
సాక్షి, అమరావతి: ‘‘కరోనా నేపథ్యంలో రాష్ట్రంలోని పోస్టాఫీస్‌లలో పాస్‌పోర్ట్ సేవలు తాత్కాలికంగా నిలిపివేశాం. పరిస్థితిని బట్టి ఈ సేవలను పునరుద్ధరిస్తాం. అత్యవసర పరిస్థితుల్లో పాస్‌పోర్ట్ సేవల కోసం విజయవాడ, విశాఖ, తిరుపతి, భీమవరం పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలను వినియోగించుకోవచ్చు’’ అని ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. పాస్‌పోర్ట్ జారీ, నిర్వహణతోపాటు పలు విషయాలను ఆయన శనివారం ‘సాక్షి’కి వెల్లడించారు. వివరాలు ఆయన మాటల్లోనే..
► పాస్‌పోర్ట్ సేవలు బాగా సరళతరం అయ్యాయి. చిరునామాతో ఉన్న ధ్రువపత్రాలు (ప్రభుత్వం నిర్ధారించిన ధ్రువపత్రాల జాబితాకోసం పైన పేర్కొన్న వెబ్‌సైట్ చూడొచ్చు), జనన ధ్రువీకరణకు ఎస్‌ఎస్‌సీ లేదా ప్రభుత్వం నిర్ధారించిన పత్రాలలో ఏదైనా ఒక ప్రూఫ్ ఉంటే చాలు.
► అన్ని ధ్రువపత్రాలు కరెక్ట్‌గా ఉండి పోలీస్ క్లియరెన్స్ వచ్చిన తరువాత 5–7 పనిరోజుల్లో పాస్‌పోర్ట్‌ను ఇంటికి చేరుస్తున్నాం.
► గతంలో ఏ ఊరిలో ఉంటే అక్కడే పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు చేసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడలా లేదు. మీ చిరునామా ఏపీలో ఉన్నా.. నాగపూర్ లేదా ఢిల్లీలో అయినా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక్కడ పోలీస్ వెరిఫికేషన్ పూర్తవగానే మీరున్న ప్రస్తుత చిరునామాకు పాస్‌పోర్ట్ వస్తుంది.
► పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు చేసుకునేవారు వేలాదిమంది నకిలీ వెబ్‌సైట్‌ల వలలో పడుతున్నారు. దీనివల్ల ఆర్థికంగా నష్టపోతున్నారు. విదేశాంగశాఖ ఇచ్చిన వెబ్‌సైట్ మినహా దేన్నీ నమ్మొద్దు. ఆర్డినరీ పాస్‌పోర్ట్‌కు రూ.1,500, తత్కాల్‌కు అదనంగా రూ.2,000 చెల్లించాల్సి ఉంటుంది. ఇంతకంటే ఒక్క పైసా ఎక్కువ అడుగుతున్నా అది నకిలీ వెబ్‌సైట్ అని గుర్తించండి.
► నకిలీ వెబ్‌సైట్‌లు, బ్రోకర్లను/ఏజెంట్లతో మోసపోవద్దు. కొన్ని నకిలీ అంతర్జాల చిరునామాలతో పాస్‌పోర్ట్ దరఖాస్తుదారులును మోసం చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. అందువల్ల www.passportindia. gov.inలో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. స్మార్ట్‌ఫోన్‌లో mPassport Seva యాప్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
► కరోనా నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చిన వారి చిరునామాలు పాస్‌పోర్ట్ నంబర్ ద్వారానే గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చాం. దీనివల్లే వారిని హోం క్వారంటైన్ చేయగలిగారు.
Comments
Please login to add a commentAdd a comment