సాక్షి, అమరావతి: పసుపు పార్టీ నాయకులు ‘పసుపు–కుంకుమ’లో పెద్ద మాయ చేశారు. ఎన్నికలకు ముందు వారి అధినాయకత్వం మహిళల ఓట్ల కోసం గాలం వేస్తే.. ఆ నిధులను నొక్కేయడంలో స్థానిక నాయకులు చేతివాటం ప్రదర్శించారు. యానిమేటర్లతో కుమ్మక్కై డ్వాక్రా మహిళలకు దక్కాల్సిన సొమ్మును మింగేశారు. ఇందు కోసం భారీ స్కెచ్ వేశారు. నకిలీ ఖాతాలు సృష్టించారు. సంఘాల్లో అదనంగా కొత్తవారి పేర్లను చేర్చారు. అర్హులకు అందాల్సిన మొత్తాన్ని దారి మళ్లించి.. దోపిడీకి పాల్పడ్డారు. తమ ఖాతాల్లో సొమ్ము పడలేదని సంఘ సభ్యులు డీఆర్‌డీఏకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఎందుకంటే డీఆర్‌డీఏ సిబ్బందికి కూడా ఈ అవినీతి వ్యవహారంలో భాగస్వామ్యం ఉండటమే. ఇప్పుడు దీనిపై విచారణకు అధికారులు రంగం సిద్ధం చేశారు.
ఎన్నికలకు ముందు పంపిణీ చేసిన పసుపు–కుంకుమ నిధుల్లో చేతివాటం ప్రదర్శించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో యానిమేటర్లు, జన్మభూమి కమిటీ సభ్యులు కుమ్మక్కై డ్వాక్రా సంఘాల నిధులను స్వాహా చేశారు. అప్పటి అధికార పార్టీ నాయకులు, సీసీ (కమ్యూనిటీ కో–ఆర్డినేటర్) అండ తో పలు సంఘాలకు దక్కాల్సిన నిధులను నకిలీ ఖాతాలు సృష్టించి దారి మళ్లించారు.
కొత్తగా సభ్యులను చేర్చి..
జిల్లాలో డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో మొదటి దశలో పసుపు–కుంకుమ పథకం కింద 60,903 గ్రూపులకు రూ.590.09 కోట్ల నిధులు చెల్లించారు. రెండో దశలో 67,628 గ్రూపులకు రూ.646 కోట్ల నిధులను జమ చేశారు. అయితే ఈ నిధులను టీడీపీ నేతల కనుసన్నల్లో యానిమేటర్లు నకిలీ ఖాతాల్లోకి మళ్లించడంతో పాటు కొత్త గ్రూపుల్లో అదనంగా సభ్యుల పేర్లను చేర్చి నిధుల దోపిడీకి పాల్పడ్డారు. ఉదాహరణకు ప్రత్తిపాడు నియోజకవర్గంలో కొత్తగా ఆయా గ్రూపులోకి 20 మంది సభ్యుల పేర్లు చేర్చి నిజమైన అర్హుల సొమ్మును స్వాహా చేశారు. దీనిపైన ఫిర్యాదులు రావడంతో విచారణ జరిగింది. అయితే విషయాన్ని బయటకు రాకుండా స్థానిక యానిమేటర్‌తో పాటు, విచారణ సిబ్బందితో కుమ్మకై డ్వాక్రా మహిళలకు డబ్బు చెల్లించి విషయం బయటకు పొక్కకుండా చేశారు. అయితే ప్రత్తిపాడు నియోజకవర్గంలో దాదాపు 60 మంది సభ్యులకు రావాల్సిన సొమ్మును మింగేసినట్టు ఆరోపణలొస్తున్నాయి. గురజాల, మాచర్ల నియోజకవర్గాల్లో సైతం ఇలాంటి ఘటనలు జరిగినట్టు సమాచారం.
పట్టించుకోని డీఆర్‌డీఏ సిబ్బంది..
జిల్లాలో పలు ప్రాంతాల్లో పసుపు–కుంకుమ నిధులు తమ ఖాతాల్లో జమకాలేదని ఫిర్యాదులు వచ్చినా.. డీఆర్‌డీఏ సిబ్బంది విషయం బయటకు రాకుండా స్థానిక టీడీపీ నాయకుల అండతో మేనేజ్ చేసినట్లు సమాచారం. అయితే గ్రామాల్లో పసుపు–కుంకుమ నిధులు చెల్లించిన మహిళా సంఘాల జాబితాలను పంచాయతీ కార్యాలయల వద్ద ప్రదర్శిస్తే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు పూర్తి స్థాయి విచారణ జరిపి అవినీతి పాల్పడిన యానిమేటర్, డీఆర్‌డీఏ సిబ్బంది బాగోతం బయటకు వస్తుందనే చర్చ మహిళా సంఘాల సభ్యుల్లో జోరుగా సాగుతోంది.
విచారణ జరిపితే..
గుంటూరు జిల్లా రూరల్ పరిధిలో ఉన్న 67,268 గ్రూపులకు పసుపు–కుంకుమ కింద చెల్లించిన మొత్తంపై దాదాపు 10 శాతం గ్రూపుల నిధుల విషయంలో చేతివాటం ప్రదర్శించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గుంటూరు కార్పొరేషన్‌తోపాటు, 12 మున్సిపాల్టీల్లో 24,160 సంఘాలకు జమ అయిన నిధులపైన పూర్తి స్థాయిలో విచారణ జరపాలని పలువురు డ్వాకా గ్రూపు మహిళలు విజ్ఞప్తి చేస్తున్నారు.
బాధితుల ఫిర్యాదులతో కదిలిన డొంక
గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని రైలు పేటలోని దుర్గాసాయి మహిళ మండలికి గ్రూపునకు పసుపు–కుంకుమ కింద లక్ష రూపాయలు విడుదలయ్యాయి. అయితే సాంకేతిక సమస్యలను సాకుగా చూపి యానిమేటర్ నకిలీ ఖాతాలకు మళ్లించింది. సదరు గ్రూపు సభ్యులకు నిధులు రాలేదని మాయ మాటలు చెప్పింది. అనుమానం వచ్చిన గ్రూపు సభ్యులు గోరంట్లలోని మెప్మా హెడ్ ఆఫీసుకు వెళ్లి అధికారులను నిలదీశారు. రికార్డులను పరిశీలించిన ఉన్నతాధికారులకు నిధులు జమయ్యాయని చెప్పారు.
దీంతో డ్వాక్రా గ్రూపు సభ్యులు అవాక్కయ్యారు. వెంటనే యానిమేటర్‌ను నిలదీయడంతో విషయం బయటకి చెప్పొద్దని, వారి సంఘానికి మంజూరైన లక్ష రూపాయల నిధులను వెనక్కి ఇచ్చింది. అయితే ఆ యానిమేటర్ పరిధిలోనే మూడు సంఘాల సొమ్మును సాంకేతిక కారణాలను సాకుగా చూపి నొక్కేసినట్టు సమాచారం. వాస్తవానికి యానిమేటర్లను జన్మభూమి కమిటీల సిఫారసు మేరకు నియమించడం, డీఆర్‌డీఏలో పనిచేసే సీఓ అండ ఉండటంతో గోల్‌మాల్ విషయం వెలుగులోకి రాకుండా జాగ్రత్త పడ్డారు. గతంలో ఇంతకు ముందు కూడా డ్వాక్రా మహిళల ఖాతాల్లో వేసిన నిధుల్లో సైతం అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment