మెజారిటీ ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా విభజన: కేశవ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బిల్లును చూస్తుంటే తమ సమాధులకు తమనే రాళ్లను పేర్చుకొమ్మని చెప్పినట్టుగా ఉం దని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఆవేదన వెలిబుచ్చారు. గతంలో రాష్ట్రాల విభజన సమయంలో అనుసరించిన పద్ధతులకు, సంప్రదాయాలకు విరుద్ధంగా, రాష్ట్రంలో మెజారిటీ ప్రజల అభిప్రాయాలకు భిన్నంగా ఉన్నందున బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. బిల్లుపై సోమవారం ఆయన శాసనసభలో సుదీర్ఘంగా మాట్లాడారు. ‘‘తెలంగాణలో జరిగిన ఉద్యమాలు పెత్తందార్లకు, భూస్వాములకు, నాటి పాలకులకు వ్యతిరేకంగా జరిగినవే. అవి తెలంగాణ ఉద్యమం కాదు. తెలంగాణ పోరాట యోధులు ప్రజల కోసం సొంత ఆస్తులు ధార పోస్తే, ఇప్పుడు ఉద్యమం పేర కొందరు ఆస్తులు కూడగట్టుకుంటున్నారు’’ అన్నారు.
పయ్యావులవన్నీ అబద్ధాలే: ఎర్రబెల్లి
పయ్యావుల అసెంబ్లీలో చెప్పినవన్నీ అబద్ధాలని ఆ పార్టీ నేత ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. ‘ఇన్నేళ్లుగా దోచుకున్నది సరిపోదా? మీ పెత్తనం, రాజ్యాధికారం వద్దు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అడ్డుపడొద్దు’ అని సోమవారం సభలో కేశవ్ మాట్లాడిన అనంతరం ఎర్రబెల్లి స్పందించారు. అంతగా అభివృద్ధి చేయాలనుకుంటే కర్నూలు రాజధానిగా చేసుకుని అభివృద్ధి చేసుకోండని సలహా ఇచ్చారు.
ఎందుకీ రెండు నాల్కల ధోరణి: హరీశ్
పదవుల కోసం తెలంగాణ కోరడం లేదని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు స్పష్టం చేశారు. అనంతపురం, కర్నూలు జిల్లాలకు చెందిన పలు గ్రామాల వారు తమను తెలంగాణలో చేర్చాలంటూ లేఖలిచ్చారన్నారు. తెలంగాణతో ఉండడానికి అభ్యంతరం లేదని, విభజన వద్దనడం 2 నాల్కల ధోరణి కాదా అని పయ్యావులను ప్రశ్నించారు.
సాయుధ పోరుతో సంబంధం లేదు
తెలంగాణ సాయుధ పోరాటానికి, ప్రస్తుత తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేదని వామపక్ష పార్టీల సభ్యులు జూలకంటి రంగారెడ్డి, కే. సాంబశివరావు అన్నారు. సాయుధపోరాటం చేసిన వారి స్మృతి చిహ్నం ఒక్కటీ లేదన్న పయ్యావుల వ్యాఖ్యను తప్పుబట్టారు.
కొత్త సంప్రదాయం వద్దు: గండ్ర
సభలో పయ్యావుల కేశవ్ మాట్లాడిన తరువాత.. టీడీపీ సీమాంధ్ర ఎమ్మెల్యేలంతా స్పీకర్‌కు అఫిడవిట్లు ఇవ్వడానికి వరుస కట్టారు. అయితే, వాటిని స్పీకర్ సూచన మేరకు కార్యదర్శికి అప్పగించారు. ‘‘శాసనసభలో అఫిడవిట్లు ఇవ్వడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. వాటిని వెంటనే వెనక్కి ఇచ్చేయండి. ఈ అసెంబ్లీలో కొత్త సంప్రదాయాలు తీసుకుని రావద్దు’’ అని చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన స్పీకర్.. ఈ అంశాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకుంటానని పేర్కొన్నారు.
వారిని బర్తరఫ్ చేయాలి: దామోదర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రపతి పంపించిన బిల్లును రాజ్యాంగ వ్యతిరేకం అంటూ శాసనసభలో మాట్లాడిన మంత్రులు శైలజానాథ్, వసంతకుమార్‌లను బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే దామోదర్‌రెడ్డి డిమాండ్ చేశారు. సీఎం వారిద్దరిని బర్తరఫ్ చేయాల్సిందని అభిప్రాయపడ్డారు. వారింకా మంత్రులుగా ఎలా కొనసాగుతారని ప్రశ్నించారు.
అది సభ్యుల అభిప్రాయమే: రఘువీరా
బిల్లుపై మాట్లాడిన మంత్రులు సభలో సభ్యులుగా మాట్లాడారే తప్ప.. ప్రభుత్వం తరఫునకానీ, మంత్రులుగాకానీ మాట్లాడలేదని రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి వివరణ ఇచ్చారు. రాష్ట్రపతిని అగౌరవపరిచే ఉద్దేశం ఎవరికీ లేదన్నారు.