
'విభేదాలు సృష్టించి.. హీరో కావాలని చూస్తున్నారు'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి పార్ధసారథి మండిపడ్డారు. మంత్రుల్లో విభేదాలు సృష్టించి చంద్రబాబు హీరో కావాలని చూస్తున్నారని పార్ధసారథి విమర్శించారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీ సర్కార్ అన్ని చోట్ల విఫమైందన్నారు. అటువంటి టీడీపీ సర్కార్ లోకి వైఎస్సార్ సీపీ సభ్యులు ఎందుకు వెళతారని పార్ధసారథి ప్రశ్నించారు.
వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్షనేతగా సమర్ధవంతంగా పనిచేస్తున్నారని ఆ పార్టీ మంత్రులే చెబుతున్న సంగతిని ఈ సందర్భంగా గుర్తు చేశారు. చంద్రబాబు ఆరు నెలల్లో సాధించినది ఏమీ లేదని ఆ పార్టీ ఎంపీలే చెబుతున్నారని ఎద్దేవా చేశారు. కేఈ లాంటి బలమైన నేతను అణదొక్కేందుకు యత్నాలు జరుగుతున్నాయన్నారు. రుణమాఫీ సక్రమంగా జరగలేదని స్పీకరే అన్నారని పార్ధసారథి తెలిపారు.