శ్రావణమాసం సందర్భంగా భద్రాచలంలోని శ్రీరామచంద్రుని దేవాలయంలో నేటి నుంచి పవిత్రోత్సవాలు నిర్వహిస్తున్నట్లు దేవస్థానం ఉన్నతాధికారులు శుక్రవారం భద్రాచలంలో వెల్లడించారు.ఆ పవిత్రోత్సవాలు ఈ నెల 21తో ముగుస్తాయని తెలిపారు. పవిత్రోత్సవాలు సందర్భంగా దేవాలయంలో భక్తులకు ఏటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. అయితే ఆ సీతారామచంద్రస్వామిని దర్శించుకునేందుకు ఈ రోజు తెల్లవారుజాము నుంచే స్థానికులు, వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో భద్రాచలం తరలివచ్చారు.
అయితే కర్నూలు జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. శ్రావణమాసంలో వచ్చే రెండో శుక్రవారం కావడంతో శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జున స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. అత్యంత పర్వదినమైన ఈ రోజు భక్తుల కోసం ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహిస్తున్నట్లు ఆలయం కార్యనిర్వహాణాధికారి చంద్రశేఖర ఆజాద్ వెల్లడించారు. ఆ వ్రతాల్లో పాల్గొనే భక్తులకు పూజా సామాగ్రితోపాటు వెండి లక్ష్మీదేవి రూపు ఉచితంగా అందజేయనున్నట్లు ఈవో తెలిపారు.