మధిర, న్యూస్‌లైన్:
స్థానిక శ్రీరామ్ సిటీ గోల్డ్ ఫైనాన్స్ కార్యాలయంలో బంగారు ఆభరణాలు తాకట్టుపెట్టి రుణాలు పొందిన ఖాతాదారులకు యాజమాన్యం నగదు చెల్లింపులు చేస్తోంది. ఈ కార్యాలయంలో వందలాది మంది సన్న, చిన్నకారు రైతులు, చిరు వ్యాపారులు, ఉద్యోగులు తాక ట్టు పెట్టిన బంగారు ఆభరణాలు గత నెల 7వ తేదీ తెల్లవారుజామున చోరీకి గురైన విషయం విదితమే. నిందితుడు 425 మందికి చెందిన 8.513 కిలోల బంగారు ఆభరణాలు, కొంత నగదు చోరీ చేశారు. ఈ చోరీ జరిగి 47 రోజులు గడుస్తోంది. అయితే రుణాలు చెల్లిస్తాం.. తాకట్టుపెట్టిన తమ బంగారం తమకు ఇవ్వాలని ఖాతాదారులు గత కొద్దిరోజులుగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో ఖాతాదారుల ఒత్తిడి మేరకు శ్రీరామ్ కంపెనీ యాజమాన్యం వారి లావాదేవీలు పరిష్కరించేందుకు ముందుకు వచ్చింది. ఈక్రమంలో కంపెనీ ప్రధాన, జోనల్ కార్యాలయాల ఉన్నత ఉద్యోగుల ఆదేశాలమేరకు మధిర పట్టణంలోని కార్యాలయ మేనేజర్ రమేష్ ఆధ్వర్యంలో ఖాతాదారుల లావాదేవీలను పరిశీలిస్తున్నారు.
నష్టపోతున్న ఖాతాదారులు :
చోరీ సంఘటనలో బంగారు ఆభరణాలు కోల్పోయిన ఖాతాదారులకు శ్రీరామ్ కంపెనీ ఒక్కో గ్రాము బంగారానికి రూ.2,750చొప్పున చెల్లించేందుకు ముందుకు వచ్చింది. 20 గ్రాములు బంగారం తాకట్టుపెట్టిన ఖాతాదారులకు రూ.2,750చొప్పున రూ.55వేలు చెల్లిస్తోంది. అయితే ఈ డబ్బులతో తిరిగి అదే ఆభరణాన్ని తయారు చేయించాలంటే మరో 2 గ్రాములు తరుగుకింద అదనంగా చేతి నుంచి పడే అవకాశం ఉంది.
దీంతో అదే ఆభరణం తయారు చేయించాలంటే రూ.55వేలకు అదనంగా రూ.5,500 ఖాతాదారుడు భరించాల్సి వస్తుంది. చోరీకి గురైన 425మంది ఖాతాదారులకు చెందిన 8.513కిలోల బంగారు ఆభరణాలను తయారు చేయించాలంటే అదనంగా 85.13 గ్రాముల బంగారం పడుతుంది. దీనికిగాను రూ.2.34లక్షలకుపైగా ఖర్చవుతుంది. తీసుకున్న రుణానికి వడ్డీతోసహా చెల్లిస్తుంటే ఈ నష్టాన్ని ఎవరు భరిస్తారని ఖాతాదారులు ప్రశ్నిస్తున్నారు.
నేటి వరకు వడ్డీ వసూలు..
ఖరీఫ్ సీజన్‌లో రైతులు వారి బంగారు ఆభరణాలు తాకట్టుపెట్టి రుణాలు తీసుకున్నారు. ఈ క్రమంలో నెల రోజులుగా డబ్బులు తీసుకుని కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా యాజమాన్యం పట్టించుకోలేదు. తీరా ఇప్పుడు నగదు చెల్లించేందుకు ముందుకు వచ్చారు. కానీ నేటి వరకు వడ్డీ లెక్కకట్టి వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం మధిర మండలంలోని వంగవీడు గ్రామానికి చెందిన రైతులు రుణాలు చెల్లించేందుకు రాగా నేటి వరకు వడ్డీ లెక్కించి చెల్లించాలని సూచించారు. నెల రోజులుగా చెల్లిస్తామని తిరుగుతున్నా తీసుకోకుండా ఇప్పుడు అదనపు వడ్డీ వసూలు చేస్తున్నారని గుగులోతు శ్రీను, భూక్యా భద్రు, ధరావత్ ఫణి, గుగులోతు సోమ్లా తదితరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నష్టాన్ని ఎందుకు భరించాలి ..
200 గ్రాముల బంగారం తాకట్టుపెట్టి రూ. 4 లక్షల రుణం తీసుకున్నా. ఆభరణాలు చోరీకి గురికావడంతో తీసుకున్న అప్పుపోను బంగారానికి వెలకట్టి మిగిలిన డబ్బులు ఇస్తున్నారు. అయితే ఆభరణాలు చేయించాలంటే అదనంగా 20 గ్రాముల బంగారాన్ని కొనాల్సి ఉంటుంది. దీనికిగాను రూ.55వేలు అదనపుభారం పడుతుంది. ఈ నష్టాన్ని నేనెందుకు భరించాలి.
- వేమిరెడ్డి సత్యనారాయణరెడ్డి, వంగవీడు
మా ఆభరణాలు మాకివ్వాలి..
పత్తికి పెట్టుబడి పెట్టేందుకు నా చెల్లెలి మెడలో ఉన్న బంగారపు పుస్తెలతాడును, ఉంగరాన్ని తాకట్టుపెట్టి అప్పు తీసుకున్నా. అయితే ఆభరణాలు నా చెల్లెలికి తిరిగి ఇవ్వాలంటే రూ.10వేలు అప్పుచేసి చేయించాల్సి ఉంటుంది. అసలే పత్తి పంటపోయి నష్టాలు వచ్చాయి. నిరుపేద రైతు కుటుంబానికి చెందిన మాపై భారాన్ని మోపడం సమంజసంకాదు. - దరావత్ లాలు, వంగవీడు
ఖాతాదారులకు ‘శ్రీరామ్’ చెల్లింపులు
Published Wed, Dec 25 2013 4:50 AM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM
Advertisement