బట్లపూడి రాయుడుపేటలో శ్రీనివాసరావు నివాసముంటున్న ఇల్లు (ఇన్‌సెట్‌లో పెద్ద కుమారుడు రోషిత్‌కుమార్)
సాక్షి, అనకాపల్లి/తుమ్మపాల: పరవాడ ఫార్మాసిటీలోని విశాఖ సాల్వెంట్ కంపెనీలో జరిగిన ప్రమాదం ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. తల్లి జ్ఞాపకాల నుంచి ఆ పిల్లలు తేరుకోకముందే తండ్రి కూడా వారిని విడిచివెళ్లిపోవడంతో గుండెలవిసేలా రోదిస్తున్నారు. సోమవారం రాత్రి జరిగిన ప్రమాదంలో అనకాపల్లి మండలం బట్లపూడి పంచాయతీ రాయుడుపేటకు చెందిన కాండ్రేగుల శ్రీనివాసరావు(50) మృతి చెందడంతో అతని పిల్లలు, తల్లి శోకసంద్రంలో మునిగిపోయారు. గవరపాలెం, బట్లపూడిలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాండ్రేగుల శ్రీనివాసరావు, పార్వతి దంపతులకు ఇద్దరు కుమారులు. కొద్దిపాటి ఆదాయంతో సాగుతున్న వారి జీవితాల్లో విధి విషం చిమ్మింది. కాండ్రేగుల శ్రీనివాసరావు స్వస్థలం అనకాపల్లి పట్టణంలోని గవరపాలెం. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉండడంతో పరవాడ ఫార్మాసిటీలో విశాఖ సాల్వెంట్ కంపెనీలో కెమిస్టిగా ఐదేళ్ల కిందట చేరాడు.( నిర్వహణ లోపంతోనే అగ్ని ప్రమాదం)
కొద్ది సంవత్సరాల కిందట అనకాపల్లి మండలంలోని బట్లపూడి గ్రామానికి వెళ్లి అక్కడ ఒక పాత ఇంటిని కొనుగోలు చేసి తల్లి సన్నమ్మడుతో కలిసి నివాసముంటున్నాడు. తన ఇద్దరు పిల్లలు రోషిత్‌కుమార్, జస్వంత్ కుమార్‌లను విజయవాడలో ఓ ప్రైవేట్ కాలేజీలో చేర్పించి చదివిస్తున్నాడు. దురదృష్టవశాత్తు రెండేళ్ల కిందట శ్రీనివాసరావు భార్య పార్వతి అనారోగ్యంతో మృతి చెందింది. ఆ విషాదం నుంచి ఆ కుటుంబ ఇంకా తేరుకోలేదు. ఇంతలోనే ఫార్మాసిటీలో సోమవారం రాత్రి జరిగిన ప్రమాదం ఆ కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచేసింది. శ్రీనివాసరావు మృతిచెందిన విషయం కుటుంబ సభ్యులకు మొదట తెలియలేదు. విధుల్లో ఉన్న తమ తండ్రి క్షేమంగా ఉన్నారని భావించిన పిల్లలు తెల్లారేసరికి పిడుగులాంటి వార్త వినాల్సివచ్చింది.
ఫార్మాసిటీలో జరిగిన ప్రమాదంలో భవన శిథిలాల కింద శ్రీనివాసరావు మృతదేహం బయటపడడంతో ఇద్దరు కుమారులు, మృతుని తల్లి గుండెలవిసేలా రోదించారు. శ్రీనివాసరావు స్వస్థలమైన గవరపాలెం, అటు నివాసముంటున్న బట్లపూడి రాయుడుపేట లో విషాదఛాయలు అలుముకున్నాయి. శ్రీనివాసరావుతో పరిచయం ఉన్నవారంతా తీవ్రమైన ఆవేదనకు గురయ్యారు. శ్రీనివాసరావు కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలని అందరూ విజ్ఞప్తి చేశారు. కాండ్రేగుల శ్రీనివాసరావు కటుంబానికి పరిహారం అందజేయాలని వైఎస్సార్‌సీపీ అనకాపల్లి పార్లమెంట్ పరిశీకుడు దాడి రత్నాకర్ కోరారు. శ్రీనివాసరావు మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఫార్మా కంపెనీలను తనిఖీ చేయడానికి కమిటీ వేసి ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదిక అందజేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment