముగిసిన తర్వాత అన్ని పంచాయతీలకు రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం ఈ నిధులతో చేపట్టాలి. నిధులు మంజూరైనా ఈ పనుల ప్రారంభంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని మరోవైపు సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. ఉపాధి ద్వారా ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వం భావించినా.. క్షేత్ర స్థాయిలో మాత్రం లక్ష్యం నెరవేరడం లేదు. గతంలో పలు పంచాయతీల్లో ఈ నిధుల ద్వారా చేపట్టిన పనుల ఆనవాళ్లు మచ్చుకైనా కనిపించడం లేదు. పంచాయతీలకు పాలకవర్గాలు వచ్చిన తర్వాత ఈ నిధులతో చేపట్టే పనులపైనైనా పర్యవేక్షణ కొనసాగించాల్సిన అవసరం ఉందని పలువురంటున్నారు. లేకుంటే నేతల కనుసన్నల్లో జరిగే ఈ పనుల్లో నాణ్యత ముణ్నాళ్ల ముచ్చట కానుంది. పంచాయతీ పాలక వర్గాలు కొలువుదీరిన తర్వాత తొలిసారిగా ఉపాధి హామీ పథకం ద్వారా ఆయా పంచాయతీలకు నిధులు విడుదల కావడంతో.. ఈ పనులు చేయడానికి ఎవరికివారు పోటీ పడుతున్నారు.
మేమంటే మేమే చేస్తాం..
మరో వైపు కొంతమంది అధికారులు ఈ పనులను ఎప్పుడు చేపడతారంటూ.. ఆయా సర్పంచ్‌లపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. తొలిసారిగా వచ్చిన పనులను తామే చేయాలన్న ఉద్దేశంతో సర్పంచ్‌లున్నారు. తమకు కూడా పనులు ఇవ్వాలని ఉప సర్పంచ్‌లు, గ్రామాల్లోని చోటామోటా నాయకులు డిమాండ్ చేస్తుండటంతో ‘ ఆలూలేదు.. సూలూ లేదు..కొడుకుపేరు సోమలింగం’ అన్న చందంగా పనులపై అప్పుడే లడాయి మొదలైంది. ‘పోటీలో నిలబడి రూ. లక్షలు ఖర్చు చేసి ఎలాగో నెగ్గాం.. ’ఈ పని తామే చేస్తే కొంతైనా మిగులుతుందని, మీరే ఎలాగైనా గ్రామంలో నేతలను ఒప్పించాలని సర్పంచ్‌లు తమ నియోజకవర్గ ఎమ్మెల్యేలను ప్రాధేయపడుతున్నారు. మరోవైపు తాము ఉండబట్టే సర్పంచ్‌గా గెలిచారని, తర్వాత వచ్చే పనులు సర్పంచ్ చేసుకోవచ్చని ఈ పని తమకే అప్పగించాలని పంచాయతీల పరిధిలోని పేరుమోసిన నాయకులు తమ ఎమ్మెల్యేలకు సూచిస్తున్నారు. తామేం తక్కువ తినలేదంటూ ఉప సర్పంచ్‌లు కూడా తమకు పనుల్లో వాటా కావాలని సర్పంచ్‌లను నిలదీస్తున్నారు.
ప్రజాప్రతినిధుల మాటే వేదం..
పంచాయతీల్లో ఈ పనుల పంపకంపై ఘర్షణ వాతావరణం నెలకొంటుండగా.. చివరకు స్థానిక ప్రజాప్రతనిధులు ఫైనల్ చేసిన వారికే పనులు దక్కుతాయని ప్రచారం జరుగుతోంది. అధికార పార్టీ మద్దతుతో గెలిచిన సర్పంచ్‌లు తమకే ఈ పనులు దక్కుతాయన్న ధీమాలో ఉన్నారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధి ఉండి, ఇతర పార్టీల మద్దతుతో గెలిచిన సర్పంచ్‌లు మాత్రం ఈ పనుల విషయంలో డైలామాలో ఉన్నారు. ఈ పనుల వ్యవహారంలో ఎమ్మెల్యే తల దూరుస్తే పంచాయతీల్లో వారి పార్టీ నాయకులకే ఈ పనులు దక్కుతాయేమోనన్న ఆందోళనలో ఉన్నారు. ఇలా అయితే పంచాయతీల్లో మళ్లీ పార్టీల పరంగాగొడవలు మొదలయ్యే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది. మరోవైపు సంబంధిత అధికారులు మాత్రం నిధులైతే వచ్చాయి.. పనుల్లో నాణ్యత ఉండేలా పర్యవేక్షించడమే తమ విధిఅని పైకి చెబుతుండగా చివరకు స్థానిక ప్రజాప్రతినిధులు చెప్పిందే వేదంగా పంచాయతీల్లో పనుల పంపకం జరుగుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
నిధుల పంచాయితీ
Published Sun, Sep 15 2013 3:09 AM | Last Updated on Fri, Sep 1 2017 10:45 PM
Advertisement