self employement scheme
-
గ్రామీణ మహిళలకు డిజిటల్ నైపుణ్యం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గ్రామీణ మహిళల ఉపాధికి అవసరమైన డిజిటల్ నైపుణ్యం కల్పించేందుకు టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ నడుం బిగించింది. నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌తో (ఎన్ఎస్డీసీ) చేతులు కలిపింది. ఇందులో భాగంగా 10 నెలల్లో దేశవ్యాప్తంగా ఒక లక్ష మంది మహిళలకు డిజిటల్ నైపుణ్యం కల్పిస్తారు. డిజిటల్ అక్షరాస్యత, ఉపాధికి అవసరమైన నైపుణ్యం పెంపు, స్వయం ఉపాధి, సమాచార నైపుణ్యం వంటి అంశాల్లో 70 గంటలకుపైగా కోర్సు కంటెంట్ ఉచితంగా అందుబాటులో ఉంటుంది. మైక్రోసాఫ్ట్ కమ్యూనిటీ ట్రైనింగ్ వేదికగా ఆన్లైన్లో లైవ్ క్లాసులు నిర్వహిస్తారు. తొలిసారి ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న, అలాగే కోవిడ్–19 కారణంగా ఉపాధి కోల్పోయిన గ్రామీణ యువతులు, మహిళలకు అవకాశాలు కల్పించేందుకు ఈ కార్యక్రమం ఉపయుక్తంగా ఉంటుందని మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రెసిడెంట్ అనంత్ మహేశ్వరి తెలిపారు. స్కిల్ ఇండియా మిషన్‌లో భాగంగా ఒక లక్ష మంది యువతకు డిజిటల్ నైపుణ్యం కల్పించేందుకు ఇప్పటికే ఇరు సంస్థలు చేతులు కలిపాయి. కాగా, ఐటీ, ఐటీ ఆధారిత ఉద్యోగాల కోసం దేశవ్యాప్తంగా 20,000 మంది యువతులను ఎంపిక చేసి ఎస్ఎస్డీసీ ప్రత్యేక నైపుణ్య శిక్షణ ఇవ్వనుంది. -
బీసీ, ఎంబీసీలకు స్వయం ఉపాధి
సాక్షి, హైదరాబాద్: బీసీలు, ఎంబీసీల స్వయం ఉపాధి పథకాలకు ఆర్థిక సహాయం అందించే కార్యక్రమాన్ని వెంటనే ప్రారంభించాలని అధికారులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. బీసీలు, ఎంబీసీల స్వయం ఉపాధి కోసం రూపొందించే పథకాలకు సంబంధించి కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం ముందుకు వెళ్లేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. బ్యాంకులతో సంబంధం లేకుండానే లక్ష, రూ.2 లక్షల విలువ చేసే యూనిట్లను మంజూరు చేయాలని, దీనికి వంద శాతం ప్రభుత్వ గ్రాంటు ఇవ్వాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. బీసీలు, ఎంబీసీలకు సంబంధించి పథకాల అమలుకు అవసరమైన వ్యూహాన్ని ఖరారు చేయడానికి శనివారం ఉదయం స్పీకర్ మధుసూదనాచారి సమక్షంలో సమావేశం కావాలని మంత్రులు, అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఈ మేరకు ప్రగతిభవన్‌లో వివిధ అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రులు ఈటల రాజేందర్, సి.లక్ష్మారెడ్డి, జోగు రామన్న, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు రామకృష్ణారావు, శాంతాకుమారి, బుర్రా వెంకటేశం, కార్యదర్శులు భూపాల్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రతి మండలంలో రెసిడెన్షియల్ స్కూల్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రారంభించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్లు అద్భుతమైన ఫలితాలు ఇస్తున్నాయని సీఎం కేసీఆర్ చెప్పారు. ప్రతి మండలానికి ఒక రెసిడెన్షియల్ స్కూలు పెట్టే లక్ష్యంతో ప్రభుత్వం ఉందని తెలిపారు. దశలవారీగా రెసిడెన్షియల్ స్కూళ్ల సంఖ్య పెంచుతామని అన్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున 119 బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలు అదనంగా ప్రారంభించాలని చెప్పారు. ఏటా వంద కోట్ల మొక్కలు ప్రతి గ్రామంలో నర్సరీ పెంచి వచ్చే ఏడాది నుంచి ఏడాదికి వంద కోట్ల మొక్కలు నాటే లక్ష్యంతో హరితహారం కార్యక్రమాన్ని చేపట్టాలని సీఎం ఆదేశించారు. ఇందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని, ఆ మేరకు నర్సరీల సంఖ్యను పెంచాలని అధికారులకు సూచించారు. ఈ ఏడాది నిర్వహించే హరితహారంతోపాటు వచ్చే ఏడాది నుంచి అవలంబించాల్సిన వ్యూహం ఖరారు చేయడానికి శనివారం మధ్యాహ్నం ప్రగతిభవన్‌లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. అటవీ, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల మంత్రులు, అధికారులు ఈ సమావేశంలో పాల్గొనాలని సూచించారు. 19.83 శాతం ఆదాయాభివృద్ధి 2018–19 మొదటి త్రైమాసికంలో రాష్ట్ర ఆదాయాభివద్ధి రేటు 19.83 శాతం నమోదు కావడంపై సీఎం కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. 2018–19 తొలి 3 నెలల్లో తెలంగాణలో స్వీయ ఆదాయం 19.83 శాతం వృద్ధి రేటు సాధించినట్లు అధికారులు కేసీఆర్‌కు వివరించారు. గడిచిన నాలుగేళ్లలో తెలంగాణ దేశంలోనే అత్యధిక ఆదాయ వృద్ధిరేటు నమోదు చేసిందని, 2018–19లోనూ అదే దిశగా పయనించడం శుభసూచకమని సీఎం అన్నారు. 2017–18 మొదటి త్రైమాసికంలో తెలంగాణలో రూ.13,374.25 కోట్ల ఆదాయం వచ్చిందని, 2018–19 మొదటి త్రైమాసికంలో రూ.16,026.63 కోట్లకు పెరిగిందని తెలిపారు. 9న కేబినెట్ భేటీ జూలై 9న సాయంత్రం నాలుగు గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరుగనుంది. ముఖ్యమంత్రి కార్యాలయం ఈ మేరకు ఒక ప్రకటనలో తెలిపింది. -
ఊరించి..ఉసూరుమనిపించారు
కందుకూరు, న్యూస్‌లైన్: లక్ష వరకు రుణం ఇస్తామన్నారు..ఇంత మందికి రుణాలిస్తున్నామంటూ ఘనంగా సమావేశాలు పెట్టి లబ్ధిదారుల జాబితాను ప్రకటించి చివరికి చేతులెత్తేశారు. జాబితాలో పేరు చూసుకున్న లబ్ధిదారుడు మాత్రం రుణం కోసం రెండు నెలల నుంచి కార్యాలయాలు, బ్యాంక్‌లు చుట్టూ తిరుగుతున్నా సమాధానం చెప్పేవారు కరువయ్యారు. ఇండిగ్రేటెడ్ యాక్షన్ ప్లాన్ కింద వ్యక్తిగత రుణాలు మంజూరైన లబ్ధిదారుల పరిస్థితి ఇది. ఇలా మంజూరు చేస్తారు.. ఈ యాక్షన్ ప్లాన్ కింద ఎంపికైన నిరుద్యోగులకు స్వయం ఉపాధి పొందేలా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీపై బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తాయి. ఒక లబ్ధిదారుడికి లక్ష వరకు రుణం ఇస్తారు. దీనికి గాను ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు 60 శాతం, బీసీలకు 50 శాతం, మైనార్టీలకు 50 శాతం సబ్సిడీని మంజూరు చేస్తుంది. దీంతో బ్యాంకులో రుణం పొందిన లబ్ధిదారుడు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ పోను మిగిలిన మొత్తాన్ని మాత్రమే బ్యాంక్‌కు చెల్లించాల్సి ఉంది. అంటే లక్ష రూపాయల రుణం పొందితే ఎస్సీ, ఎస్టీలు సబ్సిడీపోను * 40 వేలు, బీసీలు * 50 వేలు, మైనార్టీలు *60 వేలు బ్యాంక్‌లకు చెల్లించాలి. ఈ ప్రక్రియ మొత్తం మండల స్థాయిలో ఎంపీడీఓలు, మున్సిపాలిటీలో కమిషనర్ పర్యవేక్షణలో జరగాలి. లబ్ధిదారుల ఎంపిక దగ్గర నుంచి రుణం మంజూరు వరకు అధికారులు సమన్వయంతో వ్యవహరించాల్సి ఉంది. అయితే అధికారులు ఎంపిక చేసిన జాబితా మొత్తం ప్రస్తుతం తప్పుల తడకగా తయారైంది. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి ఇష్టారీతిన లబ్ధిదారులను ఎంపిక చేయడంతో కొంత మంది పేర్లపై రుణాలు మంజూరు చేసేందుకు బ్యాంకు అధికారులు నిరాకరిస్తున్నారు. అలాగే ప్రభుత్వ నిబంధనలు పాటించకపోవడంతో కొంతమంది పేర్లు తిర స్కరణకు గురవుతున్నాయి. రెండు నెలల నుంచి ఎదురుచూపులు నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో బ్యాంక్‌ల నుంచి రుణాలు మంజూరు చేసి ప్రోత్సహిస్తారు. ఇంటిగ్రేటెడ్ యాక్షన్ ప్లాన్ కింద వ్యక్తిగత రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న అర్హులైన లబ్ధిదారుల జాబితాను రెండు నెలల క్రితమే అధికారులు ప్రకటించారు. దీనిలో భాగంగా రెండు నెలల క్రితమే నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో లబ్ధిదారుల జాబితాను అధికారులు సిద్ధం చేశారు. వీటిలో కందుకూరు మున్సిపాలిటీ పరిధిలో 637 మందిని, లింగసముద్రం మండలంలో 220, గుడ్లూరు మండలంలో 318, ఉలవపాడు మండలంలో 200, వలేటివారిపాలెం మండలంలో 210, కందుకూరు మండలంలో 200ల మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. కానీ నేటికీ ఒక్క లబ్ధిదారుడికి కూడా రుణం మంజూరు కాలేదు. ఎంపికైన లబ్ధిదారులు కార్యాలయాలు, బ్యాంక్‌ల చుట్టూ తిరుగుతున్నారు. ప్రభుత్వ జీఓలతో ఔట్.. లబ్ధిదారుల ఎంపిక సమయంలో ఏ నిబంధనలు విధించని ప్రభుత్వం... ఆ తరువాత ఇచ్చిన జీఓలతో జాబితా నుంచి కొన్ని పేర్లు తిరస్కరిస్తున్నారు. వీటిలో ప్రధానంగా ఇటీవల వచ్చిన జీఓ నంబర్ 101 ద్వారా రుణం పొందేందుకు వయో పరిమితి విధించారు. దీని ప్రకారం బీసీలకు 40 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీలకు 45 ఏళ్ల గరిష్ట వయోపరిమితి విధించారు. అలాగే కుటుంబ ఆదాయం * 60 వేల లోపు ఉండాలి. వీరు మాత్రమే అర్హులంటూ నిబంధనలు విధించారు. దీంతో అధికారులు తయారు చేసిన జాబితా నుంచి అనేక మంది పేర్లు గల్లంతవుతున్నాయి. ఒక్క గుడ్లూరు మండలంలోని దాదాపు 80 మంది లబ్ధిదారులను అనర్హులుగా తిరస్కరించారు. అలాగే కందుకూరు మండలంలో 55 మంది అనర్హులయ్యారు. ఈ విధంగా ప్రతి మండలంలో ముందు రుణం పొందేందుకు అర్హులంటూ ఆశ కల్పించి ప్రస్తుతం రాలేదంటూ అధికారులు చేతులెత్తేస్తున్నారు. ప్రభుత్వం విధించిన నిబంధనల ప్రకారం జాబితా నుంచి అనర్హులైన వారి స్థానంలో అధికారులు కొత్తవారిని ఎంపిక చేసి పంపుతున్నారు. సబ్సిడీ రాక నిలిచిన రుణాలు: మరోపక్క అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం మొండిచేయి చూపుతోంది. రుణాలకు అర్హుల జాబితాలు కార్పొరేషన్లకు చేరినా సబ్సిడీ మాత్రం మంజూరు కావడం లేదు. లబ్ధిదారుడి అకౌంట్లో ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ జమైతేనే రుణాలిస్తామంటూ బ్యాంక్ మేనేజర్లు పెండింగ్ పెడుతున్నారు. దీంతో అర్హులైన లబ్ధిదారులకు సైతం రుణాలు మంజూరు కాని పరిస్థితి నెలకొంది. ఈ విధంగా ప్రతి మండలం నుంచి అర్హులైన జాబితాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్లకు చేరినా సబ్సిడీ రాలేదనే కారణంతోనే రుణాలు నిలిచిపోతున్నాయి. ఉదాహరణకు కందుకూరు మున్సిపాలిటీ పరిధిలో 262 మంది అర్హులైన జాబితాను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్లకు పంపారు. అలాగే లింగసముద్రం నుంచి 70 మంది, కందుకూరు మండల పరిధిలో 92 మంది బ్యాంక్‌ల నుంచి విల్లింగ్ లెటర్ తీసుకుని సిద్ధంగా ఉన్నా, ప్రభుత్వం నుంచి రావాల్సిన సబ్సిడీ రాకపోవడంతో రుణం పొందలేకపోతున్నారు. ప్రతి మండలంలో ఇదే పరిస్థితి నెలకొంది. అలాగే బ్యాంకుల అధికారులు లబ్ధిదారులను నానా తిప్పలు పెడుతున్నారు. అధికారులు ఎంపిక చేసి జాబితాను పంపినా.. బ్యాంక్‌లు రుణాలిచ్చేందుకు నిరాకరిస్తున్నాయి. ఎంపికైన లబ్ధిదారులకు నెల రోజుల్లోపే రుణం ఇస్తామని అధికారులు, ప్రజాప్రతినిధులు గొప్పలు చెప్పినా ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. మరో రెండు, మూడు నెలలు పట్టినా ఆశ్చర్యం లేదని, ప్రభుత్వం సబ్సిడీ ఎప్పుడు విడుదల చేస్తుందో తమకు తెలియదని అధికారులే చెప్తున్నారు. -
గ్రామీణాభివృద్ధికే ‘ఉపాధి’!
ఉపాధి హామీ పథకం రాష్ట్ర డెరైక్టర్ కరుణ శ్రీకాకుళం అర్బన్, న్యూస్‌లైన్: ఉపాధి హామీ పథకం గ్రామీణాభివృద్ధికి కేంద్ర బిందువుగా మారిందని ఆ పథకం రాష్ట్ర డెరైక్టర్ వి.కరుణ అన్నారు. జిల్లా అధికార యంత్రాంగం శ్రీకాకుళం కోడిరామ్మూర్తి క్రీడా మైదానంలో.. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం సమ్మేళనాన్ని గురువారం నిర్వహించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో ఉపాధిహామీ పథకం గొప్ప విజయం సాధించిందన్నారు. పనుల నిర్వహణ, రికార్డుల నమోదులో సిబ్బంది బాగా పనిచేస్తున్నారని కితాబిచ్చారు. జిల్లా ప్రాజెక్ట్ డెరైక్టర్ ఎ.కల్యా ణ చక్రవర్తిని యోగిగా ఆమె అభివర్ణించారు. సిబ్బంది ఉద్యోగంపై అభద్రతా భావానికి గురి కావద్దన్నారు. కసి పెరిగి.. కలెక్టర్ సౌరభ్‌గౌర్ మాట్లాడుతూ.. 2011-12 ఏడాదికి జాతీయ అవార్డుకు దరఖాస్తు చేసినపుడు జాతీయ డేటా బేస్‌తో సరిపోల్చడం లేదని అధికారులు చెప్పారని.. దీంతో మరింత పట్టుదలగా పనిచేశామన్నారు. వంద రోజుల పనిపూర్తి చేసిన వారి సంఖ్యను గణనీయంగా పెంచేందుకు కృషి చేశామన్నారు. ఈ పనుల వల్ల రైతులకు చెరువు లు బాగుపడి సాగునీరు అందుతోందని, కూలీలకు రేట్లు పెరిగాయని, వేతన చెల్లిం పులో ఆర్థిక అసమానతలు తొలగాయని చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో ఈఏడాది *60 నుంచి *70కోట్లుతో రహదారులు నిర్మిస్తున్నామన్నారు. రోజుకు 5 లక్షల మంది కూలీలు పనికి వచ్చేలా ప్రోత్సహించి.. రికార్డు స్థాపించాలని కోరారు. 3.95 లక్షల కుటుంబాలు, 5.12లక్షల మంది పనికి హాజరవుతున్నారన్నారు. ఎస్సీ, ఎస్టీలలో 64శాతం మంది మాత్రమే 100 రోజుల పనిదినాలను పూర్తి చేసుకున్నారని, నూరు శాతం కుటుంబాలు 150 రోజుల పనిదినాలను పూర్తి చేసుకొనుటకు చర్యలు చేపట్టాలన్నారు. జాయింట్ కలెక్టర్ వీరపాండ్యన్ మాట్లాడుతూ జిల్లాలో ఉపాధిహామీ పథకం చక్కగా అమలవుతోందన్నారు. భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిగా పనిచేస్తున్నపుడు శ్రీకాకుళం విజయాలు విని..అధ్యయనం చేసేందుకు సిబ్బందిని పంపించానన్నారు. నీటియాజమాన్య సంస్థ ప్రాజెక్టు డెరైక్టర్ ఎ.కల్యాణ చక్రవర్తి మాట్లాడుతూ 2012-13 సంవత్సరంలో *394 కోట్లు ఖర్చు చేశామని, 2013-14లో 2లక్షల కుటుంబాలకు వంద రోజుల పనిదినాలు కల్పించాలని కలెక్టర్ లక్ష్యం గా నిర్ణయించారన్నారు. పథకం సహాయ ప్రాజెక్టు డెరైక్టర్లు, సహాయ ప్రొగ్రాం అధికారులు, క్షేత్ర సహాయకులు, సాంకేతిక సహాయకులు మాట్లాడారు. ఉత్తమ పనితీరు కనబరిచిన 90 మందికి ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా రెడ్‌క్రాస్ చిక్కోలు చిరుదివ్వెలు ట్రస్ట్‌కు ఉపాధి హామీ పథకం అధికారులు, సిబ్బంది *2.50లక్షల చెక్కును కలెక్టర్‌కు అందజేశారు. అనంతరం సిక్కోలు ఉపాధి హామీ పథకం సమ్మేళన్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ముందుగా సిబ్బంది ఏర్పా టు చేసిన ఎగ్జిబిషన్ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ఉపాధి పథకం అదనపు ప్రాజెక్టు డెరైక్టర్ ఆర్.గణపతిరావు, పంచాయతీ రాజ్ కార్యనిర్వాహక ఇంజినీర్ ఎ.ప్రభాకరరావు, గాయత్రీ కళాశాల ప్రిన్సిపాల్ పుల ఖండం శ్రీనివాసరావు, ఉపాధిహామీ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
రైతుల ఆత్మహత్యలు ఆగేదెన్నడు?
అందరి ఆకలి తీర్చేందుకు ఆరుగాలం శ్రమించే అన్నదాతలు పెను సంక్షోభంలో చిక్కుకున్నారు. సాగు భారమై చాలా మంది బలవన్మరణాల పాలవుతున్నారు. మరికొందరు సాగు వదిలి పొట్ట కూటి కోసం వలసపోతున్నారు. రైతుల మూలుగ పీల్చేస్తున్న సంక్షోభానికి ప్రభుత్వ విధానాలతోపాటు మనమూ కారణ మేనంటున్నారు స్వతంత్ర శాస్త్రవేత్త డా. జీ వీ రామాంజనేయులు మన దేశంలో వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోయింది. అన్నదాతల బలవన్మరణాలు ఈ సంక్షోభ తీవ్రతను ఎత్తిచూపుతున్నాయి. ముఖ్యంగా మెట్ట పొలాల్లో విస్తారంగా పత్తి సాగవుతున్న రాష్ట్రాల్లో రైతుల ఆత్మహత్యలు పెద్దసంఖ్యలో జరుగుతున్నాయి. జాతీయ నేర నమోదు సంస్ధ (ఎన్సీఆర్బీ)-2012 నివేదిక(2013 నివేదిక ఇంకా వెలువడలేదు) ప్రకారం.. గత 18 ఏళ్లలో దేశవ్యాప్తంగా 2,84,694 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తుల విభాగంలో రైతుల ఆత్మహత్యలను ఎన్సీఆర్బీ 1995 నుంచి నమోదు చేస్తోంది. వర్షాధార పంటలు పండించే మెట్ట ప్రాంతాల్లో అత్యధిక విస్తీర్ణంలో పత్తి పంటను సాగు చేస్తున్న రాష్ట్రాలు నాలుగు.. ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్. దేశంలో ఆత్మ హత్యలు చేసుకున్న రైతుల్లో 68% మంది ఈ నాలుగు రాష్ట్రాలకు చెందిన వారే. రైతుల ఆత్మహత్యలు 2011 లోకన్నా 2012లో మహా రాష్ట్రలో 13%, ఆంధ్ర ప్రదేశ్‌లో 17% పెరిగాయి. మన రాష్ట్రంలో గత 18 ఏళ్లలో 35,898 మంది రైతు లు ఆత్మహత్యల పాలయ్యా రు. బలవన్మరణం చెందుతున్న రైతుల్లో 66% మంది తెలంగాణ, 18% కోస్తా, 16% రాయలసీమ జిల్లాల వారు. వ్యవసాయ రంగాన్ని చుట్టు ముట్టిన పెను సంక్షోభానికి రైతుల ఆత్మహత్యలు ఒక సూచిక మాత్రమే. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబీకులతోపాటు.. తినోతినకో బతుకులీడుస్తున్న బడుగు రైతు కుటుంబాల పరిస్థితీ దుర్భరంగానే ఉంది. గ్రామీణులు పెద్దసంఖ్యలో పట్టణాలకు వలస పోవడం, నిరుద్యోగం, వ్యవసాయ కార్మికులకు ఎక్కువ రోజులు పనులు దొరక్కపోవడం, పౌష్టికాహారలోపం, అనారోగ్యం, సాంఘిక సమస్యల్లో కూడా వ్యవసాయ సంక్షోభం ప్రతిఫలిస్తోంది. కానీ, సంక్షోభాన్ని పారదోలేందుకు ప్రభుత్వం పూర్తిస్థాయి చర్యలు తీసుకోవడం లేదు. 2011 జనాభా గణన ప్రకారం.. మన రాష్ట్రంలో రోజుకు 375 మంది రైతులు వ్యవసాయం మానేస్తున్నారు. 2001-2011 మధ్య పదేళ్లలో 13,68,012 మంది వ్యవసాయం వదిలేసి వేరే పనులు చేసుకుంటున్నారు. అయినా, సంక్షోభ తీవ్రతను పూర్తిస్థాయిలో గుర్తించడానికి ప్రభుత్వాలు నిరాకరిస్తున్నాయి. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు పరిహారం చెల్లించడానికి సంబంధించి 2004 జూన్1న అప్పటి రాష్ట్ర ప్రభుత్వం జీవో నం.421ను జారీచేసింది. బాధిత కుటుంబాలకు రూ. లక్ష పరిహారంతోపాటు రుణబకాయిల చెల్లింపులకు మరో రూ.50 వేలు కూడా ఇచ్చింది. అప్పటి మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ. లక్ష చొప్పున పరిహారం ప్రకటించింది. అయితే, బాధిత కుటుం బం పరిహారానికి అర్హమైనదా కాదా అని నిర్ణయించే ప్రక్రియలో ‘న్యాయమైన రైతు ఆత్మ హత్యలు’ అనే కొత్త వర్గీ కరణను ఈ రెండు రాష్ట్రా ల్లోనూ ప్రవేశపెట్టారు. దీని వల్ల చాలా బాధిత కుటుంబాలకు సహాయం అందకుండా పోతున్నది. ఎన్సీఆర్బీ 18 ఏళ్లలో మన రాష్ట్రంలో 35,898 మంది రైతులు ఆత్మహత్య చేసుకు న్నారని చెబుతుండగా, 5,241 మాత్రమే ‘న్యాయమైన’ ఆత్మహత్యలుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. 2012లో మన రాష్ట్రంలో 2,572 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఎన్సీఆర్బీ తేల్చింది. అయితే, 141 మంది రైతుల ఆత్మహత్యలను మాత్రమే ప్రభుత్వం గుర్తిం చింది. మిగతా బాధిత కుటుంబాలు పరిహారం అందుకునే అవకాశాన్ని శాశ్వతంగా కోల్పోతున్నాయి. ప్రభుత్వ విధానాలు రైతులకు నష్టదాయకంగా పరిణమిస్తున్నాయి. 2013లోనూ వందలాది మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.. పంట పొలాల్లో మరణ మృదంగం ఇప్పటికీ మోగుతూనే ఉంది. మనందరికీ అన్నవస్త్రాలు అందించడానికి చెమటోడ్చు తున్న రైతులు అపసవ్యమైన ప్రభుత్వ విధానాల వల్ల ఆత్మహత్యల పాలవుతుండడం మనందరికీ అవమానకరం కాదా? తప్పుడు వ్యవసాయ పద్ధతులను, విధానాలను బలపరచడం, ప్రోత్సహించడం లేదా వాటి గురించి మాట్లాడకుండా మిన్నకుండిపోవడం ద్వారా.. ఈ సంక్షోభానికి ఒక రకంగా మనందరమూ కారకులమే అందుకే.. దీన్ని గురించి మనం చర్చించుకోవాలి. వ్యాసకర్త చిరునామా: సుస్థిర వ్యవసాయ కేంద్రం, 12-13-445, వీధి నం.1, తార్నాక, సికింద్రాబాద్- 500 017. ఫోన్లు: 040-27017735 కొత్త టెక్నాలజీలతో అగ్నికి ఆజ్యం సంక్షోభ తీవ్రత పెరిగిన ప్రతిసారీ సరికొత్త సాంకేతికతలను ప్రవేశపెట్టడం ద్వారా ‘అద్భుత’ పరిష్కారాన్ని ముందుకు తేవడం పాలకులకు పరిపాటైంది. రాష్ట్రంలో 1987-88లో తొలిసారి పత్తి రైతుల ఆత్మహత్యలు భారీగా జరిగినప్పుడు కొత్త తరం సింథటిక్ పైరిత్రాయిడ్స్‌ను ప్రవేశపెట్టారు. 1997-98లో జన్యుమార్పిడి పత్తి వంగడాలను పరిష్కారంగా చూపారు. అయితే, బీటీపత్తి వల్ల సంక్షోభం మరింత పెరిగింది. ఆత్మహత్య చేసుకుంటున్న రైతుల్లో 70% మంది అననుకూల మెట్ట పొలాల్లో పత్తి సాగు చేస్తున్నవారే. నివేదికలు బుట్టదాఖలు వ్యవసాయ సంక్షోభాన్ని ఎలా పరిష్కరించాలనే అంశంపై కనీసం 53 కమిటీలు నివేదికలిచ్చాయి. డాక్టర్ ఎమ్మెస్ స్వామినాధన్ కమిషన్, జయతి ఘోష్ కమిషన్ నివేదికలు ముఖ్యమైనవి. ఈ కమిటీల సిఫారసులు చాలా వరకు అమలుకు నోచుకోలేదు. దా‘రుణ ’ బంధాలు! పెరుగుతున్న అప్పుల భారం సంక్షోభానికి మూల కారణాల్లో ఒకటి. 2004లో యూపీఏ ప్రభుత్వం రుణాలను రద్దు చేసినా, ప్రెవేటు అప్పులున్న రైతులకు ప్రయోజనం కలగలేదు. ఇప్పుడు కూడా చాలా మంది రైతులు అప్పుల భారం మోస్తున్నారు. 1990 తర్వాత బ్యాంకుల ప్రాధాన్యాల్లో మార్పు వల్ల రైతులకు అందుతున్న రుణాల శాతం తగ్గిపోయింది. వ్యవసాయ సంక్షోభం పరిష్కార మార్గాలివీ..! వ్యవసాయ సంక్షోభం పరిష్కారం కావాలంటే.. సాగు పద్ధతుల్లోనూ, ప్రభుత్వ విధానాల్లోనూ సమూల మార్పులు తేవడం తప్పనిసరి. 1. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను ఆదుకోవడానికి సమగ్ర ప్యాకేజీని అమలు చేయాలి. ప్రభుత్వ, ప్రెవేటు అప్పులు తీర్చడం, భూమిని తనఖా నుంచి విడిపించడం, వ్యవసాయ/వ్యవసాయేతర ఉపాధికి దోహదపడడంతోపాటు పిల్లల చదువు కొనసాగేలా చూడాలి. వైద్య సదుపాయాలు కల్పించాలి. నెలకు రూ.5 వేల చొప్పున వితంతు పింఛను ఇవ్వాలి. ప్యాకేజీలను బాధల్లో ఉన్న రైతులకు నిజంగా ఉపయోగపడేలా మార్చి, నిబంధనలను సులభతరం చేయాలి. ప్రత్యేక ప్యాకేజీల అమలు బాధ్యతను పంచాయతీలకివ్వాలి. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలన్నిటికీ పరిహారం ఇచ్చి, సంక్షేమ పథకాలన్నిటినీ వర్తింపజేయాలి. 2. తీవ్ర అప్పుల భారంతో విలవిల్లాడుతున్న రైతు కుటుంబాలకు రుణ విముక్తి కల్పించాలి. బీమా సదుపాయం కల్పించి, భూమిని తనఖా నుంచి విడిపించాలి. ఆహార పథకాలను వర్తింపజేయాలి. 3. పర్యావరణ అనుకూల సుస్థిర వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించాలి. తద్వారా సాగు ఖర్చులతోపాటు పంట నష్టపోయే రిస్క్ తగ్గుతుంది. అందుబాటులో ఉన్న వనరులతో మన రాష్ట్రంలో రైతులు చేస్తున్న కమ్యూనిటీ మేనేజ్డ్ సస్టయినబుల్ అగ్రికల్చర్(సీఎంఎస్ఏ) పద్ధతులను పలు రాష్ట్రాల్లో రైతులు అనుసరిస్తూ నిలదొక్కుకుంటున్నారు. ఇటువంటి వ్యవసాయ పద్ధతులను ప్రభుత్వం ప్రోత్సహించాలి. 4. పంటల కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)లను వాస్తవ సాగు ఖర్చుకన్నా ఎక్కువగా ఉండేలా నిర్ణయించాలి. ధాన్యం, పత్తితోపాటు మెట్ట పంటల దిగుబడులను కూడా ప్రభుత్వమే సేకరించాలి. 5. కౌలు రైతులు, రుణాలు తీసుకోని వారు సహా రైతులందరికీ లోపరహితమైన బీమా, రుణ సదుపాయాలు కల్పించడం.. సమర్థవంతంగా అమలు చేయడం ముఖ్యం. ఈ సత్వర చర్యలతోపాటు.. సాగు ఖర్చుకు 50% కలిపి మద్దతు ధర ప్రకటించడం, రైతు కుటుంబాలన్నిటికీ ఆదాయ భద్రత కల్పించడం, మెట్ట ప్రాంతాలకు నీటిపారుదల సదుపాయం కల్పించడం వంటి దీర్ఘకాలిక చర్యలు కూడా తీసుకోకుంటే వ్యవసాయం సంక్షోభం నుంచి బయటపడుతుంది. -
నిధుల పంచాయితీ
సాక్షి, కొత్తగూడెం: పంచాయతీ పాలక వర్గాలు కొలువుదీరాయో.. లేదో అప్పుడే నిధుల ‘పంచాయితీ’ మొదలైంది. పంచాయతీలకు తొలివిడతగా ఉపాధి పథకం కింద నిధులు విడుదలయ్యాయి. ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో సీసీ రోడ్లు, ఇతర పనుల నిర్మాణానికి రూ. 37 కోట్లు మంజూరయ్యాయి. ఈ పనులు తామంటే..తామే చేస్తామంటూ సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, ఆయా పంచాయతీల్లోని నేతలు పోటీ పడుతుండటంతో మొదటే లొల్లితో షురువైందనే విమర్శలు వస్తున్నాయి. మహత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గత ఏడాది అత్యధిక పనిదినాలు నమోదైన పంచాయతీలకు ప్రోత్సాహకంగా ప్రతి మండలంలోని రెండు పంచాయితీలకు.. ఒక్కో పంచాయతీకి రూ. 50 లక్షల చొప్పున మంజూరు చేయాలని గ్రామీణాభివృద్ధి శాఖ భావించింది. అంతలోనే ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో ప్రభుత్వం ఈ ప్రతిపాదనను ఉపసంహరించుకుంది. కోడ్ ముగిసిన తర్వాత అన్ని పంచాయతీలకు రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం ఈ నిధులతో చేపట్టాలి. నిధులు మంజూరైనా ఈ పనుల ప్రారంభంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని మరోవైపు సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. ఉపాధి ద్వారా ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వం భావించినా.. క్షేత్ర స్థాయిలో మాత్రం లక్ష్యం నెరవేరడం లేదు. గతంలో పలు పంచాయతీల్లో ఈ నిధుల ద్వారా చేపట్టిన పనుల ఆనవాళ్లు మచ్చుకైనా కనిపించడం లేదు. పంచాయతీలకు పాలకవర్గాలు వచ్చిన తర్వాత ఈ నిధులతో చేపట్టే పనులపైనైనా పర్యవేక్షణ కొనసాగించాల్సిన అవసరం ఉందని పలువురంటున్నారు. లేకుంటే నేతల కనుసన్నల్లో జరిగే ఈ పనుల్లో నాణ్యత ముణ్నాళ్ల ముచ్చట కానుంది. పంచాయతీ పాలక వర్గాలు కొలువుదీరిన తర్వాత తొలిసారిగా ఉపాధి హామీ పథకం ద్వారా ఆయా పంచాయతీలకు నిధులు విడుదల కావడంతో.. ఈ పనులు చేయడానికి ఎవరికివారు పోటీ పడుతున్నారు. మేమంటే మేమే చేస్తాం.. మరో వైపు కొంతమంది అధికారులు ఈ పనులను ఎప్పుడు చేపడతారంటూ.. ఆయా సర్పంచ్‌లపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. తొలిసారిగా వచ్చిన పనులను తామే చేయాలన్న ఉద్దేశంతో సర్పంచ్‌లున్నారు. తమకు కూడా పనులు ఇవ్వాలని ఉప సర్పంచ్‌లు, గ్రామాల్లోని చోటామోటా నాయకులు డిమాండ్ చేస్తుండటంతో ‘ ఆలూలేదు.. సూలూ లేదు..కొడుకుపేరు సోమలింగం’ అన్న చందంగా పనులపై అప్పుడే లడాయి మొదలైంది. ‘పోటీలో నిలబడి రూ. లక్షలు ఖర్చు చేసి ఎలాగో నెగ్గాం.. ’ఈ పని తామే చేస్తే కొంతైనా మిగులుతుందని, మీరే ఎలాగైనా గ్రామంలో నేతలను ఒప్పించాలని సర్పంచ్‌లు తమ నియోజకవర్గ ఎమ్మెల్యేలను ప్రాధేయపడుతున్నారు. మరోవైపు తాము ఉండబట్టే సర్పంచ్‌గా గెలిచారని, తర్వాత వచ్చే పనులు సర్పంచ్ చేసుకోవచ్చని ఈ పని తమకే అప్పగించాలని పంచాయతీల పరిధిలోని పేరుమోసిన నాయకులు తమ ఎమ్మెల్యేలకు సూచిస్తున్నారు. తామేం తక్కువ తినలేదంటూ ఉప సర్పంచ్‌లు కూడా తమకు పనుల్లో వాటా కావాలని సర్పంచ్‌లను నిలదీస్తున్నారు. ప్రజాప్రతినిధుల మాటే వేదం.. పంచాయతీల్లో ఈ పనుల పంపకంపై ఘర్షణ వాతావరణం నెలకొంటుండగా.. చివరకు స్థానిక ప్రజాప్రతనిధులు ఫైనల్ చేసిన వారికే పనులు దక్కుతాయని ప్రచారం జరుగుతోంది. అధికార పార్టీ మద్దతుతో గెలిచిన సర్పంచ్‌లు తమకే ఈ పనులు దక్కుతాయన్న ధీమాలో ఉన్నారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధి ఉండి, ఇతర పార్టీల మద్దతుతో గెలిచిన సర్పంచ్‌లు మాత్రం ఈ పనుల విషయంలో డైలామాలో ఉన్నారు. ఈ పనుల వ్యవహారంలో ఎమ్మెల్యే తల దూరుస్తే పంచాయతీల్లో వారి పార్టీ నాయకులకే ఈ పనులు దక్కుతాయేమోనన్న ఆందోళనలో ఉన్నారు. ఇలా అయితే పంచాయతీల్లో మళ్లీ పార్టీల పరంగాగొడవలు మొదలయ్యే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది. మరోవైపు సంబంధిత అధికారులు మాత్రం నిధులైతే వచ్చాయి.. పనుల్లో నాణ్యత ఉండేలా పర్యవేక్షించడమే తమ విధిఅని పైకి చెబుతుండగా చివరకు స్థానిక ప్రజాప్రతినిధులు చెప్పిందే వేదంగా పంచాయతీల్లో పనుల పంపకం జరుగుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.