బాలయ్యా.. రోగుల గోడు వినవయ్యా ! | Patients Suffer From Lack Of Facilities At Hindupur Government Hospital | Sakshi
Sakshi News home page

బాలయ్యా.. రోగుల గోడు వినవయ్యా !

Published Wed, Jul 24 2019 7:47 AM | Last Updated on Wed, Jul 24 2019 7:48 AM

Patients Suffer From Lack Of Facilities At Hindupur Government Hospital - Sakshi

ఓపీలో వైద్యుడి కోసం రోగుల నిరీక్షణ

సాక్షి, హిందూపురం: ‘ప్రభుత్వాస్పత్రిని కార్పొరేట్‌ స్థాయిగా తీర్చిదిద్దుతాం. ఆస్పత్రిలో సకల సౌకర్యాలు కల్పిస్తాం. వైద్యులను పూర్తిస్థాయిలో నియమించడం ద్వారా రోగులకు సకాలంలో సేవలు అందేలా చర్యలు తీసుకుంటాం.’ ఇదీ ఎమ్మెల్యే బాలకృష్ణ హిందూపురం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ప్రారంభం సందర్భంగా ఇచ్చిన హామీ. అయితే ఆస్పత్రి ప్రారంభించి ఏళ్లు గడుస్తున్నా సౌకర్యాల్లో ఎలాంటి మార్పు లేదు. ఇక ఆస్పత్రి స్థాయి పెరిగినా అందుకు అనుగుణంగా వైద్య సిబ్బందిని నియమించలేదు. దీంతో రోగులు అసౌకర్యాల నడుమ అరొకర సేవలతో అల్లాడాల్సిన దుస్థితి నెలకొంది. దీనిపై ఎమ్మెల్యే బాలకృష్ణ ఏరోజూ అసెంబ్లీలో తన వాణిని వినిపించిన దాఖలాలు లేవు. రెండోసారి ఎమ్మెల్యే అయినా ప్రభుత్వాస్పత్రి సమస్య గురించి ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. 
వేధిస్తున్న వైద్యులు, సిబ్బంది కొరత  
జిల్లా ఆసుపత్రిగా అప్‌గ్రేడ్‌ అయినా ప్రభుత్వాసుపత్రిలో ఇంకా పూర్తి స్థాయిలో వైద్యులు లేరు. వాస్తవంగా 250 పడకల ఆసుపత్రికి 146 వైద్యులు ఉండాలి. ప్రస్తుతం 31 మంది రెగ్యులర్‌ వైద్యులకు గాను కేవలం 14 మంది మాత్రమే ఉన్నారు. స్టాఫ్‌ నర్సులు 48 పోస్టులకు 9 మంది రెగ్యులర్‌గా ఉంటే 39 మంది కాంట్రాక్టు పద్దతిలో పనిచేస్తున్నారు. హెడ్‌నర్సులు 8  మందికిగాను నలుగురు మాత్రమే ఉన్నారు. ఇక ఆసుపత్రి వైద్య సేవల్లో కీలకంగా వ్యవహరించే క్లాస్‌ ఫ్లోర్‌ సిబ్బంది ఎంఎన్‌ఓ, ఎఫ్‌ఎన్‌ఓలు 15 కావాల్సి ఉండగా ముగ్గురు రెగ్యులర్, ముగ్గురు ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో పనిచేస్తున్నారు.
 
రోగులతో ప్రభుత్వాస్పత్రి కిటకిట 
ప్రభుత్వ ఆసుపత్రి రోగులతో కిటకిటలాడుతోంది. మలేరియా, టైఫాయిడ్,  విషజ్వరాలతో అధికంగా ఆసుపత్రికి తరలివస్తున్నారు. వైరల్‌ ఫీవర్స్, డెంగీ లక్షణాలతో రోజూ వందల సంఖ్యలో చిన్నారులూ చికిత్స  పొందుతున్నారు. దీంతో జనరల్‌ వార్డుల్లో మంచాలు దొరకని పరిస్థితి నెలకొంది. కొందరు మంచాలు లేక  నెలపైనే పడుకుని చికిత్స చేయించుకుంటున్నారు.  ఆస్పత్రిలో స్థలంలో లేక రోగులతోపాటు వారి వెంటవచ్చిన పర్యవేక్షులు వరండాల్లో పడుకుంటున్నారు. ఆసుపత్రి ఉదయం, సాయంత్రం రోగులతో కిక్కిరిసిపోతోంది. ఇక ఆస్పత్రిలో సౌకర్యాలు కొరవడడంతో రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. 

కిటకిటలాడుతున్న ప్రయివేట్‌ ఆసుపత్రులు.. 
జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కనీసం మంచాలు కూడా దొరకని పరిస్థితి నెలకోనడంతో ప్రజలు తప్పని పరిస్థితుల్లో ప్రయివేట్‌ ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. దీంతో ప్రయివేట్‌ ఆసుపత్రులు కూడా రోగులతో కిటకిటలాడుతున్నాయి. రూ.వందలు ఇచ్చి టోకన్లు చేతపట్టుకుని ఆసుపత్రుల బయట రోగులు గంటల తరబడి వేచి ఉంటున్నారు. చిన్నపాటి జర్వానికైనా ప్రయివేట్‌ వైద్యులు రక్త, మూత్ర పరీక్షలు దీనికి తోడు రూ.వందల మందులు, సిరప్‌లు ఇచ్చి ప్రజలు దోచుకుంటున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. జ్వరమొచ్చిందా రూ.వేయి ఖర్చు కావాల్సిందనే పరిస్థితి నెలకొన్నట్లు రోగులు వాపోతున్నారు.   

ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి : 
హిందూపురం 
రోజు వారీ ఓపీ సంఖ్య    :1200 
ఇన్‌పేషెంట్స్‌                 : 300 
పడకలు    :  250 

మంచం లేదన్నారు  
రాత్రి నుంచి కడుపునొప్పితో అల్లాడిపోయాను. ఉదయానే ఆసుపత్రికి వస్తే డాక్టర్‌ వచ్చే వరకూ వేచి ఉండాలన్నారు. డాక్టర్‌ వచ్చి పరీక్షలు చేసి ఆడ్మిట్‌ కావాలని రాసి ఇచ్చారు. కేస్‌ షీట్‌ ఇచ్చిన అడ్మిషన్‌ చేర్చుకోవాలంటే మంచాలు లేవు కిందపడుకోవాలన్నారు. ఇప్పటికే కడుపునొప్పి తట్టుకోలేకపోతున్నా. కిందపడుకుంటే భరించలేనని ప్రయివేట్‌ ఆసుపత్రికి వెళ్లడానికి బయటకు వచ్చేశాను.          – రామకృష్ణ, చీపులేటి  

ఆసుపత్రిలో సరైన వైద్యం లేదు 
జ్వరం, వాంతులతో ఆసుపత్రిలో చేరాను. రెండురోజులైంది. వాం తులు తగ్గాయి. జ్వరం ఇంకా పూర్తిగా తగ్గలేదు. మంచంపై పరుచుకోడానికి దుప్పట్లు కాని బెడ్‌షీట్లు కానీ లేవు. ఆసుపత్రిలో సిబ్బంది తక్కువగా ఉండటంతో ఉన్న వారు రోగులపై చిర్రుబుర్రులాడుతున్నారు.              –మమత, పరిగి  

సీజనల్‌ వ్యాధులు ప్రబలడంతో సమస్య   
సీజనల్‌ వ్యాధులు అధికం అవుతుండటంతో మంచాల కొరత వస్తోంది. సాధారణ సమయంలో ఈ సమస్య ఉండదు. అయినా వచ్చిన వారికి వైద్యం అందిస్తున్నాం. వైద్యసిబ్బంది సంఖ్య తక్కువగా ఉన్నా ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటున్నాం. వైద్యచికిత్స విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండదు. 
– డాక్టర్‌ కేశవులు, ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్‌   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement