కుయ్యేరు స్టేట్‌బ్యాంక్ ఎదుట ఆందోళన చేస్తున్న మహిళలు
కాజులూరు (రామచంద్రపురం): తెలుగుదేశం ప్రభుత్వం అట్టహాసంగా ప్రకటించిన పసుపు కుంకుమ పథకం చెక్కులకు సొమ్ము విడుదల కాకపోవటంతో మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుయ్యేరు భారతీయ స్టేట్‌బ్యాంక్ ఎదుట మంగళవారం పలువురు మహిళలు మాట్లాడుతూ 577 డ్వాక్రా గ్రూపులకు చెక్కులు పంపిణీ చేశారన్నారు. మొదట్లో ఈ పథకం ద్వారా డ్వాక్రా సంఘంలోని ప్రతీ మహిళకు రూ.10 వేలు చొప్పున ఇస్తామని నాయకులు ప్రకటించారన్నారు. తీరా సొమ్ము కోసం వెళితే ఇప్పుడు రూ.2,500, ఎన్నికల తర్వాత మిగిలిన సొమ్ములు ఇస్తామని అధికారులు రూ 2,500 చొప్పున చెక్కులు చేతిలో పెట్టారన్నారు. వాటిని తీసుకుని బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నా సొమ్మలు విడుదల కావటంలేదన్నారు.
ఎప్పుడు వచ్చినా నగదు లేదు రేపు రండి అని బ్యాంకువారు వెనక్కి పంపుతున్నారని, దీంతో రోజు విడిచి రోజు ఇప్పటికి మూడుసార్లు బ్యాంకుకు వచ్చామన్నారు. నగదు లేదని చెక్కులు రద్దు చేసి సొమ్ము మీ ఖాతాలో జమ చేస్తామని బ్యాంక్‌వారు చెబుతున్నారన్నారు. గత ఎన్నికలలో రుణమాఫీ ప్రకటించిన పాలకులు ఎటూ వాటిని అమలు చెయ్యలేదని, కనీసం ఇచ్చిన ఈ పథకమైన సక్రమంగా అమలయ్యేలా చూడాలన్నారు. గ్రామానికి చెందిన సాయిరామ్, లలితాదేవి, రామాంజనేయ, అనిత, శ్రీ సత్తెమ్మ, మల్లీశ్వరి, కోదండరామ, మదర్ థెరీసా మహిళా శక్తి సంఘాలకు చెందిన డ్వాక్రా మహిళలు ఆందోళనలు వ్యక్తం చేసిన వారిలో ఉన్నారు.
బ్యాంకులో తగినంత నగదు లేదు
ఈ విషయమై కుయ్యేరు బ్యాంక్ మేనేజర్ ఎంఎస్‌ఎన్ చిత్రను వివరణ కోరగా బ్యాంకులో తగినంత నగదు లేని కారణంగా పసుపు కుంకుమ చెక్కులకు సొమ్ములు చెల్లించలేక పోతున్నామన్నారు. ఈ నెల 22 వ తేదీ నుంచి నగదు బట్వాడా చేస్తామని, డ్వాక్రా సంఘాలు అన్నీ ఒకేమారు కాకుండా దశల వారీగా వచ్చి సొమ్ము తీసుకోవాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment