సాక్షి, అనంత పురం : సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం ఆర్టీసీ కార్మికులు నిరవధిక సమ్మెలోకి వెళ్లడంతో ప్రగతి చక్రం ముందుకు కదలలేదు. 53 రోజులుగా ఆర్టీసీ బస్సులు తిరగకపోవడంతో ప్రయాణికులకు అవస్థలు తప్పడం లేదు. దూరప్రాంతాలకు వెళ్లేందుకు రైళ్లను ఆశ్రయిస్తున్నారు. 50 కిలోమీటర్ల లోపు ప్రయాణం చేయాలంటే ప్రైవేటు వాహనాలపై ఆధారపడుతున్నారు. ఆర్టీసీ అనంతపురం రీజియన్‌లోని 12 డిపోల పరిధిలో 940 బస్సులు ఉండగా..880 బస్సులు మాత్రమే రోడ్డుపై తిరిగేవి. వీటిలో 151 వరకు ఎక్సెప్రెస్ సర్వీసులు, హైదరాబాద్‌కు 44, విజయవాడకు 10, బెంగళూరుకు 85, చెన్నై 8, నెల్లూరు నాలుగు బస్సు సర్వీసులు నడిపేవారు. జిల్లాలోని బస్సుల్లో ప్రతి రోజూ గరిష్టంగా 4.50 లక్షల నుంచి 5 లక్షల మంది ప్రయాణించే వారు. హైదరాబాద్ వెళ్లే వారి సంఖ్య ప్రతి రోజూ 2000 నుంచి 2500 మంది వరకు ఉంటుంది. ఆర్టీసీ వివిధ విభాగాలకు చెందిన 4,700 మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటుండటంతో అన్ని రూట్లలోనూ బస్సులు నిలిచిపోయాయి.
రోజుకు రూ.75 లక్షలు నష్టం
సమైక్యాంధ్ర ఉద్యమం ప్రారంభమైన నాటి నుంచి రోజుకు రూ.75 లక్షల చొప్పున ఇప్పటి వరకు రూ.40 కోట్ల మేర ఆర్టీసీ ఆదాయానికి గండిపడింది. సమ్మెలో ఉన్న కారణంగా ఆర్టీసీ కార్మికులకు జీతాలు అందని పరిస్థితి. అయినప్పటి వారు జీతాల కోసం కాకుండా సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నారు. అయితే ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం కావడంతో దూర ప్రాంత ప్రయాణికులు రైళ్లను ఆశ్రయిస్తున్నారు. అనంతపురం, గుంతకల్లు, గుత్తి, ధర్మవరం, హిందూపురం రైల్వే స్టేషన్లలోని టికెట్ బుకింగ్ కౌంటర్ వద్ద ముందెన్నడూ లేనంత రద్దీ కనిపిస్తోంది.
ప్రతి రోజూ హైదరాబాద్, బెంగళూరు వెళ్లే ప్రయాణికులకు రైళ్లు సరిపోకపోవడంతో ప్రైవేటు బస్సులను ఆశ్రయిస్తున్నారు. ప్రయాణికుల అవసరాన్ని గుర్తించిన ప్రైవేటు బస్సుల యాజమాన్యాలు మాములు రోజుల్లో ఉన్న టికెట్టుపై 30 శాతం పైగా అదనంగా చార్జి వసూలు చేస్తున్నాయి. ఇక జిల్లాలో 50 కిలోమీటర్లు వరకు ప్రయాణించాల్సిన వివిధ వర్గాలకు చెందిన ప్రజలు మినీ వ్యాన్లు, బస్సులను ఆశ్రయిస్తున్నారు. దీంతో వీరు కూడా అధిక చార్జీలతో అందినకాటికి దోచుకుంటున్నారు.
కదలని ప్రగతి చక్రం
Published Sun, Sep 22 2013 2:41 AM | Last Updated on Fri, Jun 1 2018 8:36 PM
Advertisement