కాకినాడ : తూర్పు గోదావరి జిల్లా కాకినాడ ప్రభుత్వాసుపత్రి(జీజీహెచ్)లో ఓ రోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇందుకు సంబంధించి బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కాజులూరు మండలం అయితపూడికి చెందిన అవ్వారి సతీష్(32) అనే ఆటో డ్రైవర్ మద్యానికి బానిసై అనారోగ్యానికి గురయ్యాడు. గత ఫిబ్రవరిలో జీజీహెచ్‌లో చేరగా వైద్యులు పరీక్షించి పాంక్రియూస్ వ్యాధిగ్రస్తమైనట్టు నిర్ధారించి శస్త్రచికిత్స చేశారు. సతీష్ తిరిగి అనారోగ్యం పాలు కావడంతో జూన్ 25న మళ్లీ జీజీహెచ్‌లో చేర్చగా సర్జికల్ విభాగంలోని ఎస్-1 వార్డులో ఉంచి చికిత్సనందిస్తున్నారు. అయితే శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో నిద్రలేచి బయటకు వెళుతున్న సతీష్‌ను తల్లి కుందనావతి ఎక్కడికి అని అడిగింది. కాళ్లకు నీరు పట్టినందున డాక్టర్లు అటూఇటూ నడవమన్నారని అతడు వార్డు నుంచి వెళ్లిపోయాడు. సమయం ఐదున్నర గంటలైనా రాకపోవడంతో తల్లి వార్డులో, ఆస్పత్రి ఆవరణలో వెతికినా కనబడలేదు.
దాంతో కొడుకు తరచూ కూర్చునే పీజీ డిమాన్‌స్ట్రేషన్ రూమ్‌కి వెళ్లగా తలుపు గడియ పెట్టి ఉండడంతో కిటికీలోనుంచి చూసింది. దుప్పటితో ఫ్యాన్ కొక్కేనికి ఉరేసుకుని వేలాడుతున్న కొడుకు కనిపించడంతో కలవరపడి కేకలు వేసింది. ఆస్పత్రి సిబ్బంది, రోగుల సహాయకులు వచ్చి, తలుపులు పగులగొట్టి సతీష్‌ను కిందికి దించారు. పరీక్షించిన వైద్యులు అతడు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఆరోగ్యం కుదుటపడడం లేదన్న మనస్తాపమే ఆత్మహత్యకు కారణమై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. కాగా రెండు నెలల నుంచి శస్త్రచికిత్స చేస్తామంటూనే తత్సారం చేస్తున్నారని సతీష్ బాధపడేవాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అతడికి సూడోసిస్ట్ సోకినందున శస్త్రచికిత్స కంటే మందుల ద్వారానే నయం అవుతుందని అలాగే చికిత్సనందిస్తున్నామని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పి. వెంకటబుద్ధ తెలిపారు. వన్ టౌన్ ఎస్సై రవికుమార్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని మార్చురీకి తరలించారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో రోగి ఆత్మహత్య
Published Fri, Sep 18 2015 6:56 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
Advertisement