ఉయ్యూరు (పెనమలూరు) : టీడీపీ జుగుప్సాకర రాజకీయాలు చేయడం నీచాతి నీచమని వైఎస్సార్ సీపీ మచిలీపట్నం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఉయ్యూరు మండలంలోని చినఓగిరాల గ్రామానికి చెందిన దాసరి నాగ శ్రావణి ఓ కార్పొరేట్ పాఠశాల భవనంపై నుంచి పడి మృతి చెందడం, పార్థసారథి బాధిత కుటుంబానికి అండగా నిలిచి ఆ యాజమాన్యంతో మాట్లాడి రూ.8 లక్షలు నష్ట పరిహారం, విద్యార్థిని తల్లికి ఉద్యోగానికి ఒప్పించి వివాదాన్ని పరిష్కరించారు.
ఈ ఘటనను జీర్ణించుకోలేని టీడీపీ శ్రేణులు రెండు రోజుల క్రితం ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ను కలిసి ఆ పాఠశాల యాజమాన్యంపై ఒత్తిడి చేయించి మొదట అంగీకరించిన రూ.4 లక్షలు, ఉద్యోగం మాత్రమే ఇస్తామని చెప్పించడంతో బాధితులు పార్థసారథిని కలిసి తమ గోడును వినిపించారు. ఈ విషయంలో యాజమాన్యం కూడా మొదటి ఒప్పందాన్నే చేస్తామని మాట మార్చడంతో ఇచ్చిన మాట ప్రకారం మిగిలిన రూ.4 లక్షలను పార్థసారథి సోమవారం గ్రామంలోని ఎస్సీ కాలనీలో బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఆ మేరకు తన సొంత డబ్బును ప్రజలందరి సమక్షంలో అందజేశారు.
అధికార మదంతో బెదిరిస్తారా?..
ఆపదలో ఉన్న కుటుంబ సభ్యులను ఆదుకునేందుకు చర్యలు తీసుకోకుండా ఎక్కడ పార్థసారథికి పేరు వస్తుందో అనే దుగ్దతో అధికార మదంతో పాఠశాల యాజమాన్యాన్ని బెదిరిస్తారా.. అని పార్థసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. విద్యార్థిని మృతి విషయం తెలుసుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లానన్నారు. ఆ సమయంలో దళిత సంఘాలు, బాధిత కుటుంబ సభ్యులు రూ.20 లక్షలు పరిహారం కావాలని, ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగాయని చెప్పారు.
న్యాయం కావాలా, కేసు కావాలా.. అని అడిగితే న్యాయమే చేయాలని బాధితులు కోరితేనే చైతన్య యాజమాన్యంతో మాట్లాడానని చెప్పారు. అందరి సమక్షంలోనే మాట్లాడి ఒప్పందాన్ని చెప్పానన్నారు. పేదలకు న్యాయం జరిగిందని భావించకుండా ఎమ్మెల్యే ఆ యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చి కేసులు పెడతామని బెదిరించి నష్టం చేయాలని చూశారన్నారు. ఎవరితో మాట్లాడావో కాల్ లిస్ట్ పెట్టాలంటూ సోషల్ మీడియాలో పోస్టు చేయించడం సిగ్గు చేటన్నారు. ఎమ్మెల్యే ఎవరితో మాట్లాడాడు, ఏం మాట్లాడాడు, ఏమని బెదిరించాడో ముందు చెబితే తానెవరితో మాట్లాడింది.., తన కాల్ లిస్ట్‌ను చూపుతానన్నారు. ఒకవేళ ఏమైనా అనుమానం ఉంటే అధికారంలో ఉన్నాడు కాబట్టి ఎంక్వైరీ వేయించుకుని తెప్పించుకోవచ్చని సవాల్ విసిరారు.
చలసాని పండు ఇలా దిగజారలేదు..
గతంలో నియోజకవర్గంలో టీడీపీ నేతలెవ్వరూ నీచంగా దిగజారుడు రాజకీయాలు చేయలేదని పార్థసారథి గుర్తు చేశారు. ‘నేను రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా చేశా. నాపై రెండు సార్లు పోటీ చేసిన పండు ఇప్పుడున్న ఎమ్మెల్యే కంటే బలమైన వ్యక్తి. కానీ మేం ఏ రోజూ దిగజారి రాజకీయాలు చేయలేదు. హుందాతనంగానే నడుచుకుని సద్విమర్శలు చేసుకున్నాం. పేదల విషయంలో న్యాయబద్ధంగానే వ్యవహరించాం. ఎమ్మెల్యేగా గెలిచాక బోడె పూర్తిగా చండాలపు రాజకీయాలు చేస్తున్నారు.
ఇది మంచి సంప్రదాయం కాదు. గ్రామీణ వాతావరణాన్ని చెడగొట్టడమే అవుతుంది.’ అని అన్నారు. ‘దాన కర్ణుడినని చెప్పుకునే బోడె.. నేను సాయం చేయడంలో జాప్యం ఉంటే.. డబ్బులు ఇవ్వమని డిమాండ్ చేయడంలో తప్పులేదు. లేదా టీడీపీలో ఉన్న వారంతా అపర కోటీశ్వరులే కదా.. బాధిత కుటుంబానికి ఉదార స్వభావంతో సాయం చేయవచ్చు కదా’’ అని పార్థసారథి ప్రశ్నించారు. ఎవరిని బెదిరించారో, కాల్ లిస్టులేంటో అంతా త్వరలోనే బయటపెడతానన్నారు. కార్యక్రమంలో పార్టీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల చంద్రశేఖర్ (బుడ్డి), ఉయ్యూరు, పెనమలూరు మండలాల అధ్యక్షులు దాసే రవి, కిలారు శ్రీనివాసరావు, మండల ప్రధాన కార్యదర్శి గారపాటి నాని, నాయకులు దోనేపూడి సాంబయ్య, మంచికంటి నాగేశ్వరరావు, మత్తే భాను, గన్నే ధనుంజయ, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment