సాక్షి, నల్లగొండ : పంచాయతీ సెక్రటరీ పరీక్ష ఆది వారం ప్రశాంతంగా జరిగింది. జిల్లాలో ఉన్న 133 పోస్టులకు 59,793 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. కాగా ఉదయం నిర్వహిం చిన పేపర్-1కు 41,661 మంది, మధ్యాహ్నం నిర్వహించిన పేపర్ -2 పరీక్షకు 41,503 మంది హాజరయ్యారు. మొత్తం మీద పేపర్ -1 పరీక్షను 69.93 శాతం, పేపర్ -2ను 69.67 శాతం మంది అభ్యర్థులు రాశారు.
మొత్తం 8 పట్టణాల్లో ఏర్పాటు చేసిన 200 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. ఐదు రెవెన్యూ డివిజన్లతో పాటు కోదాడ, హుజూర్‌నగర్, చౌటుప్పల్‌లలో పరీక్ష జరిగింది. పేపర్ -1కు హాజరైన అభ్యర్థులకంటే.. పేపర్ -2 పరీక్షకు 158 మంది తక్కువ సంఖ్యలో పరీక్ష రాశారు. మొదటి పేపర్‌పై ఆశించిన మార్కులు రాకపోవచ్చన భావనతో రెండో పేపర్‌కు డుమ్మా కొట్టినట్లు తెలుస్తోంది. రెండు పేపర్లకు హాజరైన అభ్యర్థులను పరిగణనలోనికి తీసుకుంటే ప్రతి పోస్టుకు 312 మంది పోటీలో ఉన్నారు.
పరీక్ష హాల్‌లోకి కీ?
జిల్లాకేంద్రంలోని బ్రిలియంట్ గ్రామర్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రంలోకి కీ పేపర్ అందజేశారన్న పుకార్లు వెల్లువెత్తాయి. దీనిపై పలువురు విద్యార్థి సంఘం నేతలు టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రూం నంబర్ 2లో ఓ అభ్యర్థికి పేపర్-2కు సంబంధించిన కీ పేపర్ గుర్తు తెలియని వ్యక్తి అందజేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీన్ని చూసిన మిగిలిన అభ్యర్థులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే సదరు అభ్యర్థిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా వదిలేశారు. ఆ పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్, ఇన్విజిలిలేటర్, డీఓపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని ఎస్‌ఐని విద్యార్థి సంఘం నేతలు కోరారు. కష్టపడి చదివిన విద్యార్థులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. సదరు అభ్యర్థిపై మాల్ ప్రాక్టీస్ కింద ఎస్‌ఐ బాషా కేసు నమోదు చేసుకున్నారు. ఫిర్యాదు చేసిన వారిలో తెలంగాణ జాగృతి, బీడీఎస్‌ఎఫ్, బీజేవైఎం, టీఆర్‌ఎస్‌వీ నాయకులు భోనగిరి దేవేందర్, పందుల సైదులు, తిరందాసు సంతోష్, బొమ్మరబోయిన నాగార్జున ఉన్నారు.
చదివిందంతా వృథా అయ్యింది
గ్రామపంచాయతీ పరీక్ష కోసం ఆరు నెలలు కష్టపడి చదివా. సూర్యాపేట పట్టణంలోని గౌతమ్ మోడల్ స్కూల్‌లో సెంటర్ పడింది. దీంతో రాజాపేట మండలం బొందుగుల నుంచి ఉదయాన్నే బస్సులో వెళ్తుండగా మార్గ మధ్యలో ఆగిపోయింది. దీంతో మరో బస్సులో వచ్చాను. సూర్యాపేట కొత్తబస్టాండ్‌లో దిగి లోకల్ ఆటోలో సెంటర్ వద్దకు వెళ్లే సరికి 2 నిమిషాలు ఆలస్యమైంది. దీంతో లోనికి వెళ్లనీయలేదు. ఎంత బ్రతిమిలాడినా పట్టించుకోలేదు. ఆరు నెలల పాటు కోచింగ్ తీసుకొని కష్టపడి చదివిందంతా వృథా అయ్యింది.
- మూటకోడూరు గాయత్రి
పంచాయతీ పరీక్ష
Published Mon, Feb 24 2014 3:44 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement
Advertisement