Panchayat Secretary exam
-
ఘోరతప్పిదం: తెలంగాణ ప్రభుత్వంపై మండిపడ్డ హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీ నిర్వహించిన రాతపరీక్షలో తెలుగు మీడియం అభ్యర్థులకు 14 ప్రశ్నలను ఎటువంటి అనువాదం లేకుండా ఇంగ్లీష్‌లో ఇవ్వడాన్ని హైకోర్టు ప్రాథమికంగా తప్పుపట్టింది. దీనిని ఘోర తప్పిదంగా అభివర్ణించింది. పోటీ పరీక్షల్లో ఒక్కో మార్కు కూడా అభ్యర్థి జీవితాన్ని తారుమారు చేస్తుందని, అటువంటిది 14 ప్రశ్నలను ఇంగ్లిష్‌లోనే ఇచ్చారంటే అభ్యర్థులు 14 మార్కులు కోల్పోయినట్లేనని బుధవారం హైకోర్టు వ్యాఖ్యానించింది. తెలుగు మీడియంలో పరీక్ష రాసిన అభ్యర్థుల 4.62 లక్షల మంది పరిస్థితి ఏంటని, ఈ ఘోర తప్పిదాన్ని ఎలా సరి చేస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. చేసిన తప్పును ఒప్పుకుని దానిని సరిదిద్దుకోవాలే తప్ప, సమర్థించుకోవడం సరికాదని ప్రభుత్వానికి హితవు పలికింది. పంచాయతీ కార్యదర్శులుగా ఎంపికైన అభ్యర్థులకు నియామకపు పత్రాలు ఇవ్వొద్దంటూ ఇటీవల ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేసే ప్రసక్తే లేదని జస్టిస్ ఎమ్మెస్ రామచంద్రరావు తేల్చి చెప్పారు. తమకు స్పష్టత వచ్చేంత వరకు ఆ మధ్యంతర ఉత్తర్వులు యథాతథంగా కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు. ఈ 14 ప్రశ్నల విషయంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. మొత్తం 6 ప్రశ్నలకు తుది కీలో ఇచ్చిన సమాధానాలు తప్పుగా ఉన్నాయంటూ అభ్యర్థులు చెబుతున్న నేపథ్యంలో వాటి విషయంలో ప్రభుత్వ వైఖరేంటో తెలపాలంటూ.. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేశారు. నిబంధనల ప్రకారమే: సర్కారు ఇదిలా ఉంటే, పంచాయతీ కార్యదర్శుల పోస్టుల విషయంలో రిజర్వేషన్లు 50% దాటాయన్న వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో, సర్వీస్ సబార్డినేట్ రూల్స్ ప్రకారం 100 పాయింట్ రోస్టర్‌ను, ఆ రూల్స్‌లోని 22వ నిబంధనను, అలాగే జీవో 107 ప్రకారం నడుచుకుంటామని ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. అదే విధంగా స్పోర్ట్స్ కోటా కింద అర్హుల జాబితా తయారీ విషయంలోనూ తప్పు జరిగిందని, దానిని సరిదిద్దుకుంటామని వివరించింది. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీ పారదర్శకంగా జరగడం లేదంటూ పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ రామచంద్రరావు, తదుపరి ఉత్తర్వులు వెలువరించేంత వరకు పంచాయతీ కార్యదర్శులుగా ఎంపికైన అభ్యర్థులకు నియామకపు పత్రాలు ఇవ్వొద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ వ్యాజ్యాలు బుధవారం మరోసారి విచారణకు వచ్చాయి. ఇదే సమయంలో తుది కీలో పలు తప్పులున్నాయని, తెలుగు మీడియం అభ్యర్థులకు ఇంగ్లీష్‌లో ప్రశ్నలు ఇచ్చారంటూ మరికొంత మంది అభ్యర్థులు లంచ్ మోషన్ రూపంలో హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలన్నింటిపై కూడా న్యాయమూర్తి జస్టిస్ రామచంద్రరావు విచారణ జరిపారు. అందరికీ కోర్టుకొచ్చేంత స్తోమత ఉంటుందా? నలుగురైదుగురి కోసం మొత్తం నియామక ప్రక్రియను ఆపేయడం సరికాదని ఏఏజీ కోర్టుకు తెలిపారు. బయట అభ్యర్థులు న్యాయస్థానాలను నిందిస్తున్నారని చెప్పారు. కోర్టుకొచ్చిన పిటిషనర్లకు మాత్రమే మధ్యంతర ఉత్తర్వులను పరిమితం చేయాలని కోరారు. దీనికి న్యాయమూర్తి ఒకింత ఘాటుగా స్పందిస్తూ.. ‘బయటకు ఎవరు ఏమనుకుంటున్నారో మాకు అనవసరం. నియామకాలు పారదర్శకంగా జరుగుతున్నాయా? లేదా? నిబంధనలు అమలు చేస్తున్నారా? లేదా? అన్నదే మాకు ముఖ్యం. కోర్టుకు రాలేని అభ్యర్థికి సైతం కోర్టు ఆదేశాలను వర్తింప చేయవచ్చునని సుప్రీంకోర్టు చెప్పింది. అయినా ప్రతీ అభ్యర్థికి కూడా కోర్టుకు వచ్చే స్థోమత ఉండకపోవచ్చు. సుదూర ప్రాంతాల నుంచి హైకోర్టుకు వచ్చి, డబ్బిచ్చి న్యాయవాదిని పెట్టుకుని వాదనలు వినిపించే పరిస్థితి ఉండకపోవచ్చు. మరి వారి సంగతేమిటి? వారు కోర్టుకు రాలేదు కాబట్టి వారికి మేం ఇచ్చే ఉత్తర్వులు వర్తించవద్దంటే ఎలా?’ప్రశ్నించారు. తప్పు జరిగినప్పుడు దానిని సరిదిద్దుకునేందుకు ప్రయత్నించాలే తప్ప, ఆ తప్పు జరిగిన తీరును వివరిస్తూ దానిని సమర్థించుకునే ప్రయత్నం చేయరాదని హితవు పలికారు. ఈ వ్యవహారంపై సోమవారం ఉత్తర్వులు జారీ చేస్తానని స్పష్టం చేసిన న్యాయమూర్తి, పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని సర్కారుకు సూచించారు. ఇదే సమయంలో పిటిషనర్లు పలు ప్రశ్నలకు అసలు సమాధానాలను, కీలో పొందుపరిచిన తప్పుడు సమాధానాలను ఇచ్చారంటూ ఆధారాలతో చూపగా.. వీటిని న్యాయమూర్తి రికార్డ్ చేసుకున్నారు. మా దృష్టికి తీసుకురాలేదు ఈ సమయంలో అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) జె.రామచంద్రరావు జోక్యం చేసుకుంటూ, తమకు ఈ విధంగా 14 ప్రశ్నలు ఇంగ్లీష్‌లో వచ్చినట్లు తమ దృష్టికి తీసుకురాలేదని, ఇప్పుడు కోర్టుకొచ్చి రాద్దాంతం చేయడం సరికాదన్నారు. దీనికి న్యాయమూర్తి స్పందిస్తూ ‘ఇప్పుడు తీసుకొచ్చారు కదా. తప్పును సరి చేయండి’అని సూచించారు. తెలుగు మీడియంలో ఎంత మంది పరీక్ష రాశారని ప్రశ్నించిన న్యాయమూర్తి.. 4.62 లక్షల మంది రాశారని చెప్పడంతో ఆశ్చర్యపోయారు. ‘వారంతా కూడా ఈ 14 ప్రశ్నలను వదిలేసి ఉంటే మొత్తం నియామకపు ప్రక్రియ పరిస్థితే మారిపోతుంది. వీరిందరికీ కూడా 14 మార్కులు ఇవ్వాల్సి వస్తే అప్పుడు నియామకాల సంగతేంటి? ఈ మొత్తం వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయండి. నియామకపు పత్రాలు ఇవ్వొద్దంటూ గతవారం ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు యథాతథంగా కొనసాగుతాయి’అని పేర్కొన్నారు. ఇంగ్లిష్‌లో ఇస్తే.. వారికి కష్టమే కదా! ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాది ఎస్.రాహుల్ రెడ్డి వాదనలు వినిపిస్తూ, ఏ మీడియం ఎంచుకున్న అభ్యర్థులకు ఆ మీడియంలో ప్రశ్నాపత్రం ఇవ్వాలని, తెలుగు మీడియం అభ్యర్థులకు ఇంగ్లీష్, దాని కిందనే తెలుగులో కూడా ప్రశ్న ఇచ్చారని తెలిపారు. అయితే 56 నుంచి 70 ప్రశ్నల వరకు ఇంగ్లీష్‌లోనే ప్రశ్నలున్నాయని, వాటిని తెలుగులోకి అనువదించలేదని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అందుకు సంబంధించిన ప్రశ్నల కాపీలను ఆయన కోర్టు ముందుంచారు. ఈ ప్రశ్నలు చాలా సుదీర్ఘంగా ఉన్నాయని, వీటిని చదివి సమాధానం ఇచ్చే పరిస్థితిలో లేకపోవడంతో పిటిషనర్లు ఆ 14 ప్రశ్నలను వదిలేశారని వివరించారు. దీనిపై న్యాయమూర్తి విస్మయం వ్యక్తం చేస్తూ ..‘తెలుగు మీడియం అభ్యర్థులకు ఇలా 14 ప్రశ్నలను ఇంగ్లీష్‌లో ఇవ్వడం ఏంటి? ఇలా ఇస్తే అది వారికి కష్టమే కదా’అని వ్యాఖ్యానిం చారు. పోటీ పరీక్షల్లో ఒక్క మార్కు కూడా జీవితాన్ని తలకిందులు చేస్తుందని, అలాంటిది ఏకంగా 14 ప్రశ్నలంటే, అది చాలా ఘోర తప్పిదమన్నారు. -
కార్యదర్శి ఉద్యోగాల్లో సత్తాచాటిన మాజీ సర్పంచ్
జైపూర్(చెన్నూర్): జైపూర్ మండలం ఆయాగ్రామాలకు చెందిన యువతీయువకులు పంచా యతీ కార్యదర్శి ఉద్యోగాలకు ఎంపికయ్యారు. మంగళవారం అర్హత జాబితా వెల్లడించారు. జైపూర్ మండలం నుంచి ఐదుగురు ఎంపికయ్యారు. నర్వ గ్రామానికి చెందిన కోట రాం బా యి–భీమయ్యల కుమార్తె కోట శ్యామల, ముది గుంటకు చెందిన దూట శాంత–లింగయ్యల కుమారుడు దూట క్రాంతి, ఇదే ముదిగుంటకు చెందిన మాజీ సర్పంచ్ దూట కిరణ్‌కుమార్ అనే 43 వయసులో ఉద్యోగం సాధించాడు. రామారావుపేట గ్రామానికి చెందిన రౌతు రమాదేవి–మల్లేశ్ కుమార్తె రౌతు సృజన, టేకుమట్లకు చెందిన కామేర లక్ష్మిగట్టయ్య కుమార్తె కామేర స్రవంతి అర్హత సాధించారు. సత్తాచాటిన మాజీ సర్పంచ్ ముదిగుంటకు చెందిన దూట కిరణ్‌కుమార్ మాజీ సర్పంచ్ 43 ఏళ్ల వయసులో ఉద్యోగం సాధిం చి అందరికీ ఆదర్శంగా నిలిచారు. డిగ్రీ పూర్తి చేసిన ఆయన 2001–2006వరకు టీడీపీ హయాంలో సర్పంచ్‌గా పని చేశారు. అనంతరం రాజకీయాలు చేస్తూనే ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రయత్నిస్తున్నారు. పట్టుదలకు వయసు అడ్డుకాదని తాజాగా వెలువడిన పంచాయితీ కార్యదర్శి ఉద్యోగానికి ఎంపికై నిరూపించాడు. 43 ఏళ్ల వయసులో ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపిక కావడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేయడంతో పాటు అభినందనలు తెలియజేశారు. 20, 21వ తేదీల్లో సెక్రటరీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లాలో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకానికి సంబంధించిన 232 మందిని ఎంపికైనట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ వై.సురేందర్‌రావు తెలిపారు. మంగళవారం తన చాంబర్లో జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య, జిల్లా పౌరసరఫరాల సంబంధాల అధికారి వై.సంపత్‌కుమార్‌తో కలిసి ఫలితాల జాబితా విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ 232 మంది కార్యదర్శులను తాత్కాలిక ప్రాతిపదికన రోస్టర్ పాయింట్ల ఆధారంగా ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. ఈనెల 20,21వ తేదీల్లో అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుందని, జాబితాలోని హాల్‌టికెట్ల నంబర్లు గల అభ్యర్థులు పుట్టినతేదీ, కులం, విద్యార్హత పత్రాలు, పి.డబ్ల్యూ, స్పోర్ట్స్, ఎక్స్‌సర్వీస్‌మెన్ అభ్యర్థుల సంబంధిత ఒరిజినల్ ధ్రువీకరణపత్రాలతోపాటు రెండు జతల జిరాక్స్ కాపీలు గెజిటెడ్ అధికారి సంతకం చేయించి హాజరుకావాలన్నారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ఇదేమి ఎంపిక..?
సాక్షి, కొత్తగూడెం: తాజాగా విడుదల చేసిన జూనియర్ పంచాయతీ కార్యదర్శుల ఫలితాల్లో స్పష్టత అనేది లేకుండా ఫలితాలు విడుదల చేశారని పరీక్ష రాసిన పలువురు అభ్యర్థులు గగ్గోలు పెడుతున్నారు. ఫలితాల విడుదలలో ఏమాత్రం పారదర్శకత పాటించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలకు ముందు విడుదల చేయాల్సిన ఫలితాలను నిలిపివేసి ఇప్పుడు హడావిడిగా వెలువరించి ఆగమేఘాల మీద ధృవీకరణ పత్రాల పరిశీలన చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. సోమవారం రాత్రి ఫలితాలు విడుదల చేయడంతో పాటు కేవలం రెండు రోజుల వ్యవధిలోనే (ఈ నెల 20న) సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అని ప్రకటించారు. దీంతో అనేకమంది అభ్యర్థులు మంగళవారం జిల్లా పంచాయతీ కార్యాలయానికి వచ్చి ఫలితాల జాబితా చూసి అవాక్కయ్యారు. అసలు ఏ ప్రాతిపదికన తుది జాబితాను ఎంపిక చేశారని పలువురు ప్రశ్నించారు. పరీక్ష రాసిన తమకు ప్రశ్నపత్రం, ఓఎంఆర్ కార్బన్ షీట్ ఇవ్వలేదని చెబుతున్నారు. ఇక తాజాగా విడుదల చేసిన తుది ఫలితాల్లో అభ్యర్థులందరి మార్కుల జాబితా, మెరిట్, రిజర్వేషన్లు పాటించిన విధానం సక్రమంగా ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు. అసలు పంచాయతీరాజ్ కమిషన్ అఫీషియల్ వెబ్సైట్లో రాసిన అభ్యర్థులందరి మార్కుల వివరాలను పొందుపరచలేదని అంటున్నారు. పరీక్ష రాసిన అందరి మార్కుల జాబితాను వెబ్సైట్లో పెట్టిన తర్వాతే సర్టిఫికెట్లు పరిశీలించాలని డిమాండ్ చేస్తున్నారు. గత అక్టోబర్ 10న జిల్లాలోని కొత్తగూడెం, పాల్వంచ పట్టణాల్లోని 37 కేంద్రాల్లో జూనియర్ పంచాయతీ కార్యదర్శి పోస్టులకు రాత పరీక్ష నిర్వహించారు. ఫలితాలు వెంటనే విడుదల చేయాల్సి ఉన్నప్పటికీ ఎన్నికల నేపథ్యంలో నిలిపేశారు. జిల్లాలో మొత్తం 17,464 మంది దరఖాస్తు చేసుకోగా, 15,305 మంది పరీక్ష రాశారు. అందరి మార్కులు వెబ్సైట్లో పెట్టాలి పంచాయతీ కార్యదర్శి పరీక్ష రాసిన అభ్యర్థులందరి మార్కులను పంచాయతీరాజ్ కమిషనర్ అఫీషియల్ వెబ్సైట్లో పెట్టాలి. పైగా ఎలాంటి వివరాలు లేకుండా హాల్‌టికెట్ నంబర్లు మాత్రమే ఇస్తూ ఎంపిక జాబితా ప్రకటించడం సరికాదు. పరీక్ష రాసిన వారందరి మార్కులు బహిర్గతం చేస్తేనే పారదర్శకత ఉన్నట్లు. లేకుంటే అక్రమాలు జరిగినట్లే. – ధరావత్ సీతారాములు, అభ్యర్థి ఫలితాల ప్రకటనలో గందరగోళం పరీక్ష రాసిన అభ్యర్థులకు ప్రశ్నపత్రం ఇవ్వకపోవడంతో పాటు ఆన్సర్ షీట్‌కు సంబంధించిన కార్బన్ పేపర్ కూడా ఇవ్వలేదు. ఇక ఫలితాల్లో అందరి మార్కుల జాబితా, రిజర్వేషన్ల విధానం కూడా ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో అనేక అనుమానాలు కలుగుతున్నాయి. అభ్యర్థులందరి మార్కులు ప్రకటించే వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిలిపేయాలి. వెంటనే అందరి మార్కుల జాబితా విడుదల చేయాలి. – మూడ్ బాలాజీ, గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి -
పంచాయతీ పరీక్ష
సాక్షి, నల్లగొండ : పంచాయతీ సెక్రటరీ పరీక్ష ఆది వారం ప్రశాంతంగా జరిగింది. జిల్లాలో ఉన్న 133 పోస్టులకు 59,793 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. కాగా ఉదయం నిర్వహిం చిన పేపర్-1కు 41,661 మంది, మధ్యాహ్నం నిర్వహించిన పేపర్ -2 పరీక్షకు 41,503 మంది హాజరయ్యారు. మొత్తం మీద పేపర్ -1 పరీక్షను 69.93 శాతం, పేపర్ -2ను 69.67 శాతం మంది అభ్యర్థులు రాశారు. మొత్తం 8 పట్టణాల్లో ఏర్పాటు చేసిన 200 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. ఐదు రెవెన్యూ డివిజన్లతో పాటు కోదాడ, హుజూర్నగర్, చౌటుప్పల్‌లలో పరీక్ష జరిగింది. పేపర్ -1కు హాజరైన అభ్యర్థులకంటే.. పేపర్ -2 పరీక్షకు 158 మంది తక్కువ సంఖ్యలో పరీక్ష రాశారు. మొదటి పేపర్‌పై ఆశించిన మార్కులు రాకపోవచ్చన భావనతో రెండో పేపర్‌కు డుమ్మా కొట్టినట్లు తెలుస్తోంది. రెండు పేపర్లకు హాజరైన అభ్యర్థులను పరిగణనలోనికి తీసుకుంటే ప్రతి పోస్టుకు 312 మంది పోటీలో ఉన్నారు. పరీక్ష హాల్లోకి కీ? జిల్లాకేంద్రంలోని బ్రిలియంట్ గ్రామర్ స్కూల్లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రంలోకి కీ పేపర్ అందజేశారన్న పుకార్లు వెల్లువెత్తాయి. దీనిపై పలువురు విద్యార్థి సంఘం నేతలు టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రూం నంబర్ 2లో ఓ అభ్యర్థికి పేపర్-2కు సంబంధించిన కీ పేపర్ గుర్తు తెలియని వ్యక్తి అందజేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీన్ని చూసిన మిగిలిన అభ్యర్థులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే సదరు అభ్యర్థిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా వదిలేశారు. ఆ పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్, ఇన్విజిలిలేటర్, డీఓపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని ఎస్ఐని విద్యార్థి సంఘం నేతలు కోరారు. కష్టపడి చదివిన విద్యార్థులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. సదరు అభ్యర్థిపై మాల్ ప్రాక్టీస్ కింద ఎస్ఐ బాషా కేసు నమోదు చేసుకున్నారు. ఫిర్యాదు చేసిన వారిలో తెలంగాణ జాగృతి, బీడీఎస్ఎఫ్, బీజేవైఎం, టీఆర్ఎస్వీ నాయకులు భోనగిరి దేవేందర్, పందుల సైదులు, తిరందాసు సంతోష్, బొమ్మరబోయిన నాగార్జున ఉన్నారు. చదివిందంతా వృథా అయ్యింది గ్రామపంచాయతీ పరీక్ష కోసం ఆరు నెలలు కష్టపడి చదివా. సూర్యాపేట పట్టణంలోని గౌతమ్ మోడల్ స్కూల్లో సెంటర్ పడింది. దీంతో రాజాపేట మండలం బొందుగుల నుంచి ఉదయాన్నే బస్సులో వెళ్తుండగా మార్గ మధ్యలో ఆగిపోయింది. దీంతో మరో బస్సులో వచ్చాను. సూర్యాపేట కొత్తబస్టాండ్‌లో దిగి లోకల్ ఆటోలో సెంటర్ వద్దకు వెళ్లే సరికి 2 నిమిషాలు ఆలస్యమైంది. దీంతో లోనికి వెళ్లనీయలేదు. ఎంత బ్రతిమిలాడినా పట్టించుకోలేదు. ఆరు నెలల పాటు కోచింగ్ తీసుకొని కష్టపడి చదివిందంతా వృథా అయ్యింది. - మూటకోడూరు గాయత్రి