ఊరించి..ఉసూరుమనిపించారు | no loans to un employers | Sakshi
Sakshi News home page

ఊరించి..ఉసూరుమనిపించారు

Published Fri, Mar 7 2014 2:50 AM | Last Updated on Sat, Sep 2 2017 4:25 AM

no loans to un employers

 కందుకూరు, న్యూస్‌లైన్:
 లక్ష వరకు రుణం ఇస్తామన్నారు..ఇంత మందికి రుణాలిస్తున్నామంటూ ఘనంగా సమావేశాలు పెట్టి లబ్ధిదారుల జాబితాను ప్రకటించి చివరికి చేతులెత్తేశారు. జాబితాలో పేరు చూసుకున్న లబ్ధిదారుడు మాత్రం రుణం కోసం రెండు నెలల నుంచి కార్యాలయాలు, బ్యాంక్‌లు చుట్టూ తిరుగుతున్నా సమాధానం చెప్పేవారు కరువయ్యారు. ఇండిగ్రేటెడ్ యాక్షన్ ప్లాన్ కింద వ్యక్తిగత రుణాలు మంజూరైన లబ్ధిదారుల పరిస్థితి ఇది.
 
 ఇలా మంజూరు చేస్తారు..
 ఈ యాక్షన్ ప్లాన్ కింద ఎంపికైన నిరుద్యోగులకు స్వయం ఉపాధి పొందేలా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీపై బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తాయి. ఒక లబ్ధిదారుడికి లక్ష వరకు రుణం ఇస్తారు. దీనికి గాను ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు 60 శాతం, బీసీలకు 50 శాతం, మైనార్టీలకు 50 శాతం సబ్సిడీని మంజూరు చేస్తుంది. దీంతో బ్యాంకులో రుణం పొందిన లబ్ధిదారుడు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ పోను మిగిలిన మొత్తాన్ని మాత్రమే బ్యాంక్‌కు చెల్లించాల్సి ఉంది. అంటే లక్ష రూపాయల రుణం పొందితే ఎస్సీ, ఎస్టీలు సబ్సిడీపోను * 40 వేలు, బీసీలు * 50 వేలు, మైనార్టీలు *60 వేలు బ్యాంక్‌లకు చెల్లించాలి. ఈ ప్రక్రియ మొత్తం మండల స్థాయిలో ఎంపీడీఓలు, మున్సిపాలిటీలో కమిషనర్ పర్యవేక్షణలో జరగాలి. లబ్ధిదారుల ఎంపిక దగ్గర నుంచి రుణం మంజూరు వరకు అధికారులు సమన్వయంతో వ్యవహరించాల్సి ఉంది. అయితే అధికారులు ఎంపిక చేసిన  జాబితా మొత్తం ప్రస్తుతం తప్పుల తడకగా తయారైంది. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి ఇష్టారీతిన లబ్ధిదారులను ఎంపిక చేయడంతో కొంత మంది పేర్లపై రుణాలు మంజూరు చేసేందుకు బ్యాంకు అధికారులు నిరాకరిస్తున్నారు. అలాగే ప్రభుత్వ నిబంధనలు పాటించకపోవడంతో కొంతమంది పేర్లు తిర స్కరణకు గురవుతున్నాయి.
 
 రెండు నెలల నుంచి ఎదురుచూపులు
 నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో బ్యాంక్‌ల నుంచి రుణాలు మంజూరు చేసి ప్రోత్సహిస్తారు. ఇంటిగ్రేటెడ్ యాక్షన్ ప్లాన్ కింద వ్యక్తిగత రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న అర్హులైన లబ్ధిదారుల జాబితాను రెండు నెలల క్రితమే అధికారులు ప్రకటించారు. దీనిలో భాగంగా రెండు నెలల క్రితమే నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో లబ్ధిదారుల జాబితాను అధికారులు సిద్ధం చేశారు. వీటిలో కందుకూరు మున్సిపాలిటీ పరిధిలో 637 మందిని, లింగసముద్రం మండలంలో 220, గుడ్లూరు మండలంలో 318, ఉలవపాడు మండలంలో 200, వలేటివారిపాలెం మండలంలో 210, కందుకూరు మండలంలో 200ల మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. కానీ నేటికీ ఒక్క లబ్ధిదారుడికి కూడా రుణం మంజూరు కాలేదు. ఎంపికైన లబ్ధిదారులు కార్యాలయాలు, బ్యాంక్‌ల చుట్టూ తిరుగుతున్నారు.
 
 ప్రభుత్వ జీఓలతో ఔట్..
 లబ్ధిదారుల ఎంపిక సమయంలో ఏ నిబంధనలు విధించని ప్రభుత్వం... ఆ తరువాత ఇచ్చిన జీఓలతో జాబితా నుంచి కొన్ని పేర్లు తిరస్కరిస్తున్నారు. వీటిలో ప్రధానంగా ఇటీవల వచ్చిన జీఓ నంబర్ 101 ద్వారా రుణం పొందేందుకు వయో పరిమితి విధించారు. దీని ప్రకారం బీసీలకు 40 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీలకు 45 ఏళ్ల గరిష్ట వయోపరిమితి విధించారు. అలాగే కుటుంబ ఆదాయం * 60 వేల లోపు ఉండాలి. వీరు మాత్రమే అర్హులంటూ నిబంధనలు విధించారు. దీంతో అధికారులు తయారు చేసిన జాబితా నుంచి అనేక మంది పేర్లు గల్లంతవుతున్నాయి. ఒక్క గుడ్లూరు మండలంలోని దాదాపు 80 మంది లబ్ధిదారులను అనర్హులుగా తిరస్కరించారు. అలాగే కందుకూరు మండలంలో 55 మంది అనర్హులయ్యారు. ఈ విధంగా ప్రతి మండలంలో ముందు రుణం పొందేందుకు అర్హులంటూ ఆశ కల్పించి ప్రస్తుతం రాలేదంటూ అధికారులు చేతులెత్తేస్తున్నారు.  ప్రభుత్వం విధించిన నిబంధనల ప్రకారం జాబితా నుంచి అనర్హులైన వారి స్థానంలో అధికారులు కొత్తవారిని ఎంపిక చేసి పంపుతున్నారు.  
 
 సబ్సిడీ రాక  నిలిచిన రుణాలు:
 మరోపక్క అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం మొండిచేయి చూపుతోంది. రుణాలకు అర్హుల జాబితాలు కార్పొరేషన్‌లకు చేరినా సబ్సిడీ మాత్రం మంజూరు కావడం లేదు. లబ్ధిదారుడి అకౌంట్‌లో ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ జమైతేనే రుణాలిస్తామంటూ బ్యాంక్ మేనేజర్లు పెండింగ్ పెడుతున్నారు. దీంతో అర్హులైన లబ్ధిదారులకు సైతం రుణాలు మంజూరు కాని పరిస్థితి నెలకొంది. ఈ విధంగా ప్రతి మండలం నుంచి అర్హులైన జాబితాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్‌లకు చేరినా సబ్సిడీ రాలేదనే కారణంతోనే రుణాలు నిలిచిపోతున్నాయి.
 
 ఉదాహరణకు కందుకూరు మున్సిపాలిటీ పరిధిలో 262 మంది అర్హులైన జాబితాను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్‌లకు పంపారు. అలాగే లింగసముద్రం నుంచి 70 మంది, కందుకూరు మండల పరిధిలో 92 మంది బ్యాంక్‌ల నుంచి విల్లింగ్ లెటర్ తీసుకుని సిద్ధంగా ఉన్నా, ప్రభుత్వం నుంచి రావాల్సిన సబ్సిడీ రాకపోవడంతో రుణం పొందలేకపోతున్నారు. ప్రతి మండలంలో ఇదే పరిస్థితి నెలకొంది. అలాగే బ్యాంకుల అధికారులు లబ్ధిదారులను నానా తిప్పలు పెడుతున్నారు. అధికారులు ఎంపిక చేసి జాబితాను పంపినా.. బ్యాంక్‌లు రుణాలిచ్చేందుకు నిరాకరిస్తున్నాయి. ఎంపికైన లబ్ధిదారులకు నెల రోజుల్లోపే రుణం ఇస్తామని అధికారులు, ప్రజాప్రతినిధులు గొప్పలు చెప్పినా ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. మరో రెండు, మూడు నెలలు పట్టినా ఆశ్చర్యం లేదని, ప్రభుత్వం సబ్సిడీ ఎప్పుడు విడుదల చేస్తుందో తమకు తెలియదని అధికారులే చెప్తున్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement