కడుపు పండితే..
ఆ ఇంట్లో ఆనందాల పంట
నెలలు నిండుతుంటే..
కలల లోకంలో విహారం
వెన్ను విరిగే బరువు.. ఆమెకు గాలి పిందె
కడుపున బిడ్డ కదిలితే..
ఆ కళ్లలో ముసిముసి నవ్వు
తొలుచూరు కాన్పయితే.. ఇక పండగే
పుట్టినిల్లు.. మెట్టినిల్లు ఒక్కటయ్యే వేడుక
ఆ సంబరం.. విషాదమైతే!
బిడ్డ కడుపులోనే కన్నుమూస్తే..
వదిలించుకుంటారా
ఆ పసిగుడ్డు భారమవుతుందా?
పుట్టుక సంబరమైతే..
‘చావు’ను సాగనంపలేరా..
తొమ్మిది నెలల కల..
మానవత్వం చూపించదేలా..
ఒక్క క్షణం.. ఆలోచించండి.
ఆ ప్రేమ అజరామరం.. ఎందుకీ శాపం!
అనంతపురం: మృత శిశువు ఆ తల్లిదండ్రులకు భారమైంది. పేగు బంధం మరిచి చెత్తకుప్పలో పడేశారు. చిన్నపాటి కవర్‌లో చుట్టి వదిలించుకున్నారు. వీధి కుక్కలు సగభాగం తినేయగా.. మానవత్వం మౌనంగా రోదించింది. ఈ ఘటన శుక్రవారం నగరంలోని మారుతీనగర్‌లో చోటు చేసుకుంది. ఈ ప్రాంతంలోని మున్సిపల్ చెత్తకుప్ప వద్ద శుక్రవారం ఉదయం కొన్ని కుక్కలు ఓ కవర్‌లోని మాంసం ముద్ద చుట్టూ గుమికూడి ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. అప్పుడే పుట్టిన.. రక్తపు మరకలు కూడా ఆరని మృత శిశువును చూసి నివ్వెరపోయారు.
వెంటనే కుక్కలను పక్కకు తోలి.. పోలీసు, మున్సిపల్ అధికారులకు సమాచారం చేరవేశారు. ఈ కాలనీలో ఆసుపత్రులు లేకపోవడంతో.. మృత శిశువును తీసుకొచ్చి ఇక్కడ పడేసినట్లుగా అనుమానిస్తున్నారు. అయితే.. కడుపులోనే చనిపోయినా, మృత శిశువు జన్మించినా.. ఖననం చేయడం కనీస ధర్మం. అలాంటిది.. కర్కశంగా చెత్తకుప్పలో పడేసి వెళ్లిన తీరుతో సభ్య సమాజం మౌనంగా రోదించింది.
చివరకు మున్సిపల్ అధికారులు ఆ మృత శిశువును స్వాధీనం చేసుకుని ‘చివరి’ మజిలీ పూర్తి చేశారు. ఇదిలాఉంటే.. తరచూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నా వైద్య, ఆరోగ్య శాఖ.. పోలీసు అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది. కనీసం ప్రయివేట్ ఆసుపత్రులైనా సామాజిక బాధ్యతగా మృత శిశువుల ఖననానికి ముందుకు రాకపోవడం పట్ల సభ్య సమాజం తలదించుకుంటోంది.
కలంకం!
Published Sat, Aug 12 2017 6:11 AM | Last Updated on Fri, Jun 1 2018 8:36 PM
Advertisement
Advertisement