సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ అవిరామ కృషితో రాష్ట్రంలో సబ్బండ కులాల జీవనంలో గుణాత్మక మార్పులు వస్తున్నాయని.. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన కులవృత్తులను మరింతగా ప్రోత్సహిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఇప్పటికే గొర్రెల పంపిణీ, చేపల పెంపకం వంటి పథకాలు అద్భుతాలను నమోదు చేశాయని చెప్పారు. మంగళవారం ప్రగతిభవన్‌లో ‘వృత్తి కులాలైన బీసీ వర్గాల అభ్యున్నతి– ప్రభుత్వ కార్యాచరణ– రెండో విడత గొర్రెల పంపిణీ’అంశాలపై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. బీసీలను అన్నిరంగాల్లో ఆదుకోవడానికి ప్రణాళికలు రచించి, అమలు చేస్తున్నామని చెప్పారు.
ఈ అభివృద్ధి, సంక్షేమ పథకాలు బీసీల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయన్నారు. ‘‘ప్ర భుత్వ చర్యలతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం అవుతోంది. కులవృ త్తులను మరింతగా ప్రోత్సహిస్తాం. ఒకనాడు బ్రా హ్మణులతో సమానంగా గౌరవం పొందిన పద్మ శాలి వర్గం సమైక్య పాలనలో ఆకలిచావులకు, ఆత్మహత్యలకు బలైపోయింది. ప్రభుత్వ చిత్తశుద్ధి, మంత్రి కేటీఆర్ కార్యదక్షతతో చేనేత వృత్తి సాధారణ స్థితికి చేరుకుంది. ప్రభుత్వం వారితోపాటు గౌడలు, నాయీ బ్రాహ్మ ణులు, రజక, ఇతర వృత్తికులాల అభ్యున్నతికి వినూత్న పథకాలను అమలు చేస్తూ అభివృద్ధి పథాన నడిపిస్తున్నది’’అని పేర్కొన్నారు.
గొర్రెల సంపత్తిలో నంబర్‌వన్
గొర్రెల సంపత్తిలో తెలంగాణ రాజస్థాన్‌ను అధిగమించి దేశంలో నంబర్ వన్ స్థానానికి చేరుకుందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. రెండో విడత గొర్రెల పంపిణీకి నిధులు సమకూర్చాలని ఆర్థిక శాఖను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ‘‘రూ.5 వేలకోట్లతో చేపట్టిన మొదటి విడత గొర్రెల పంపిణీ అద్భుత ఫలితాలిచ్చింది. రెండో విడత పంపిణీ కోసం మరో రూ.6 వేల కోట్లను కేటాయిస్తున్నాం. ఇప్పుడు ఇస్తున్నట్టుగానే (ఒక యూనిట్‌లో 20 గొర్రెలు, ఒక పొట్టేలు) పంపిణీ కొనసాగించాలి. యూనిట్ ధరను రూ.1.75 లక్షలకు పెంచుతున్నాం. ఇప్పటికే డీడీలు కట్టిన 14 వేల మందికీ ఈ పెంపును వర్తింపజేస్తాం’’అని తెలిపారు.
మత్స్యశాఖ ద్వారానే చేపల పెంపకం
సముద్రతీరానికి దూరంగా ఉన్న పట్టణాలు, నగరాలకు చేపలు ఎగుమతి చేసేలా చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. గ్రామీణ చెరువుల్లో చేపల ఉత్పత్తి మత్స్యశాఖ పర్యవేక్షణలోనే ఉంటుందని స్పష్టం చేశారు. 18 ఏళ్లు నిండి, అర్హులైన యువకులకు చేపల పెంపకాల సొసైటీల్లో అవకాశం కల్పించాలని ఆదేశించారు.
రెండో విడతలో
3.81 లక్షల యూనిట్లు: మంత్రి తలసాని
రెండో విడతలో భాగంగా 3.81 లక్షల మందికి గొర్రెలను పంపిణీ చేస్తామని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు రూ.6 వేల కోట్లు మంజూరు చేయడంపై సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. లక్షలాది మంది గొల్లకుర్మలు కేసీఆర్‌కు రుణపడి ఉంటారని పేర్కొన్నారు. త్వరలోనే గొర్రెల పంపిణీని పెద్ద ఎత్తున ప్రారంభిస్తామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 8,109 గొర్రెల పెంపకందారుల సొసైటీల్లోని 7,61,898 మందికి సబ్సిడీ గొర్రెలు ఇవ్వాలన్నది ప్రభుత్వ లక్ష్యమని తలసాని తెలిపారు. మొదటివిడతలో రూ.4,702.78 కోట్లతో 3,76,223 యూనిట్లను పంపిణీ చేశామని.. వాటితో 1.37 కోట్ల గొర్రెపిల్లలు జన్మించాయని, గొల్లకుర్మలకు రూ.6,850 కోట్ల మేర ఆదాయం సమకూరిందని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ గొర్రెల యూనిట్ మొత్తాన్ని రూ.1.75 లక్షలకు పెంచారని.. ఈ మేరకు లబ్ధిదారులు తమ వాటాగా రూ.43,750 చొప్పున డీడీలు చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment