సాక్షి, కనగానపల్లి: తన సెంటిమెంట్ గ్రామమైన ముత్తువకుంట్లలో కుమారుడు శ్రీరామ్‌తో కలిసి ఎన్నికల ప్రచారం ప్రారంభించిన మంత్రి పరిటాల సునీతకు ఆరంభంలోనే చుక్కెదురైంది. ఆమె తన ఎన్నికల ప్రచారాన్ని ప్రతిసారీ కనగానపల్లె మండలంలోని ఈ గ్రామం నుంచే ప్రారంభిస్తారు. అదే విధంగా ఈసారి కూడా బుధవారం అక్కడి నుంచే ప్రచారం ప్రారంభించేందుకు ఆ గ్రామంలోని ఎస్సీ కాలనీకి వెళ్లారు. అక్కడ రోడ్డుపైన ఉన్న కాలనీవాసులు కొందరు ఆమె వద్దకు వెళ్లి తాము తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నా మీరు, మీ నాయకులు ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు.
ఇన్ని రోజులూ తమ సమస్యలు పట్టించుకోకుండా ఓట్ల సమయంలో వస్తే ఎలా మద్దతు ఇస్తామని ఆ కాలనీకి చెందిన ఎస్సీ సెల్ నాయకులు, పలువురు మహిళలు ప్రశ్నించారు. అంతేకాకుండా అక్కడ దాదాపు అన్ని ఇళ్లకూ వైఎస్సార్‌సీపీ జెండాలు కనిపించడంతో కంగుతిన్న టీడీపీ నాయకులు ఆ కాలనీలోకే కూడా వెళ్లకుండా పక్క గ్రామానికి వెళ్లిపోయారు.
అనంతరం కాలనీవాసులు పెద్దన్న, సూరప్ప, కుళ్లాయప్ప, ముత్యాలు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంలో తమకు ఏ విధంగానూ న్యాయం జరగటం లేదన్నారు. గ్రామంలో మూడు బోర్లున్నా స్థానిక టీడీపీ నాయకులు తాగటానికి కూడా నీరు వదలడం లేదన్నారు. దీంతో తాము ఆ పార్టీకి దూరంగా ఉంటూ వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి మద్దతు తెలపాలని అనుకుంటున్నామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment