సభలో విగ్రహావేశాలు | TRS Leader KTR Controversial Speech in Assembly | Sakshi
Sakshi News home page

సభలో విగ్రహావేశాలు

Published Wed, Jan 22 2014 3:41 AM | Last Updated on Thu, Jul 11 2019 7:38 PM

సభలో విగ్రహావేశాలు - Sakshi

సభలో విగ్రహావేశాలు

మట్టిబొమ్మలు పగిలితే ట్యాంక్‌బండ్‌కు వెళ్లి రోదించారన్న కేటీఆర్
వెయ్యి మంది విద్యార్థులు మరణిస్తే కన్నీటి బొట్టు రాల్చరంటూ ధ్వజం
మట్టిబొమ్మలు కావవి.. జాతి నేతల చిహ్నాలు: ధూళిపాళ్ల, వంగా గీత
కేటీఆర్ క్షమాపణలు చెప్పాల్సిందే: శైలజానాథ్, టీ టీడీపీ సభ్యులు

 
సాక్షి, హైదరాబాద్: ట్యాంక్‌బండ్‌పై ఉన్న ప్రముఖుల విగ్రహాల కూల్చివేతపై టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు చేసిన వ్యాఖ్యలు మంగళవారం శాసనసభలో దుమారం రేపాయి. టీఆర్‌ఎస్, టీడీపీ సభ్యుల మధ్య ఆవేశకావేశాలకు దారి తీశాయి. సభ్యులు చరిత్ర తవ్వుకుంటూ మాటల యుద్ధానికి దిగారు. కేటీఆర్ క్షమాపణ చెప్పాల్సిందేనంటూ సీమాంధ్ర టీడీపీ సభ్యులతో పాటు, అధికార పక్షానికి చెందిన కొందరు సభ్యులు సభను అడ్డుకున్నారు. వెన్నుపోట్లకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆద్యుడని కేటీఆర్ ఎద్దేవా చేస్తే, ఎన్టీఆర్‌ను గద్దె దించడానికి అందరితో సంతకాలు చేయించింది టీఆర్‌ఎస్ అధినేత కేసీఆరేనని టీడీపీ సభ్యుడు ఎర్రబెల్లి దయాకర్‌రావు విమర్శించారు.
 
  తెలంగాణ బిల్లుపై చర్చలో కేటీఆర్ మాట్లాడుతూ ‘ట్యాంక్‌బండ్‌పై ఉన్న నాలుగు మట్టి బొమ్మలు పగిలిపోతే రాద్ధాంతం చేస్తూ రోదించారు. అక్కడకు వెళ్లి కన్నీరు పెట్టుకున్నారు. కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం వెయ్యి మంది మరణిస్తే కన్నీరు కూడా పెట్టలేదు. అలాంటి వారు అన్నదమ్ముల్లా కలిసుందామని ఎలా అంటారు?’ అని వ్యాఖ్యానించారు. దాంతో సభలో దుమారం రేగింది. కేటీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే వంగా గీత అభ్యంతరం వ్యక్తం చేస్తూ పోడియం వద్దకు వెళ్లారు. టీడీపీ సభ్యులు కూడా పోడియంలోకి వెళ్లి, కేటీఆర్ క్షమాపణ చెప్పాలంటూ నినాదాలు చేశారు. కానీ కేటీఆర్ మాత్రం, ‘క్షమాపణలు చెప్పను. వంద శాతం ఇలాగే అంటాను. నాలుగు మట్టిబొమ్మలు కూలితే ఇంత రోదిస్తారా?’ అని మరోసారి అనడంతో గొడవ రెట్టింపయింది. దాంతో సభను డిప్యూటీ స్పీకర్ భట్టి విక్రమార్క ఐదు నిమిషాలు వాయిదా వేశారు.
 
 తిరిగి ప్రారంభమయ్యాక కూడా సభలో అదే ఆందోళన కొనసాగింది. ఏ మహనీయులకు తాము వ్యతిరేకం కాదని టీఆర్‌ఎస్ పక్ష నాయకుడు ఈటెల రాజేందర్ అన్నారు. ‘‘పెట్రోల్ మంటల్లో కాలిపోతూ కూడా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలంటూ నినాదాలు చేస్తూ మరీ యువకులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అలాంటి ఆత్మహత్యలు వద్దంటూ తీర్మానం, విజ్ఞప్తి చేద్దామని, తద్వారా యువకులకు భరోసా కల్పిద్దామని కోరినా ఎవరూ కలసి రాలేదు. కడుపు మంటతో చేసే పనులు సాధారణంగా జరుగుతుంటాయి. మీ ఉద్యమంలో కూడా జాతీయ నాయకుల విగ్రహాలను ధ్వంసం చేశారు. ట్యాంక్‌బండ్‌పై కొమరం భీమ్, బందగి, చాకలి ఐలమ్మ విగ్రహాలు ఎందుకు పెట్టలేదు? పదవులు మాకు గడ్డిపోచ కింద లెక్క’’ అన్నారు.
 
 మట్టిబొమ్మలు కావవి: ధూళిపాళ్ల
 టీడీపీ సభ్యుడు ధూళిపాళ్ల నరేంద్ర కల్పించుకుని, అవి మట్టిబొమ్మలు కావని, జాతి నాయకులకు, సంస్కృతీ, సంప్రదాయాలకు చిహ్నాలని అన్నారు. ‘‘ఆ విగ్రహాలు పెట్టడానికి వేసిన కమిటీలో ప్రముఖ కవి డాక్టర్ సి.నారాయణరెడ్డితో పాటు కేసీఆర్ కూడా సభ్యుడు. ఇలాంటి అహంకారపూరిత వ్యాఖ్యలు మీ నైజానికి గుర్తు. క్షమాపణ చెప్పే సంస్కారం కూడా లేదా?’ అంటూ మండిపడ్డారు. కేటీఆర్ బదులిస్తూ, ‘బతికున్న వారికి సమాధి కట్టే సంస్కృతి మీది. శాంతియుత ఉద్యమాన్ని కర్కశంగా అణిచివేస్తేనే అలాంటి ప్రతిక్రియ జరిగింది. ఎన్టీఆర్‌పై చెప్పులేయించిన దుర్మార్గులు మీరు. క్షమాపణ చెప్పాలని మీ నాయకునికి సూచించండి.
 
 మీ దగ్గర సంస్కారం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. తెలంగాణకు అనుకూలమని మీ టీడీపీ మేనిఫెస్టోలో అన్నారు. ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారు. సిగ్గుంటే రాజీనామా చేసి మాట్లాడండి. మందబలంతో నోరు నొక్కేస్తే ఎవరూ ఊరుకోరు’’ అన్నారు. గాంధీని చంపిన గాడ్సే కంటే కూడా చంద్రబాబు నీచుడని ఎన్టీఆరే అన్నారని గుర్తు చేశారు. దాంతో మరోసారి టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. ‘అహంకార వైఖరి నశించాలి’, ‘అహంకార వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి’, ‘క్షమాపణ చెప్పాలి’ అంటూ నినాదాలు చేశారు.
 
 విడిపోవడానికే ఏకాభిప్రాయమా: కేటీఆర్
 రాష్ర్టం విడిపోవడానికి కావాల్సిన  ఏకాభిప్రాయం, కలిసుండటానికి మాత్రం అవసరం లేదా అని కేటీఆర్ ప్రశ్నించారు. విభజన బిల్లుపై మంగళవారం అసెంబ్లీలో మాట్లాడిన ఆయన, ఏకాభిప్రాయంతోనే విభజన జరగాలనడం సరికాదన్నారు. ‘‘కుట్రలు, కుతంత్రాలతోనే నాడు ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. రెడీమేడ్‌గా ఉన్న హైదరాబాద్ రాజధాని కోసమే సీమాంధ్ర వారు అప్పుడు కలసిపోయారు. తెలంగాణ మట్టిలోనే తిరుగుబాటు స్వభావముంది. నిజాం నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడారు. ఇప్పుడు తెలంగాణ కోసం పోరాడుతున్నారు. తెలంగాణ ఉద్యమానికి రక్షణగా టీఆర్‌ఎస్ నిలబడింది.  ఈ బిల్లు ఎవరి దయాదాక్షిణ్యాలతోనూ రాలేదు. మెడలు వంచి తెలంగాణను సాధించుకుంటున్నాం’’ అన్నారు. రాష్ట్రం కోసం పదవిని త్యాగం చేసిన బూర్గుల రామకృష్ణారావు చనిపోతే ఆయన అంత్యక్రియలను కనీసం అధికార లాంఛనాలతో నిర్వహించలేదంటూ ఆక్షేపించారు. పీవీ నరసింహారావును రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏడాది కూడా పని చేయకుండా చేశారని విమర్శించారు. తెలంగాణ ప్రజల్లో పూర్తి శత్రుభావం రాకముందే విడిపోవడం మంచిదన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement