సీఎం చంద్రశేఖర్ రావు
సాక్షి, హైదరాబాద్: బీసీలు, ఎంబీసీల స్వయం ఉపాధి పథకాలకు ఆర్థిక సహాయం అందించే కార్యక్రమాన్ని వెంటనే ప్రారంభించాలని అధికారులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. బీసీలు, ఎంబీసీల స్వయం ఉపాధి కోసం రూపొందించే పథకాలకు సంబంధించి కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం ముందుకు వెళ్లేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. బ్యాంకులతో సంబంధం లేకుండానే లక్ష, రూ.2 లక్షల విలువ చేసే యూనిట్లను మంజూరు చేయాలని, దీనికి వంద శాతం ప్రభుత్వ గ్రాంటు ఇవ్వాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. బీసీలు, ఎంబీసీలకు సంబంధించి పథకాల అమలుకు అవసరమైన వ్యూహాన్ని ఖరారు చేయడానికి శనివారం ఉదయం స్పీకర్ మధుసూదనాచారి సమక్షంలో సమావేశం కావాలని మంత్రులు, అధికారులను ఆదేశించారు.
శుక్రవారం ఈ మేరకు ప్రగతిభవన్‌లో వివిధ అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రులు ఈటల రాజేందర్, సి.లక్ష్మారెడ్డి, జోగు రామన్న, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు రామకృష్ణారావు, శాంతాకుమారి, బుర్రా వెంకటేశం, కార్యదర్శులు భూపాల్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రతి మండలంలో రెసిడెన్షియల్ స్కూల్
ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రారంభించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్లు అద్భుతమైన ఫలితాలు ఇస్తున్నాయని సీఎం కేసీఆర్ చెప్పారు. ప్రతి మండలానికి ఒక రెసిడెన్షియల్ స్కూలు పెట్టే లక్ష్యంతో ప్రభుత్వం ఉందని తెలిపారు. దశలవారీగా రెసిడెన్షియల్ స్కూళ్ల సంఖ్య పెంచుతామని అన్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున 119 బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలు అదనంగా ప్రారంభించాలని చెప్పారు.
ఏటా వంద కోట్ల మొక్కలు
ప్రతి గ్రామంలో నర్సరీ పెంచి వచ్చే ఏడాది నుంచి ఏడాదికి వంద కోట్ల మొక్కలు నాటే లక్ష్యంతో హరితహారం కార్యక్రమాన్ని చేపట్టాలని సీఎం ఆదేశించారు. ఇందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని, ఆ మేరకు నర్సరీల సంఖ్యను పెంచాలని అధికారులకు సూచించారు. ఈ ఏడాది నిర్వహించే హరితహారంతోపాటు వచ్చే ఏడాది నుంచి అవలంబించాల్సిన వ్యూహం ఖరారు చేయడానికి శనివారం మధ్యాహ్నం ప్రగతిభవన్‌లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. అటవీ, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల మంత్రులు, అధికారులు ఈ సమావేశంలో పాల్గొనాలని సూచించారు.
19.83 శాతం ఆదాయాభివృద్ధి
2018–19 మొదటి త్రైమాసికంలో రాష్ట్ర ఆదాయాభివద్ధి రేటు 19.83 శాతం నమోదు కావడంపై సీఎం కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. 2018–19 తొలి 3 నెలల్లో తెలంగాణలో స్వీయ ఆదాయం 19.83 శాతం వృద్ధి రేటు సాధించినట్లు అధికారులు కేసీఆర్‌కు వివరించారు. గడిచిన నాలుగేళ్లలో తెలంగాణ దేశంలోనే అత్యధిక ఆదాయ వృద్ధిరేటు నమోదు చేసిందని, 2018–19లోనూ అదే దిశగా పయనించడం శుభసూచకమని సీఎం అన్నారు. 2017–18 మొదటి త్రైమాసికంలో తెలంగాణలో రూ.13,374.25 కోట్ల ఆదాయం వచ్చిందని, 2018–19 మొదటి త్రైమాసికంలో రూ.16,026.63 కోట్లకు పెరిగిందని తెలిపారు.
9న కేబినెట్ భేటీ
జూలై 9న సాయంత్రం నాలుగు గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరుగనుంది. ముఖ్యమంత్రి కార్యాలయం ఈ మేరకు ఒక ప్రకటనలో తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment