రైతుల ఆత్మహత్యలు ఆగేదెన్నడు? | farmers suicide when going to end | Sakshi
Sakshi News home page

రైతుల ఆత్మహత్యలు ఆగేదెన్నడు?

Published Mon, Feb 17 2014 4:32 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

రైతుల ఆత్మహత్యలు ఆగేదెన్నడు? - Sakshi

రైతుల ఆత్మహత్యలు ఆగేదెన్నడు?

 అందరి ఆకలి తీర్చేందుకు ఆరుగాలం శ్రమించే అన్నదాతలు పెను సంక్షోభంలో చిక్కుకున్నారు. సాగు భారమై చాలా మంది బలవన్మరణాల పాలవుతున్నారు. మరికొందరు సాగు వదిలి పొట్ట కూటి కోసం వలసపోతున్నారు. రైతుల మూలుగ పీల్చేస్తున్న సంక్షోభానికి ప్రభుత్వ విధానాలతోపాటు మనమూ కారణ మేనంటున్నారు స్వతంత్ర శాస్త్రవేత్త డా. జీ వీ రామాంజనేయులు
 
 మన దేశంలో వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోయింది. అన్నదాతల బలవన్మరణాలు ఈ సంక్షోభ తీవ్రతను ఎత్తిచూపుతున్నాయి. ముఖ్యంగా మెట్ట పొలాల్లో విస్తారంగా పత్తి సాగవుతున్న రాష్ట్రాల్లో రైతుల ఆత్మహత్యలు పెద్దసంఖ్యలో జరుగుతున్నాయి. జాతీయ నేర నమోదు సంస్ధ (ఎన్‌సీఆర్‌బీ)-2012 నివేదిక(2013 నివేదిక ఇంకా వెలువడలేదు) ప్రకారం.. గత 18 ఏళ్లలో దేశవ్యాప్తంగా 2,84,694 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తుల విభాగంలో రైతుల ఆత్మహత్యలను ఎన్‌సీఆర్‌బీ 1995 నుంచి నమోదు చేస్తోంది.

 వర్షాధార పంటలు పండించే మెట్ట ప్రాంతాల్లో అత్యధిక విస్తీర్ణంలో పత్తి పంటను సాగు చేస్తున్న రాష్ట్రాలు నాలుగు.. ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్. దేశంలో ఆత్మ హత్యలు చేసుకున్న రైతుల్లో 68% మంది ఈ నాలుగు రాష్ట్రాలకు చెందిన వారే. రైతుల ఆత్మహత్యలు 2011 లోకన్నా 2012లో మహా రాష్ట్రలో 13%, ఆంధ్ర ప్రదేశ్‌లో 17% పెరిగాయి. మన రాష్ట్రంలో గత 18 ఏళ్లలో 35,898 మంది రైతు లు ఆత్మహత్యల పాలయ్యా రు. బలవన్మరణం చెందుతున్న రైతుల్లో 66% మంది తెలంగాణ, 18% కోస్తా, 16% రాయలసీమ జిల్లాల వారు.
 వ్యవసాయ రంగాన్ని చుట్టు ముట్టిన పెను సంక్షోభానికి రైతుల ఆత్మహత్యలు ఒక సూచిక మాత్రమే. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబీకులతోపాటు.. తినోతినకో బతుకులీడుస్తున్న బడుగు రైతు కుటుంబాల పరిస్థితీ దుర్భరంగానే ఉంది. గ్రామీణులు పెద్దసంఖ్యలో పట్టణాలకు వలస పోవడం, నిరుద్యోగం, వ్యవసాయ కార్మికులకు ఎక్కువ రోజులు పనులు దొరక్కపోవడం, పౌష్టికాహారలోపం, అనారోగ్యం, సాంఘిక సమస్యల్లో కూడా వ్యవసాయ సంక్షోభం ప్రతిఫలిస్తోంది. కానీ, సంక్షోభాన్ని పారదోలేందుకు ప్రభుత్వం పూర్తిస్థాయి చర్యలు తీసుకోవడం లేదు.  
 2011 జనాభా గణన ప్రకారం.. మన రాష్ట్రంలో రోజుకు 375 మంది రైతులు వ్యవసాయం  మానేస్తున్నారు. 2001-2011 మధ్య పదేళ్లలో 13,68,012 మంది వ్యవసాయం వదిలేసి వేరే పనులు చేసుకుంటున్నారు. అయినా, సంక్షోభ తీవ్రతను పూర్తిస్థాయిలో గుర్తించడానికి ప్రభుత్వాలు నిరాకరిస్తున్నాయి. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు పరిహారం చెల్లించడానికి సంబంధించి 2004 జూన్1న అప్పటి రాష్ట్ర ప్రభుత్వం జీవో నం.421ను జారీచేసింది. బాధిత కుటుంబాలకు రూ. లక్ష పరిహారంతోపాటు రుణబకాయిల చెల్లింపులకు మరో రూ.50 వేలు కూడా ఇచ్చింది. అప్పటి మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ. లక్ష చొప్పున పరిహారం ప్రకటించింది. అయితే, బాధిత కుటుం బం పరిహారానికి అర్హమైనదా కాదా అని నిర్ణయించే ప్రక్రియలో ‘న్యాయమైన రైతు ఆత్మ హత్యలు’ అనే కొత్త వర్గీ కరణను ఈ రెండు రాష్ట్రా ల్లోనూ ప్రవేశపెట్టారు. దీని వల్ల చాలా బాధిత కుటుంబాలకు సహాయం అందకుండా పోతున్నది.

 ఎన్‌సీఆర్‌బీ 18 ఏళ్లలో మన రాష్ట్రంలో 35,898 మంది రైతులు ఆత్మహత్య చేసుకు న్నారని చెబుతుండగా, 5,241 మాత్రమే ‘న్యాయమైన’ ఆత్మహత్యలుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. 2012లో మన రాష్ట్రంలో 2,572 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఎన్‌సీఆర్‌బీ తేల్చింది. అయితే, 141 మంది రైతుల ఆత్మహత్యలను మాత్రమే ప్రభుత్వం గుర్తిం చింది. మిగతా బాధిత కుటుంబాలు పరిహారం అందుకునే అవకాశాన్ని శాశ్వతంగా కోల్పోతున్నాయి. ప్రభుత్వ విధానాలు రైతులకు నష్టదాయకంగా పరిణమిస్తున్నాయి. 2013లోనూ వందలాది మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు..  పంట పొలాల్లో మరణ మృదంగం ఇప్పటికీ మోగుతూనే ఉంది. మనందరికీ అన్నవస్త్రాలు అందించడానికి చెమటోడ్చు తున్న రైతులు అపసవ్యమైన ప్రభుత్వ విధానాల వల్ల ఆత్మహత్యల పాలవుతుండడం మనందరికీ అవమానకరం కాదా? తప్పుడు వ్యవసాయ పద్ధతులను, విధానాలను బలపరచడం, ప్రోత్సహించడం లేదా వాటి గురించి మాట్లాడకుండా మిన్నకుండిపోవడం ద్వారా.. ఈ సంక్షోభానికి ఒక రకంగా మనందరమూ కారకులమే అందుకే.. దీన్ని గురించి మనం చర్చించుకోవాలి.
 వ్యాసకర్త చిరునామా: సుస్థిర వ్యవసాయ కేంద్రం, 12-13-445, వీధి నం.1,
 తార్నాక, సికింద్రాబాద్- 500 017. ఫోన్లు: 040-27017735
 
 కొత్త టెక్నాలజీలతో అగ్నికి ఆజ్యం
 సంక్షోభ తీవ్రత పెరిగిన ప్రతిసారీ సరికొత్త సాంకేతికతలను ప్రవేశపెట్టడం ద్వారా ‘అద్భుత’ పరిష్కారాన్ని ముందుకు తేవడం పాలకులకు పరిపాటైంది. రాష్ట్రంలో 1987-88లో తొలిసారి పత్తి రైతుల ఆత్మహత్యలు భారీగా జరిగినప్పుడు కొత్త తరం సింథటిక్ పైరిత్రాయిడ్స్‌ను ప్రవేశపెట్టారు. 1997-98లో జన్యుమార్పిడి పత్తి వంగడాలను పరిష్కారంగా చూపారు. అయితే, బీటీపత్తి వల్ల సంక్షోభం మరింత పెరిగింది. ఆత్మహత్య చేసుకుంటున్న రైతుల్లో 70% మంది అననుకూల మెట్ట పొలాల్లో పత్తి సాగు చేస్తున్నవారే.
 
 నివేదికలు బుట్టదాఖలు
  వ్యవసాయ సంక్షోభాన్ని ఎలా పరిష్కరించాలనే అంశంపై కనీసం 53 కమిటీలు నివేదికలిచ్చాయి. డాక్టర్ ఎమ్మెస్ స్వామినాధన్ కమిషన్, జయతి ఘోష్ కమిషన్ నివేదికలు ముఖ్యమైనవి. ఈ కమిటీల సిఫారసులు చాలా వరకు అమలుకు నోచుకోలేదు.
 
 దా‘రుణ ’ బంధాలు!
 పెరుగుతున్న అప్పుల భారం సంక్షోభానికి మూల కారణాల్లో ఒకటి. 2004లో యూపీఏ ప్రభుత్వం రుణాలను రద్దు చేసినా, ప్రెవేటు అప్పులున్న రైతులకు ప్రయోజనం కలగలేదు. ఇప్పుడు కూడా చాలా మంది రైతులు అప్పుల భారం మోస్తున్నారు. 1990 తర్వాత బ్యాంకుల ప్రాధాన్యాల్లో మార్పు వల్ల రైతులకు అందుతున్న రుణాల శాతం తగ్గిపోయింది.
 
 వ్యవసాయ సంక్షోభం పరిష్కార మార్గాలివీ..!
 వ్యవసాయ సంక్షోభం పరిష్కారం కావాలంటే.. సాగు పద్ధతుల్లోనూ, ప్రభుత్వ విధానాల్లోనూ సమూల మార్పులు తేవడం తప్పనిసరి.
 1.    ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను ఆదుకోవడానికి సమగ్ర ప్యాకేజీని అమలు చేయాలి. ప్రభుత్వ, ప్రెవేటు అప్పులు తీర్చడం, భూమిని తనఖా నుంచి విడిపించడం, వ్యవసాయ/వ్యవసాయేతర ఉపాధికి దోహదపడడంతోపాటు పిల్లల చదువు కొనసాగేలా చూడాలి. వైద్య సదుపాయాలు కల్పించాలి. నెలకు రూ.5 వేల చొప్పున వితంతు పింఛను ఇవ్వాలి. ప్యాకేజీలను బాధల్లో ఉన్న రైతులకు నిజంగా ఉపయోగపడేలా మార్చి, నిబంధనలను సులభతరం చేయాలి. ప్రత్యేక ప్యాకేజీల అమలు బాధ్యతను పంచాయతీలకివ్వాలి. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలన్నిటికీ పరిహారం ఇచ్చి, సంక్షేమ పథకాలన్నిటినీ వర్తింపజేయాలి.
 2.    తీవ్ర అప్పుల భారంతో విలవిల్లాడుతున్న రైతు కుటుంబాలకు రుణ విముక్తి కల్పించాలి. బీమా సదుపాయం కల్పించి, భూమిని తనఖా నుంచి విడిపించాలి. ఆహార పథకాలను వర్తింపజేయాలి.
 3.    పర్యావరణ అనుకూల సుస్థిర వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించాలి. తద్వారా సాగు ఖర్చులతోపాటు పంట నష్టపోయే రిస్క్ తగ్గుతుంది. అందుబాటులో ఉన్న వనరులతో మన రాష్ట్రంలో రైతులు చేస్తున్న కమ్యూనిటీ మేనేజ్‌డ్ సస్టయినబుల్ అగ్రికల్చర్(సీఎంఎస్‌ఏ) పద్ధతులను పలు రాష్ట్రాల్లో రైతులు అనుసరిస్తూ నిలదొక్కుకుంటున్నారు. ఇటువంటి వ్యవసాయ పద్ధతులను ప్రభుత్వం ప్రోత్సహించాలి.
 4. పంటల కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ)లను వాస్తవ సాగు ఖర్చుకన్నా ఎక్కువగా ఉండేలా నిర్ణయించాలి. ధాన్యం, పత్తితోపాటు మెట్ట పంటల దిగుబడులను కూడా ప్రభుత్వమే సేకరించాలి.
 5.    కౌలు రైతులు, రుణాలు తీసుకోని వారు సహా రైతులందరికీ లోపరహితమైన బీమా, రుణ సదుపాయాలు కల్పించడం.. సమర్థవంతంగా అమలు చేయడం ముఖ్యం.  ఈ సత్వర చర్యలతోపాటు.. సాగు ఖర్చుకు 50% కలిపి మద్దతు ధర ప్రకటించడం, రైతు కుటుంబాలన్నిటికీ ఆదాయ భద్రత కల్పించడం, మెట్ట ప్రాంతాలకు నీటిపారుదల సదుపాయం కల్పించడం వంటి  దీర్ఘకాలిక చర్యలు కూడా తీసుకోకుంటే వ్యవసాయం సంక్షోభం నుంచి బయటపడుతుంది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement